వైసీపీ.. మత చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది: చంద్రబాబు ఆగ్రహం
ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ నాయకుల విష ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నాయకులకు పిలుపునిచ్చారు.
By: Tupaki Desk | 15 April 2025 2:46 PMరాష్ట్రంలో వైసీపీ మత చిచ్చు పెట్టి.. కులాలు, మతాల మధ్య గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందని సీఎం చంద్రబాబు ఆగ్ర హం వ్యక్తం చేశారు. గత వారం రోజుల్లో జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. మంగళవారం సుదీర్ఘంగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. వీటిలో గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సువార్తీకుడు.. ప్రవీణ్ కుమార్ అంశంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల అంశాలను కూడా చర్చించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ నాయకుల విష ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి వెళ్లకుండా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. ముఖ్యంగా సమాజంలో ఇలాంటివి ప్రచారం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వంపై విషాన్ని చిమ్మాలని వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసి.. అలజడి సృష్టించేందుకు భూమన చేసిన ప్రయత్నాన్ని.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు సమర్థంగా స్పందించారని అన్నారు.
అదేవిధంగా క్రిస్టియన్లకు ఏదో జరిగిపోతోందని.. ఈ ప్రభుత్వంలో రక్షణలేకుండా పోయిందని పాస్టర్ ప్రవీణ్ అంశాన్ని కూడా వైసీపీ తన రాజకీయ ప్రయోజనాలకు, సమాజంలో చిచ్చు పెట్టి.. క్రిస్టియన్లలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిందన్నారు. అయితే.. దీనిని పోలీసులు తిప్పికొట్టారన్నారు. ఎప్పటికప్పుడు సీసీ టీవీ ఫుటేజీలు బహిరంగ పరిచి.. వైసీపీ వాదనకు విరుగుడుగా వ్యవహరించారని చంద్రబాబు చెప్పారు.
భవిష్యత్తులోనూ వైసీసీ ఇలాంటి విష ప్రచారాలకు దిగే అవకాశం ఉందన్న చంద్రబాబు.. ఇలాంటి విషయాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. ఇకపై ఇలాంటి ప్రచారాలు చేసేవారికి తగిన విధంగా బుద్ధి చెప్పేలా.. చట్టాలను సమర్థంగా వినియోగించాలని పోలీసు అధికారులకు సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు అనేక కుయుక్తులు పన్నుతున్న వైసీపీని గట్టిగా నిలువరించాలని ఆయన కోరారు.