రాజ్యసభ మూడు ఖాళీల్లో బాబు మార్క్ ఎంపిక
ఏపీలో మూడు రాజ్యసభ సభ్యుల ఖాళీలు ఏర్పడ్డాయి. వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడంతో ఈ సీట్లు అలా ఖాళీ అయ్యాయి
By: Tupaki Desk | 28 Sep 2024 1:30 AM GMTఏపీలో మూడు రాజ్యసభ సభ్యుల ఖాళీలు ఏర్పడ్డాయి. వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడంతో ఈ సీట్లు అలా ఖాళీ అయ్యాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, అలాగే తాజాగా ఆర్ క్రిష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నారు.
ఈ మూడు సీట్లూ కూడా టీడీపీ కూటమికి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలం వల్ల కూటమికే కైవశం అవుతాయి. అలా చూస్తే ఈ మూడు ఎంపీ పదవులు ఏవరికి ఇస్తారు, ఎవరితో భర్తీ చేస్తారు అన్న చర్చ సాగుతోంది. ఏపీ నుంచి చూస్తే 11 మంది వైసీపీ ఎంపీలే ఉన్నారు. మొత్తం కొటా అంతా వైసీపీతో భర్తీ అయింది.
దాంతో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. ఈ పరిణామంతో కలత చెందిన టీడీపీ అధికారంలోకి రాగానే తనదైన శైలిలో పావులు కదిపింది. దానికి తగినట్లుగా వైసీపీ నుంచి రియాక్షన్ వచ్చింది. జగన్ ఎవరి మీద అయితే కడు నమ్మకంతో పదవులు ఇచ్చారో వారే హ్యాండ్ ఇచ్చి మరీ సైకిలెక్కేశారు. తమ పదవులను అలా వదిలేసుకున్నారు.
ఇక ఆర్ క్రిష్ణయ్య అయితే సైకిలెక్కేది లేదు, బీజేపీ వైపు వెళ్తారు అని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూడు ఖాళీలలో చంద్రబాబు ఎవరిని తీసుకుంటారు అంటే ప్రచారంలో ఉన్న పేర్లను తీసుకుంటే ముగ్గురుని బాబు ఎంపిక చేశారు అని ఖరారు కూడా చేస్తున్నారు అంటున్నారు.
అయితే ఇందులో టీడీపీకి రెండు ఎంపీలు, జనసేనకు ఒకటి ఇస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా తొలిసారి జనసేన పెద్దల సభలో అడుగులు పెడుతోంది అని అంటున్నారు. టీడీపీ రెండు జనసేన ఒకటి తీసుకుంటే బీజేపీ నుంచి ఎవరు అంటే అది జవాబు లేనిదే. అయితే బీజేపీకి ఈసారికి నచ్చచెబుతారని వేరేగా ఎమ్మెల్సీ కోటాలో చాన్స్ ఇస్తారని అంటున్నారు.
ఇక టీడీపీ ఎంపీలలో ఒకటి గల్లా జయదేవ్ కి కేటాయిస్తారు అని అంటున్నారు. అలాగే మరొకటి విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఇస్తారని అంటున్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని అశోక్ ని అలా తీసుకుంటున్నారు అని అంటున్నారు.
ఇక గల్లా జయదేవ్ వంటి వారు పెద్దల సభలో అవసరం అని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే జనసేనకు ఒక ఎంపీ సీటు ఇస్తున్నారు. ఆ ప్లేస్ లో నాగబాబుని పంపాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు అని అంటున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి లోక్ సభ సీటుని త్యాగం చేశారు. దాంతో ఆయనకు అవకాశం ఇస్తారని అంటున్నారు. ఇలా మూడు ఎంపీ సీట్లకు గానూ అభ్యర్ధులతో సహా ఎంపికలు పూర్తి అయ్యాయని అంటున్నారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడమే తరువాయి ఈ పోస్టులలో ఈ ముగ్గురు నామినేషన్లు వేస్తే ఏకగ్రీవం కావడమే మిగిలింది అని అంటున్నారు.