ఢిల్లీ ఎన్నికలపై చంద్రబాబు జోస్యం !
కానీ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఢిల్లీ ఎన్నికల మీద తనదైన జోస్యం చెప్పేశారు.
By: Tupaki Desk | 9 Jan 2025 11:30 AM GMTఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు రూపంలో కొంత అంచనా అయితే అందుతుంది. అయితే అసలు ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడతాయి. అయితే నెల రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఈ ఎన్నికల విషయంలో ఆసక్తి అయితే అందరిలోనూ మెండుగా ఉంది.
దేశానికి రాజధానిగా ఢిల్లీ ఉంది. డెబ్బై అసెంబ్లీ సీట్లతో ఢిల్లీ శాసన సభ ఉంది. పదకొండేళ్ళుగా ఆప్ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి ఎన్నికలు చూస్తే యాంటీ ఇంకెంబెన్సీ భారీగా ఉండొచ్చు అన్నది బీజేపీ అంచనా. అందువల్ల తమకు ఈసారి చాన్స్ జనాలు ఇస్తారని ఆ పార్టీ భావిస్తోంది.
అందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఢిల్లీని ఈసారి పట్టేయాలని ప్రణాళికలూ రచిస్తోంది. మరో వైపు చూస్తే మహారాష్ట్ర హర్యానాలలో అంచనాలు తప్పి కన్ను లొట్టబోయిన ఇండియా కూటమికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్ ఆశా కిరణంగా కనిపిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ అక్కడ పోటీలో ఉన్నా ఆ పార్టీని పక్కన పెట్టి మరీ ఇండియా కూటమి పార్టీలు అన్నీ ఆప్ కి మద్దతు ఇస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీని ఆప్ ఓడిస్తే అది ఇండియా కూటమిని రాజకీయంగా ఎంతో బలం చేకూరుస్తుందని ఇండీ కూటమి నేతలు భావిస్తున్నారు. ఇక ఆప్ కూడా గట్టిగానే పోరాడుతోంది. అంత ఈజీగా అయితే ఆప్ అధికార పీఠం వదులుకునే చాన్స్ లేనే లేదు. బీజేపీ కూడా హర్యానా మహారాష్ట్రలలో మాదిరిగా తన వ్యూహాలను అమలు చేసేందుకు చూస్తోంది.
ఈ నేపధ్యంలో ఎవరు విజేత అంటే రాజకీయ పండితులు కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఢిల్లీ ఎన్నికల మీద తనదైన జోస్యం చెప్పేశారు. ఢిల్లీలో గెలిచేది బీజేపీయే అని బాబు అన్నారు. విశాఖ సభలో ప్రధాని మోడీ ముందే ఆయన ఈ విషయం చెప్పారు.
అంతే కాదు బాబులో ఎంతటి ధీమా ఉందో తెలియదు కానీ రాసి పెట్టుకోండి ఇదే జరిగి తీరుతుంది అని అన్నారు. మరి బాబు తలపండిన రాజకీయ నాయకుడు. ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి. జనం నాడి రాజకీయ గాలి కూడా ఆయన గమనించగలరు. ఏపీలో 2024 ఎన్నికల ఫలితాలను ఆయన ముందే ఊహించారు. అంతే కాదు కేంద్రంలో మరోసారి మోడీ అధికారంలోకి వస్తారని భావించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
అందువల్ల బాబు చెప్పారూ అంటే ఢిల్లీ రాజకీయంలో మార్పు తప్పదా అన్న అయితే ఉంది. బాబు ఆషా మాషీగా ఇలాంటి విషయాలలో మాట్లాడరు అని అంటారు. ఆయన చాలా ఓపెన్ గా చెప్పారు అంటే ఢిల్లీలో కమల వికాసం తధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. ఇది బీజేపీ శిబిరానికి ఉత్సాహన్ని ఇస్తోంది.