సంక్రాంతి అంటే చంద్రబాబే !
ఏపీలో ఎందరో సీఎంలుగా పనిచేశారు. అయితే వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకత వేరుగా ఉంటుంది అని చెప్పాలి.
By: Tupaki Desk | 14 Jan 2025 3:30 PM GMTఏపీలో ఎందరో సీఎంలుగా పనిచేశారు. అయితే వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకత వేరుగా ఉంటుంది అని చెప్పాలి. ఆయన ఎంతటి బిజీ నాయకుడు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన విపక్షంలో ఉన్నప్పుడే ఖాళీగా ఉండరు. అటువంటిది అధికారంలో ఉంటే ఇంకెంత బిజీగా మారుతారు అన్నది కూడా చెప్పకుండానే అర్ధం చేసుకోవచ్చు.
కానీ చంద్రబాబు ఎన్ని పనులలో బిజీగా ఉన్నా సంక్రాంతి పండుగ మూడు రోజులు మాత్రం తన సొంత ఊరు సొంత ఇంట్లో బంధు జనాలతో చుట్టాలతో పక్కాలతో ఊరి జనాలతో చంద్రబాబు కలసి మెలసి జరుపుకునే సంక్రాంతి పండుగ నిజంగా ఒక స్పూర్తిగానే చూడాలి.
బాబు ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నో పండుగలకు తన సొంత ఊరు నారావారిపల్లెకు వచ్చారు. ఈసారి బాబు రారేమో అని అంతా అనుకున్నారు. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు గత ఏడాది మరణించారు. దాంతో బాబు ఫ్యామిలీ రాదని అనుకున్నా ఆయన ఆ బాధను అణచుకుని ఆనవాయితీకి పెద్ద పీట వేశారు.
నారావారిపల్లెలో ఆయన భోగి సంక్రాంతి వేడుకలలో ఫుల్ బిజీగా గడిపారు. భార్య, కుమారుడు కోడలు మనవడితో ఆయన సందడి చేశారు. రాష్ట్ర అధినేతగా ఎంతటి తీరిక లేని కార్యక్రమాలతో సతమతంగా ఉండే బాబుకు ఏడాదిలో ఈ మూడు రోజుకే మంచి బూస్టప్ ఇస్తాయని చెబుతారు.
బాబు అలా సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకు వెళ్లాలన్న సంప్రదాయాన్ని ఈనాటి తరానికి కూడా పరిచయం చేసి వారిలో స్పూర్తిని నింపారు అని చెప్పాలి. గ్రామాలలో ఉన్న వారితో కలసి మెలసి ఉండడం అన్నది ఒక రాష్ట్రాన్ని ఏలే సీఎం తాను అమలు చేస్తూ ఇతరులు ఆచరించేలా చూడడమే ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం.
ఎంతటి ఉన్నత పదవులలో ఉన్నామన్నది విశేషం కాదు, ఎంత గొప్ప స్థానాలలో ఉన్నా ఉన్న ఊరుని కన్న తల్లిని మరచిపోరాదు అన్న సంక్రాంతి సందేశాన్ని బాబు దశాబ్దాలుగా తెలుగు జాతికి అందిస్తున్నారు. చాలా మంది పాలకులకు కూడా ఆయన ఈ విధంగా ఆదర్శంగా ఉన్నారు. బాబుని చూసి సొంతూళ్ళకు వెళ్లే రాజకీయ నేతలు కీలక పదవులలో ఉన్న వారు కూడా ఎక్కువ అయ్యారు అంటే అది కచ్చితంగా ఆయన ఘనతే అని చెప్పాలి.
ఇదిలా ఉంటే బాబు సంస్కృతి సంప్రదాయాలకు ఎంతగా పెద్ద పీట వేస్తారో ఆచారాలను ఆనవాయితీలను ఎంతగా ప్రేమిస్తారో ఆయన సంక్రాంతి సంబరాలు జరుపుకునే తీరు చెబుతుంది అని అంటారు. ఆయన తమ ఇలవేలుపు అయిన గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం, గ్రామాలలో ఆటపాటల పోటీలను నిర్వహించడం గ్రామీణ వాతావరణాన్ని మరింతగా ప్రోత్సహించడం వంటివి నేటి రేపటి తరం పాలకులు కచ్చితంగా నేర్వాల్సిన విషయాలు అని చెప్పాలి.
చాలా మంది పాలకులు ఈ దేశంలో పండుగలు వస్తే తమకు తాముగా సెలెబ్రేషన్స్ చేసుకుంటారు కానీ తన సొంత లోగిళ్లకు పెద్దగా వెళ్లరు. బాబు మాత్రం పూర్తి డిఫరెంట్ అని ఈ విషయంలో చెప్పాలి. ఏది ఏమైనా చంద్రబాబు సంక్రాంతిని విడదీయలేమని చెబుతారు. ఆయనను అంతా సంక్రాంతి బాబుగా కూడా ముద్దుగా పిలుస్తారు. అందువల్ల సంక్రాంతి వస్తోంది అంటే ఏపీ అంతా నారావారిపల్లె వైపు ఆసక్తిగా చూస్తుంది. అలా దటీజ్ చంద్రబాబు అనిపించేశారు మన సీఎం.