బాబు మార్క్ విజన్ 2047...ఆ ఇమేజ్ తో మరోసారి
చిత్రమేంటి అంటే బాబు 2004లో ఉమ్మడి ఏపీలో అధికారం కోల్పోయారు. 2014లో విభజిత ఏపీకి సీఎం అయ్యారు.
By: Tupaki Desk | 28 Sep 2024 5:15 PM GMTచంద్రబాబు అంటే ఉమ్మడి ఏపీలో వినిపించే నినాదం ఒకటి ఉంది. అదే విజన్ 2020. ఆ విధంగా బాబు అప్పట్లో కొత్త రకం స్లోగన్ తో జనంలో పాపులర్ అయ్యారు. ఆయన దార్శనికుడు, దశాబ్దాల అభివృద్ధిని ముందే చూసే మేధావి అని ఆ నినాదంతోనే పేరు వచ్చింది
చిత్రమేంటి అంటే బాబు 2004లో ఉమ్మడి ఏపీలో అధికారం కోల్పోయారు. 2014లో విభజిత ఏపీకి సీఎం అయ్యారు. అయిదేళ్ల తరువాత 2020లో ఆయన మాజీ సీఎం గా ఉన్నారు. అలా 2020 నాటికి బాబు విజన్ కంటిన్యూగా సాగిందా అంటే మధ్యలో రాజకీయంగా ఒడుదుడుకుల వల్ల సాగలేదు అనే చెప్పాలి.
ఇక చూస్తే బాబు 2024లో సీఎం అయ్యాక కొత్త నినాదం తీసుకున్నారు. ఆయన వికసిత్ ఆంధ్రా అని బీజేపీ వికసిత్ భారత్ కి పర్యాయంగా వాడారు. అదే సమయంలో విజన్ 2047 అని కూడా తనదైన మరో స్లోగన్ ని అందుకున్నారు. ఈ రాష్ట్రం 2047 నాటికి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని బాబు తరచూ చెబుతున్నారు
విజన్ 2047 అంటే మరో 23 ఏళ్ళు అన్న మాట. ఇది సుదీర్ఘమైన టార్గెట్. అయితే ప్రజలలో బాబుని మరోమారు పాలనా దక్షుడిగా అభివృద్ధి కాముకుడిగా చూపించేందుకు ఈ స్లోగన్ దోహదపడుతుందని అంటున్నారు. ఇపుడు ఈ విజన్ 2047 విషయంలో బాబు మరో అడుగు ముందుకు వేశారు.
ఆయన లేటెస్ట్ గా ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. 2047 విజన్ కోసం ప్రజల నుంచి సలహాలు సూచనలు కోరుతున్నట్లుగా అందులో పేర్కొన్నారు. అదే విధంగా మరో మారు స్వర్ణ ఆంధ్ర మాటను కూడా ప్రస్తావించారు. స్వర్ణ ఆంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దాని కోసం ప్రజలు స్వర్ణాంధ్ర డాట్ ఏపీ డాట్ గొవ్ డాట్ ఇన్ అన్న దానికి తమ సూచనలు పంపించాలని అయన కోరారు. ఇలా అభిప్రాయాలు, సూచనలు చేసిన అనంతరం అభినందనలను ఈ-సర్టిఫికెట్ ద్వారా అందుకోవచ్చని తెలిపారు. ఇక 2047 నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధనే లక్ష్యమని కూడా బాబు ప్రకటించారు.స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని కూడా బాబు స్పష్టం చేశారు.
అదే విధంగా రానున్న పాతికేళ్ళ కాలానికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రూపకల్పనకు పౌరుల సూచనలు ఆహ్వానిస్తున్నామని ఆయన అంటున్నారు. అలా వచ్చిన . ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటూ సమష్టిగా స్వర్ణ ఆంధ్ర నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.
బాబు మరోమారు ఇచ్చిన ఈ నినాదం అలాగే స్వర్ణాంధ్ర, విజన్ 2047 ఆయనకు ఈ తరం పౌరులకు ప్రగతి కాముకుడిగా అభివృద్ధి కారకుడిగా చూపిస్తుందని బాబు మార్క్ విజన్ తో ఏపీ అభివృద్ధికి కూడా అది దోహదపడుతుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. బాబు 2020 విజన్ అన్నది అప్పట్లో పాపులర్ అయింది. మరి 2047 ఏ విధంగా జనంలోకి వెళ్తుంది అన్నది వేచి చూడాల్సి ఉంది.