పరిటాల హత్య కేసును తీసుకొచ్చి కొత్త రచ్చకు తెర తీసిన బాబు!
టీడీపీ నేత పరిటాల రవి దారుణ హత్య కేసులోని కీలక నిందితులు ఒకరు తర్వాత ఒకరు చొప్పున అనుమానాస్పదంగా మరణించటం సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 9 March 2025 9:41 AM ISTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక సాక్ష్యలు ఒక్కొక్కరుగా మరణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వాచ్ మెన్ రంగయ్య మరణించారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో వైఎస్ వివేకా హత్య కేసులోకీలక సాక్ష్యుల వరుస అనుమానాస్పద మరణాల అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పుడు చోటు చేసుకుంటున్న అనుమానాస్పద మరణాల్ని చూసినప్పుడు టీడీపీ నేత పరిటాల రవి దారుణ హత్య కేసులోని కీలక నిందితులు ఒకరు తర్వాత ఒకరు చొప్పున అనుమానాస్పదంగా మరణించటం సంచలనంగా మారింది.
ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ.. చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పరిటాల రవి హత్య కేసు.. దాని అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు చర్చకు వస్తున్నాయి. పెనుకొండ ఎమ్మెల్యేగా పలుమార్లు.. మంత్రిగా పని చేసిన పరిటాల రవి ఫ్యామిలీకి.. గంగుల నారాయణరెడ్డి కుటుంబానికి ఫ్యాక్షన్ గొడవలు ఉండటం తెలిసిందే. వీరి మధ్య దశాబ్దాల పాటు సాగిన గొడవలు పలు హత్యలకు కారణమైంది. పరిటాల రవిని చంపేందుకు 1997లో జూబ్లీహిల్స్ లో బాంబు పెట్టగా ఆయన త్రుటిలో తప్పించుకున్నారు.
2004లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టటం.. పెనుకొండ ఎమ్మెల్యేగా పరిటాల రవి గెలవటం తెలిసిందే. 2005 జనవరి 24న టీడీపీ జిల్లాఆఫీసులో పరిటాల రవిని పిస్టల్ తో కాల్చి చంపేయటం తెలిసిందే. పరిటాల రవిని కాల్చి చంపిన కేసులో రెండో నిందితుడు మొద్దు శ్రీను. హత్య తర్వాత ఒక టీవీ చానల్ తో మాట్లాడుతూ.. సూరి బావ కళ్లల్లో ఆనందం కోసమే తాను చంపినట్లుగా చెప్పటం పెను సంచలనంగా మారింది.
జైల్లో ఉన్న మొద్దుశ్రీను 2008 నవంబరు 9న అనంతపురం జైల్లో దారుణహత్యకు గురయ్యారు. జైలు గదిలో ఉన్న మొద్దుశ్రీను మరో ఖైదీ మల్లెల ఓంప్రకాష్ సిమెంట్ డంబెల్ తో మోది చంపేసినట్లుగా అధికారులు వెల్లడించారు. అతడు చివరిసారి 2007 ఏప్రిల్ లో అనంతపురం కోర్టులో విచారణకు హాజరై.. తాను చేసిన పాపానికి అప్రూవర్ గా మారి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని మొద్దు శ్రీను ప్రకటించాడు. ఆ తర్వాతే హత్యకు గురి కావటం గమనార్హం.
రాష్ట్రంలో చిన్న బాస్ ఫ్యాక్షన్ హత్యలు ఎక్కువ అయ్యాయని.. హత్యకు సహకరించిన పెద్దలు ఎవరో కోర్టులో వెల్లడిస్తానని చెప్పిన కొన్నాళ్లకే హత్యకు గురయ్యాడు. హత్య జరిగినప్పుడు జైళ్ల శాఖ అదనపు ఐజీలు ఇద్దరూ ఫారిన్ టూర్లలో ఉండటం.. జిల్లా జైలు సూపరింటెండెంట్ సెలవు పెట్టటం.. ఇన్ ఛార్జి అదనపు సూపరింటెండెంట్ వరుణా రెడ్డి బ్యారక్ లో ఉండే ఓంప్రకాశ్ ను మొద్దు శ్రీను బ్యారక్ లో పంపటం.. పదిహేను రోజుల్లోనే మొద్దు శ్రీనును చంపేయటంతో ఈ అంశం పెను దుమారానికి కారణమైంది.
పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మద్దెల చెరువు సూరిని 2011 జనవరి మూడున హైదరాబాద్ యూసఫ్ గూడ లో దారుణ హత్యకు గురయ్యాడు. అతడికి అత్యంత సన్నిహిత అనుచరుడైన భానుకిరణ్ అతన్ని కాల్చి చంపాడు. రవి హత్యపై బెయిల్ మీద వచ్చిన సూరి.. ఏడాది తర్వాత హత్యకు గురయ్యాడు. పరిటాల రవి హత్య కేసులో ఆయుధాలు సమకూర్చినట్లుగా ఆరోపణలతో పాటు.. ప్రత్యక్షంగా మర్డర్ వేళ పాల్గొన్న ఆరోపణలు ఉన్న గ్యాంగ్ స్టర్ అజీజ్ రెడ్డి 2008 మే ఒకటిన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.
డబ్బుల కోసం అజీజ్ రెడ్డి బెదిరిస్తున్నట్లుగా ఒక సినీ నిర్మాణ సంస్థ మేనేజర్ సాయంత్రం కంప్లైంట్ ఇస్తే.. పోలీసులు అదే రోజు రాత్రి అతడ్ని ఎన్ కౌంటర్ చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. అజీజ్ రెడ్డి తమకు వెంకటరెడ్డి ద్వారా ఆయుధాల్ని సమకూర్చినట్లుగా విచారణలో మొద్దు శ్రీను చెప్పారు. కొన్నాళ్లకు వెంకట్ రెడ్డి కూడా హత్యకు గురయ్యారు. దీంతో ఆయుధాల్ని సమకూర్చిన అంశానికి సంబంధించి కీలక సమాచారాన్ని చెప్పే ఇద్దరు అనుమానాస్పదంగా మరణించటంతో ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చింది ఎవరు? అన్నది బయటకు రాలేదు.
పరిటాల రవి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత అతడి డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ టీంలో సహాయకుడిగా ఉన్న మల్లికార్జున కొన్నాళ్లకు అనుమానాస్పద రీతిలో మరణించాడు. రైల్లో నుంచి దూకి చనిపోయారన్న ప్రచారం జరిగింది. పరిటాల రవి హత్యకు ముందు జూబ్లీమిల్స్ బాంబు పేలుడుకేసులో సూరి చర్లపల్లి జైల్లో ఉండేవాడు. అప్పట్లో జైల్లో డాక్టర్ సాంబశివరావు అతడికి సెల్ ఫోన్లు అందించేవాడు.
సూరి వాటిలోనే మాట్లాడి పరిటాల రవి హత్యకు ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రవి హత్య తర్వాత కొద్ది రోజులకే డాక్టర్ సాంబశివరావు అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆయన కూడా రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. మొద్దు శ్రీను ను జైల్లో చంపేసి.. జీవితఖైదు పడ్డ ఓంప్రకాశ్ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉండేవారు. 2020 జులైలో కిడ్నీలు దెబ్బ తినటంలోచనిపోయినట్లుగా జైలు అధికారులు వెల్లడించారు. ఇలా.. పరిటాల రవి హత్య కేసులో లింకు ఉన్న కీలకమైన వారంతా మరణించటం గమనార్హం.