జగన్ అనుభవం.. బాబుకు పాఠం.. !
కట్ చేస్తే.. ఈ అనుభవాలను జగన్‌కు ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు గ్రహించారు. అందుకే ఆయన ఈ మూడు సూత్రాలను పాటిస్తున్నారు.
By: Tupaki Desk | 17 March 2025 7:00 AM ISTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు ఎదురైన అనుభవం చాలా పెద్దదే. అయితే.. ఆయన దాని నుంచి ఎంత వరకు పాఠాలు నేర్చుకున్నారనేది పక్కన పెడితే.. ఈ అనుభవాన్ని నిరంతరం గమనించిన.. ప్రస్తుతం సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. బాగానే ఒంటబట్టించుకున్నారన్నది ఆయన మాటలను బట్టి స్పష్టంగా అర్ధమవుతోంది. ముఖ్యంగా 3 విషయాల్లో జగన్ వ్యవహరించిన తీరు.. ఆయనను 151 స్థానాల నుంచి 11కు పడదోశాయి.
1) పార్టీ కార్యకర్తలను విస్మరించడం. 2) గెలిచిన తర్వాత.. ప్రజలను పెద్దగా పట్టించుకోకపోవడం. 3) ప్రతిపక్షాలను లైట్ తీసుకోవడం. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఈ మూడు విషయాలే వైసీపీకి పెను శాపంగా పరిణమించాయి. అధికారం నుంచి దింపేశాయి. ఈ విషయాలు ఇంకా జగన్‌కు అర్ధమైనట్టుగా లేదు. అందుకే.. ఎన్నికలు జరిగి ఏడాది అవుతున్నా.. ఇప్పటి వరకు ఆయన ప్రజల మధ్యకు వచ్చింది లేదు. పార్టీని సవ్యమైన దిశలో నడిపించింది కూడా లేదు.
కట్ చేస్తే.. ఈ అనుభవాలను జగన్‌కు ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు గ్రహించారు. అందుకే ఆయన ఈ మూడు సూత్రాలను పాటిస్తున్నారు. గత రెండు మాసాల కిందటి నుంచి చంద్రబాబు వైఖరిని గమనిస్తే.. ఎంత బిజీగా ఉన్నా.. పార్టీ కార్యకర్తలకు సమయం ఇస్తున్నారు. ఎక్కడ తప్పు దొర్లినా.. ఆయన వెంటనే రంగంలోకి దిగుతున్నారు. ఎమ్మెల్యేలు.. కొలికపూడి శ్రీనివాసరావు, అరవిందబాబు, బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి వంటి వారితోపాటు చాలా మందిని చక్కదిద్దారు.
తద్వారా.. జరుగుతున్న తప్పులను పార్టీ తరఫున దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ప్రజల వద్దకు వెళ్లే విషయంలోనూ చంద్రబాబు ప్రతి నెలా 1వ తారీకును ఆయుధంగా మార్చుకున్నారు. సామాజిక భద్రతా పింఛన్లు తనే స్వయంగా పంచుతున్నారు. సమయం, సందర్భం చూసుకుని ప్రజల మధ్యకు వస్తున్నారు. ఇది.. ప్రజలకు సీఎంను కనెక్ట్ చేస్తోంది.
ఇక, మూడో అంశం.. కీలకమైంది.. వైసీపీకి 11స్థానాలే వచ్చినా.. ఆ పార్టీని నిరంతరం.. ఇంకో మాటలో చెప్పాలంటే.. క్షణక్షణం.. టార్గెట్ చేస్తున్నారు. అప్పులు చేశారని, రాష్ట్రాన్ని నాశనం చేశారని.. వైసీపీని ఎండగడుతూనే ఉన్నారు. తద్వారా ప్రతిపక్షానికి సింపతీ పెరగకుండా.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మూడు సూత్రాలను జగన్ విస్మరిస్తే.. చంద్రబాబు పక్కాగా ఫాలో అవుతూ.. పాటిస్తున్నారు.