Begin typing your search above and press return to search.

బాబు వంద రోజుల పాలన ఎలా ఉంది ?

ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఇది కొత్త ఏమీ కాదు. ఆయన నాలుగవ సారి సీఎం అయ్యారు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 3:34 AM GMT
బాబు వంద రోజుల పాలన ఎలా ఉంది ?
X

ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఇది కొత్త ఏమీ కాదు. ఆయన నాలుగవ సారి సీఎం అయ్యారు. అయితే కొత్తదనం ఏమిటి అంటే 164 సీట్లతో బ్రహ్మాండమైన మెజారిటీతో కనీ వినీ ఎరగని విధంగా టీడీపీ రావడం అన్నది. చంద్రబాబు విభజన ఏపీకి రెండోసారి సీఎం.

దాంతో ఆయనకు అన్నీ తెలుసు. అదే విధంగా తన హయాంలో ఆగిపోయిన కార్యక్రమాలను గాడిన పెట్టడానికి ఆయన ఈ వంద రోజుల సమయం ఉపయోగించుకున్నారు బాబు వంద రోజుల పాలన గురించి జనాలను జడ్జిమెంట్ ఇవ్వమంటే వారు కూడా ఇది చాలా తక్కువ సమయం అని అంటారు.

అయితే వంద రోజుల పాలనలో బాబు సాధించింది ఏమిటి అంటే ఆయన కొన్ని కార్యక్రమాల మీద సంతకాలు పెట్టారు. అందులో 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీని తీయడం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం, పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల దాకా పెంచడం, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం, యువ టాలెంట్ ని వెలికి తీసేందుకు స్కిల్ సెన్సస్ తీస్తామని హామీ ఇవ్వడం.

ఇక బాబు ఏ అంటే అమరావతి అన్నారు. ఇపుడు అమరావతికి ఒక రూపు తీసుకుని రావడానికి ఆయన చూస్తున్నారు. దాని కోసం కేంద్ర సాయం ప్రపంచ బ్యాంక్ సాయాన్ని ఆయన సంపాదించారు. అమరావతి రాజధాని బాబు హయాంలో పూర్తి అవుతుంది అన్న నమ్మకాన్ని ఆయన తొలి వంద రోజులలో కలిగించగలిగారు.

అలాగే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అడుగులు ముందుకు పడుతున్నాయి. నవంబర్ నుంచి ఈ ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకుంటాయని అంటున్నారు. బాబు సీఎం అయ్యాక 12 వేల కోట్ల రూపాయల దాకా నిధులు కేంద్రం నుంచి మంజూరు చేయించగలిగారు. అలా పోలవరం ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది అన్న ఆశను పెంచారు.

అలాగే తనకు ఉన్న అనుభవం పలుకుబడితో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మందిని ఆహ్వానించే కార్యక్రమం అయితే బాబు చేపడుతున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండడం బాబుకు సానుకూలంగా ఉంది. దాంతో పెట్టుబడులు ఎక్కువగా తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని బాబు ఆలోచనలు అయితే సాగుతున్నాయి.

అదే సమయంలో బాబుకు రాష్ట్ర ఖజానా ఇబ్బంది పెడుతోంది. ఆయన ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల బెజవాడ ను ముంచెత్తిన భారీ వరదలు అగ్ని పరీక్షనే పెట్టాయి. అయితే బాబు తన అనుభవాన్ని రంగరించి తొలి రోజుల్లో వచ్చిన వ్యతిరేకత తగ్గించుకున్నారు. తానే ఏకంగా పది రోజుల పాటు జనంలో ఉండి వరద బీభత్సాని ఎదుర్కొన్నారు. అలా బాబు సంక్షోభంలో సైతం మార్కులు సాధించగలిగారు

ఇపుడు వరద బాధితులకు తగిన సాయం చేయడం ద్వారా మరింతగా మంచి చేశారు అనిపించుకుంటున్నారు. అయితే ఇవన్నీ నాణేనికి ఒకవైపు. రెండవ వైపు చూస్తే లా అండ్ ఆర్డర్ కొంత ఇబ్బందిగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినా మహిళల మీద అత్యాచారాలు ఆగడం లేదు.

అలాగే రాష్ట్రంలో రాజకీయ ప్రతీకారాలు కూడా పెరిగిపోయాయి. దాంతో ఆ మచ్చ కూడా పడుతోంది. ఇంకో వైపు ఉచిత ఇసుక పాలసీని తెచ్చి నిర్మాణ రంగన్ని పదిలపరచినా నియోజకవర్గాల్లో అవినీతి దందాలు చేసే పార్టీలో కొందరి వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బ తింటోంది అని అంటున్నారు.

ఇక సూపర్ సిక్స్ హామీల విషయంలో కూడా అడుగులు ముందుకు పడలేదు. మహిళలకు ఉచిత బస్సు అని అన్నారు.అది లేదు, అలాగే 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1500 అని చెప్పారు. అదీ అమలు కాలేదు. నిరుద్యోగ యువతకు భృతి అని అన్నారు. అదీ ఊసు లేకుండా పోయింది. తల్లికి వందనం అని ఎంత మంది ఇంట్లో పిల్లలు ఉంటే అందరికీ ఏడాదికి 15 వేలు ఇస్తామని చెప్పారు. కానీ అది కూడా అమలు జరగలేదు.

ఉచిత గ్యాస్ సిలెండర్లు ఏడాదికి మూడు ఇస్తామని రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా హామీలు ఇచ్చారు. కానీ అది కూడా ఏమీ అమలు కాలేదు. మొత్తం మీద చూస్తే ఈ హామీల విషయంలో జనాలలో అయితే కొంత అసంతృప్తి ఉంది. కానీ చంద్రబాబు ఇస్తారు అని భరోసా అయితే ఈ వంద రోజులలో ఉంది.

మరోవైపు అచ్చం వైసీపీ సర్కార్ వ్యవహరించినట్లుగానే టీడీపీ వ్యవహరిస్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీకి అనుకూలమని కొందరు పోలీసు అధికారుల విషయంలో చర్యలు తీసుకోవడం అలాగే వైసీపీ నేతలను టార్గెట్ చేసి వారి మీద కేసులు పెట్టడం అరెస్ట్ చేయించడం వంటివి ప్రభుత్వం దూకుడుని చెబుతోంది. ఇది రాజకీయంగా చేస్తున్నా ప్రజలలో ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయితే ఇబ్బంది వస్తుంది అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే చంద్రబాబు వంద రోజుల పాలన అన్నది ఇంకా మొదటి ముద్ద తింటూ భోజనం మొత్తం బాగుందా అని అడిగినట్లుగా ఉంది.కనీసం మరో ఆరు నెలల దాకా టైం ఇస్తే ప్రభుత్వం నడక అన్నది తెలుస్తుంది అని అంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. సో హండ్రెడ్ డేస్ అన్నది వైసీపీ విపక్షంగా విమర్శలు ఎంత చేసినా జనాలు గొంతు కలపని హానీ మూన్ పీరియడ్ గానే చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.