Begin typing your search above and press return to search.

మరోసారి చంద్రబాబు, రేవంత్ భేటీ.. ఇరువురు ఏం చర్చించబోతున్నారు..?

ఏపీలో చంద్రబాబు, తెలంగాణ రేవంత్ రెడ్డి గెలుపొందాక ఇరు రాష్ట్రాల సీఎంలు తెలుగు రాష్ట్రాల వేదికగా ఒక్కసారి మాత్రమే కలుసుకున్నారు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 2:30 PM GMT
మరోసారి చంద్రబాబు, రేవంత్ భేటీ.. ఇరువురు ఏం చర్చించబోతున్నారు..?
X

ఏపీలో చంద్రబాబు, తెలంగాణ రేవంత్ రెడ్డి గెలుపొందాక ఇరు రాష్ట్రాల సీఎంలు తెలుగు రాష్ట్రాల వేదికగా ఒక్కసారి మాత్రమే కలుసుకున్నారు. కానీ.. విదేశాల్లో మాత్రం ఇప్పటికీ రెండుసార్లు కలిశారు. వీరిద్దరు మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ కూడా విదేశాల్లోనే జరగనుంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మరికొద్ది రోజుల్లోనే దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేత్తల వార్షిక సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం ఇండియా నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరుకాబోతున్నారు. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. వీరు ఐదు రోజుల పాటు దావోస్‌లో నిర్వహించనున్న సదస్సుకు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా 50 మంది దేశాధినేతలు, 100 కంపెనీలకు పైగా సీఈవోలు పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చే పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులతో సీఎం మాట్లాడే అవకాశం ఉంటుంది.

అలాగే.. భారత్‌లోని అనుకూల పరిస్థితులను ఆయా నేతలు ప్రెజెంట్ చేయనున్నారు. మరోవైపు ఆరు నెలల గ్యాప్‌లోనే సీఎం రేవంత్, సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. పెండింగులో ఉన్న అంశాలపై ఒకేఒక సందర్భంలో వీరు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. అదే సమయంలో విభజన సమస్యలపై మాట్లాడుకున్నారు. అయితే.. చాలా రోజుల తరువాత వీరు మరోసారి కలుసుకోబోతున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య ఎలాంటి చర్చ జరగబోతున్నదనే ఆసక్తి నెలకొంది.

గతంలో కేటీఆర్, జగన్ సైతం దావోస్ వెళ్లారు. వారు వెళ్లినప్పుడు ఇద్దరు ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించుకున్నారు. మరోసారి ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతుండడంపై ఇంకా ఏమైనా ఆసక్తికర పరిణామాలు ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది. వచ్చేనెల 20న ఈ సమావేశాలు జరగనున్నాయి. చంద్రబాబు సీఎంగా పనిచేస్తున్నప్పటి నుంచి ప్రతిసారీ ఆయన దావోస్ సదస్సుకు హాజరవుతుంటారు. ఏపీ సీఎంగా రెండో సారి బాధ్యతలు చేపట్టాక హాజరవుతుండడం ఇదే మొదటిసారి. అయితే.. ఈ భేటీలో రాజకీయ పరమైన వ్యవహారాలపై చర్చించేందుకు ఇక్కడ సమావేశం ఏమైనా ఏర్పాటు చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.