Begin typing your search above and press return to search.

ఆ కేసులో చంద్ర‌బాబు సేఫ్‌.. ఇక‌, తిరుగులేదా..?

2015 నాటి.. ఓటుకు నోటు కేసు విష‌యంలో సీఎం చంద్ర‌బాబుకు భారీ ఊర‌ట ల‌భించింది.

By:  Tupaki Desk   |   30 Aug 2024 4:50 AM GMT
ఆ కేసులో చంద్ర‌బాబు సేఫ్‌.. ఇక‌, తిరుగులేదా..?
X

2015 నాటి.. ఓటుకు నోటు కేసు విష‌యంలో సీఎం చంద్ర‌బాబుకు భారీ ఊర‌ట ల‌భించింది. ఈ కేసు విష‌యంలో ఆయ‌న‌కు కొన్నాళ్లుగా సంక‌ట స్థితి ఏర్ప‌డింది. అయితే.. తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం వెలువ‌రించింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే కొన‌సాగిస్తామ‌ని తెలిపింది. ఎందుకు దీనిని బ‌దిలీ చేయ‌మ‌ని కోరుతున్నారో.. పిటిష‌నర్‌కు కూడా స్ప‌ష్ట‌త లేద‌ని వ్యాఖ్యానించింది.

ఒక కేసును ఒక కోర్టు నుంచి మ‌రో కోర్టు కు బ‌దిలీ చేయ‌డానికి ప‌లు కార‌ణాలు ఉంటాయ‌ని.. అయితే.. పిటిష‌న‌ర్ ఒక్క కార‌ణాన్ని కూడా బ‌లంగా నిరూపించ‌లేక పోతున్నార‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో ఓటుకు నోటు కేసు తెలంగాణ‌లోనే కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇది చంద్ర‌బాబుకు ఊర‌ట నిచ్చే విష‌య‌మ‌ని అంటున్నారు న్యాయ నిపుణులు. అలా కాకుండా తెలంగాణ నుంచి బ‌దిలీ చేస్తే.. కొంత మేర‌కు ఇర‌కాటంలో ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఏం జ‌రిగింది..?

2015లో తెలంగాణలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ ఓటు కోసం.. అప్ప‌ట్లో రేవంత్‌రెడ్డి టీడీపీ త‌ర‌ఫున ప్ర‌లోభాల‌కు గురిచేశార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ కేసులో ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో న‌మోదైన కేసు.. అప్ప‌టి నుంచి తెలంగాణ హైకోర్టులో విచార‌ణ ద‌శ‌లో ఉంది. అయితే... ఈ కేసులో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ రేవంత్‌రెడ్డి, చంద్ర‌బాబులు ఇద్ద‌రూ ఇప్పుడు తెలంగాణ‌కు, ఏపీకి ముఖ్య‌మంత్రులుగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో వారు కేసు విచార‌ణ‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటూ.. బీఆర్ ఎస్ నాయ‌కుడు జ‌గ‌దీష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఈ కేసు విచార‌ణ‌ను మ‌ధ్య ప్ర‌దేశ్ హైకోర్టుకు బ‌దిలీ చేయాల‌ని కోరుతూ.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు రాగా.. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు ముఖ్య‌మంత్రులుగా ఉన్నంత మాత్రాన‌.. కేసును బ‌దిలీ చేయ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది.

అంతేకాదు.. ఈ ఆరోప‌ణ‌లకు బ‌ల‌మైన సాక్ష్యాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించింది. అయితే.. తాము అనుమానిస్తున్నామ‌ని.. అందుకే.. బ‌దిలీ చేయాల‌ని కోరుతున్నామ‌ని.. జ‌గదీష్ రెడ్డి త‌ర‌పున న్యాయ‌వాది.. సుంద‌రం కోర్టుకు విన్న‌వించారు. ఈ విన్న‌పాన్నికోర్టు తోసిపుచ్చుతూ.. ఓటుకు నోటు కేసును తెలంగాణ‌లోనే విచారించాల‌ని తేల్చి చెప్పింది. దీంతో చంద్ర‌బాబుకు ఓటుకు నోటు కేసులో భారీ ఊర‌ట ల‌భించింది.

మ‌రో కేసులోనూ..

మ‌హారాష్ట్ర‌లో బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచ‌డాన్ని నిర‌సిస్తూ.. 2010లో జ‌రిగిన ఆందోళ‌న‌లో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌పై దాడులు చేశారంటూ.. మ‌హారాష్ట్ర పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసు విచార‌ణ ద‌శ‌లోనే ఉంది. అయితే.. తాజాగా గ‌త వారం.. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఈ కేసులో చంద్ర‌బాబుపై విచార‌ణ‌ను ఉప‌సంహ‌రించుకుంటూ.. నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. ఈ కేసులో నిందితులుగా ఉన్న న‌క్కా ఆనంద‌బాబు స‌హా మ‌రికొంద‌రిపై మాత్రం విచార‌ణ జ‌ర‌గ‌నుంది.