Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు ఒక్క ప్ర‌క‌ట‌న‌తో త‌మ్ముళ్లకు బ్రేకులు!!

దీంతో టీడీపీ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌కు త‌మ్ముళ్ల దూకుడుపై ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయి.

By:  Tupaki Desk   |   27 Oct 2024 10:30 PM GMT
చంద్ర‌బాబు ఒక్క ప్ర‌క‌ట‌న‌తో త‌మ్ముళ్లకు బ్రేకులు!!
X

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న హ‌డావుడి.. ఇసుక‌, మ‌ద్యం వంటి కీలక అంశాల్లో వారు చేస్తున్న దూకుడు వంటివి స‌ర్కారు చెడ్డ పేరు తెస్తున్నాయ‌ని ప‌దే ప‌దే చెబుతున్న సీఎం చంద్ర‌బాబు తాజాగా త‌మ్ముళ్ల‌కు బ్రేకులు వేశారు. వాస్త‌వానికి గ‌త మూడు మాసాలుగా కూడా.. త‌మ్ముళ్ల‌కు హెచ్చ‌రిక‌లు చేస్తూనే ఉన్నారు. ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకురావ‌ద్ద‌ని చెబుతున్నారు. అయినా.. చాలా మంది పెడ‌చెవిన పెట్టారు. దీంతో టీడీపీ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌కు త‌మ్ముళ్ల దూకుడుపై ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌ను అదుపు చేసేందుకు సొంత కేడ‌ర్‌కే ప‌గ్గాలు అప్ప‌గించా రు. ``తిర‌గ‌బ‌డండి .. నేను చూసుకుంటా. కేసులు కూడా పెట్టం`` అని ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. మ‌రి ఇంత‌గా చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డానికి కార‌ణం.. సొంత పార్టీ కేడ‌ర్‌నే త‌మ్ముళ్లు ఇబ్బంది పెడుతున్నార‌న్న‌ది వాస్త‌వం కాబ‌ట్టేన‌ని అర్ధ‌మ‌వుతోంది. ఎక్క‌డైనా ఇసుక విష‌యంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నా.. లంచాలు అడిగినా.. ప్ర‌శ్నించి.. అవ‌స‌ర‌మైతే.. తిర‌గ‌బ‌డాల‌ని చెప్పారు.

ఇక‌, మ‌ద్యం షాపుల విష‌యంలోనూ చంద్ర‌బాబు ఇదే సూచ‌న‌లు చేశారు. చాలా చోట్ల మ‌ద్యం దుకాణ దారుల నుంచి నాయ‌కులు వాటాలు తీసుకుంటున్నారు. ఇవి ఇవ్వ‌లేమ‌న్న వారిపై దాడులు చేస్తున్నా రు. దుకాణాలను కూడా లాగేసుకుంటున్న ఘ‌ట‌న‌లు గుంటూరు, ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాల్లో క‌నిపి స్తున్నాయి. ఈ ప‌రిణామాలు ప్ర‌ధాన మీడియాలోనే హైలెట్ కావ‌డంతో చంద్ర‌బాబు అలెర్ట్ అయ్యారు. వీటికి త‌క్ష‌ణ ఫుల్ స్టాప్ పెట్టాల‌ని అన్నారు.

అయినా.. త‌మ్ముళ్లు వినిపించుకోక‌పోవ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న తిర‌బాటు చేయాలంటూ.. సొంత కేడ‌ర్‌కే ప‌గ్గాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామంతో అయినా.. త‌మ్ముళ్లు మార‌తార‌ని ఆయ‌న భావ‌న అయి ఉండాలి. అయితే.. ఈ తిరుగుబాట్ల కార‌ణంగా.. ర‌గ‌డ మ‌రింత పెరుగుతుంద‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. ఎవ‌రైనా త‌మ‌పై తిరుగుబాటు చేస్తే.. ఊరుకునే టైపులో నాయ‌కులు ఉన్నారా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఏదేమైనా చంద్ర‌బాబు ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం ఏమేరకు మార్పు తెస్తుందో చూడాలి.