Begin typing your search above and press return to search.

"ఒకరిద్దరిని నడిరోడ్డుపై ఉరి తీస్తే"... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   2 Nov 2024 9:54 AM GMT
ఒకరిద్దరిని నడిరోడ్డుపై  ఉరి తీస్తే... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
X

గత కొంతకాలంగా కామందుల చేతిలో బలైపోతున్న చిన్నారుల జాబితాలో మరో పాప చేరింది! తిరుపతి జిల్లాలో మూడేళ్ల చిన్నారి హత్యాచార ఘటన సంచలనం రేపింది. వడమాలమేట మండలం, ఏఎంపురంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ దారుణం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

చాక్లెట్లు కొనిస్తాను అని మాయమాటలు చెప్పి, చిన్నారిని ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశాడనే విషయం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది! ఈ ఘటన అనంతరం పాప మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్ట్ మార్టం నిమిత్తం పుత్తూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... తిరుపతి జిల్లాలో మూడేళ్ల బాలికపై హత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతూ.. చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.

అనంతరం.. అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో రహదారులపై ఉన్న గుంత్లు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు... సమాజంలో పరమ నీచులు, దుర్మార్గులు ఉన్నారని.. నాలుగు సంవత్సరాల పిల్లలపై హత్యాచారలు చేస్తున్నారంటే.. వాళ్లు మనుషులా, మానవ మృగాలా అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే... చట్టం అనుమతిస్తే అలాంటి వాళ్లు ఒకరిద్దరిని నడిరోడ్డుపై ఉరి తీస్తే అప్పుడే అలాంటి ఆలోచనలు వచ్చేవాళ్లకు భయం వేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగినా, గంజాయి తీసుకున్నా.. ఆడబిడ్డలు ఆడబిడ్డలుగా కనిపించకుండా విలాస వస్తువులుగా చూస్తే ఈ దుర్మార్గుల్ని మామూలుగా వదిలితే అదుపులోకి రారని అన్నారు.

హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి:

తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మూడేళ్ల బాలికపై హత్యాచారం ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారిని చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడటం హేయమైన చర్య అని అన్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను హోంమంత్రి ఆదేశించారు.

కుటుంబాన్ని పరామర్శించిన రోజా, భూమన!:

వడమాలపేట మండలంలో హత్యాచారానికి గురైన చిన్నరి కుటుంబాన్ని శనివారం పుత్తురు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఆర్కే రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా స్పందించిన రోజా... రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్విర్యం అయిపోయిందని విమర్శించారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని.. దిశ యాప్ ను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.