బాబు కొత్త నినాదం...యూత్ టార్గెట్ గా !
స్థానికంగా యువత పారిశ్రామికవేత్తలుగా మారితే వారికి ఉపాధితో పాటు మరో పది మందికి ఉపాధి దక్కుతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 2 Nov 2024 4:30 PM GMTఉత్తరాంధ్రా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త నినాదాన్ని జనంలోకి పంపించారు. ఆయన అనకాపల్లి జిల్లాలో రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ దేశంలోనే భారీ పారిశ్రామికవేత్త ఇటీవల కన్ను మూసిన రతన్ టాటా తనకు స్పూర్తి అని అన్నారు.
ఆయన స్పూర్తిని తీసుకుంటూ ప్రతీ ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్పారు. ఈ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. పారిశ్రామికవేత్తగా మారాలనుకునే వారికి ఆకాశమే హద్దు అని ఆయన అన్నారు. వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వస్తే వారికి తగిన ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్పారు.
పారిశ్రామికంగా ఏపీ ముందుకు సాగాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని బాబు అంటున్నారు. స్థానిక పరిస్థితులను ఆకలింపు చేసుకుని దానికి అనుగుణంగా పారిశ్రామిక వేత్తలు ప్రతీ ఇంటి నుంచి వస్తే ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంటుందని బాబు చెప్పుకొచ్చారు.
దానికి అనుగుణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త పారిశ్రామిక పాలసీని కూడా రూపకల్పన చేస్తుందని ఆయన చెప్పారు. ఒక వైపు అయిదేళ్లలో ఇరవై లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఇపుడు ప్రతీ ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త అన్న కొత్త కాన్సెప్ట్ ని ఎంచుకుంది.
దీని ద్వారా ఏపీలో సమూలంగా నిరుద్యోగ సమస్యను అధిగమించవచ్చు అని భావిస్తోంది. స్థానికంగా యువత పారిశ్రామికవేత్తలుగా మారితే వారికి ఉపాధితో పాటు మరో పది మందికి ఉపాధి దక్కుతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.
చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు ఈ విధంగా విశేష ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. దేశంలో కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాన్సెప్ట్ బాగా వినిపిస్తోంది. అంతే కాదు అవే బాగా సక్సెస్ అవుతున్నాయి. ఎక్కువ పెట్టుబడి అవసరం లేకుండా స్థానిక అవసరాలకు తగినట్లుగా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే పారిశ్రామిక కళ కడుతుందని అంతే కాదు ఉపాధికి భారీగా అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
చంద్రబాబు అయితే ఈసారి ఏపీలో పారిశ్రామిక విధానమే తమ అజెండా అంటున్నారు. ఏపీకి అద్భుతమైన విశాలమైన తీర ప్రాంతం ఉందని అలాగే సహజ వనరులు ఉన్నాయని మానవ వనరులకు తెలివికి కొరత లేదని ప్రభుత్వం కూడా దానికి తగిన విధంగా చేయూతను ఇస్తుందని దానిని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత యువతరం పైన ఉందని అంటున్నారు.
నిజంగా ఉద్యోగం కోసం వెతకడం కంటే తామే సొంతంగా పరిశ్రమలను ప్రారంభించడం అన్నది యువతకు మంచిదే అని అంటున్నారు. అయితే దానికి అవసరమైన పెట్టుబడులు అనుమతులు అన్నీ ప్రభుత్వం చూసుకుంటే మాత్రం యువత పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగం వైపు మొగ్గు చూసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తే ఏపీ పారిశ్రామిక ఆర్థిక వృద్ధి రేటు కూడా పెరుగుతుందని అంటున్నారు
ఇక చూస్తే కనుక భారీ పరిశ్రమల కంటే కూడా చిన్న తరహా పరిశ్రమల వల్లనే ఆదాయాలు ఎక్కువగా వస్తాయని కూడా అంటున్నారు. ప్రభుత్వానికి కూడా ఇదే మంచిది అని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఈ నినాదం రానున్న రోజులలో ఏపీలో ఏ మార్పునకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.