చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదే.. ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు!
ఏటా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేవిధంగా పనిచేస్తామని ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చింది.
By: Tupaki Desk | 27 Feb 2025 9:30 AM GMTసంపద సృష్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెప్పే మాట ఇది. హైటెక్ సిటీతో ఇనకమ్ జనరేట్ చేశానని, ఇప్పుడు కూడా ఏఐ, డీప్ టెక్ వంటి కొత్త టెక్నాలజీతోపాటు సంపద సృష్టించే అనేక పథకాలకు రూపకల్పన చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అయితే ప్రతిపక్షం ఎప్పుడూ ఆయన మాటలను విమర్శిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటుంది. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్.. ఆయన చెప్పే సంపద సృష్టికి తొలి అడుగు పడబోతోంది. రిలయన్స్ కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్ల ద్వారా రాష్ట్రంలో ఒకేసారి రెండు లక్షల ఉద్యోగాలు రానున్నాయి. మరో రెండు నెలల్లోనే ఈ నియామకాలు జరగున్నట్లు చెబుతున్నారు.
ఏటా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేవిధంగా పనిచేస్తామని ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చింది. ఈ ప్రకారం అధికారంలోకి వచ్చిన నుంచి పెట్టుబడుల వేట సాగిస్తోంది. ఇక పెట్టబడుల ఒప్పందాల్లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటుకు 65 వేల కోట్లు ఒకేసారి పెట్టుబడి పెట్టనుంది రియలన్స్. ఈ మేరకు ఒప్పందం పూర్తి చేసుకున్నారు. భూములు కూడా కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మార్చి నుంచి పనులు చేపట్టి, వచ్చే రెండు నెలల్లోనే నియామకాలు చేపట్టే దిశగా రిలయన్స్ కూడా అడుగులు వేయనుంది. ఈ ఒప్పందం ఫలితంగా రిలయెన్స్ సంస్థ రాష్ట్రంలోని కరువు ప్రాంతాలుగా భావించే ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో తొలిగా బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ల ద్వారా ఒకేసారి సుమారు 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. కనీసం డిగ్రీ చదవిన వారికి ఉద్యోగాలు ఇవ్వనున్నారని చెబుతున్నారు. అదేవిధంగా విద్యార్హతతో సంబంధం లేకుండా కూడా కొందరికి ఉపాధి లభించనుందని చెబుతున్నారు. ఎందుకూ పనికిరాని భూముల్లో బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని అంటున్నారు. గడ్డి నుంకి గ్యాస్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ల వల్ల రైతులకు ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు.
బయో గ్యాస్ ప్లాంట్ల కోసం కేటాయిస్తున్న భూమికి లీజు కింద ప్రభుత్వ భూములకు రూ.15 వేలు, ప్రైవేటు భూములకు రూ.30 వేలు చెల్లించనున్నారు. ‘‘రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్’’ ద్వారా ఏర్పాటు కానున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల కోసం మొత్తం 4 వేల ఎకరాలను సేకరించనున్నారు. ఇందుకోసం పది రోజుల గడువు విధించింది ప్రభుత్వం. బయో గ్యాస్ ప్లాంట్ల పరిధిలో గడ్డి పెంచడం, ఆ గడ్డి నుంచి గ్యాస్ ఉత్తత్తి చేయనున్నారు. ఈ గ్యాస్ వినియోగం, రవాణా అన్నీ రాష్ట్ర పరిధిలో జరగాలని నిబంధన విధించారు. దీనివల్ల తక్కువ ధరకే ఎనర్జీ అందుబాటులోకి వస్తుందని, మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తానికి రిలయన్స్ ఎనర్జీ ద్వారా మరో రెండు నెలల్లోనే భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.