Begin typing your search above and press return to search.

పొత్తు ప్రతిపాదనను తానే చేశాను అని బాబు కొత్త విషయం!

మరో వైపు జైలులో ములాఖత్ కి వచ్చిన పవన్ తో తాను రెండు నిముషాలు మాత్రమే మాట్లాడాను అని అన్నారు. పొత్తు ప్రతిపాదనను తానే చేశాను అని బాబు కొత్త విషయం చెప్పారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 3:56 AM GMT
పొత్తు ప్రతిపాదనను తానే చేశాను అని బాబు కొత్త విషయం!
X

ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు గురించి తెలియని వారు ఉండరు. ఆయన అన్ని తరాలకు అలా కనెక్ట్ అయిపోయారు. బాబు వయసు ఏడున్నర పదులు అయినా ఆయన నాటి నేటి తరానికి మధ్య గట్టి వారధి నిర్మించుకున్నారు. దానికి కారణం ఆయన ఎప్పటికప్పుడు అప్టూ డేట్ గా ఉండడం. యువత భావాలను వేగంగా పసిగట్టి దానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవడం.

చంద్రబాబుకు రెండేళ్ల క్రితం వరకూ ఒక విషయంలో మినహాయింపు ఉండేది. ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ జైలుకి వెళ్ళలేదు. దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ పలు మార్లు అధికారం అందుకున్న చంద్రబాబు ఒక్కసారి జైలు వైపు వెళ్ళలేదు అంటే ఈనాటి రాజకీయాల్లో అది రికార్డు అని అంటూండేవారు

అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ మినహాయింపు బాబుకు లేకుండా చేసింది. చంద్రబాబుకు జైలు తోవ చూపించింది. ఆయనను ఏకంగా 53 రోజుల పాటు జైలులో పెట్టింది. అది అక్రమ అరెస్ట్ అని తొలి రోజు నుంచే టీడీపీ చెబుతూ వచ్చింది. చివరికి అదే నిజం అన్నట్లుగా ఏపీ ప్రజలు 2024 ఎన్నికల్లో భారీ తీర్పు ద్వారా చాటి చెప్పారు.

ఒక విధంగా జైలుకు బాబుని పంపించి వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. అదే సమయంలో టీడీపీ కూటమి కట్టి రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మరీ గ్రాండ్ లెవెల్ విక్టరీని కొట్టింది. మళ్ళీ ఇదంతా ఎందుకు అంటే నట సింహం నందమూరి బాలక్రిష్ణ హోస్ట్ చేస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ వారి అన్ స్టాపబుల్ షోలో గెస్ట్ గా చంద్రబాబు పాల్గొన్నారు.

అక్కడ ఆయన చెప్పిన జవాబులు బాలయ్య ఆయన్ని గుచ్చి గుచ్చి అడిగిన ప్రశ్నలు అన్నీ కూడా ఆడియన్స్ కి ఎంతో వినోదాన్ని పంచాయి. కొన్ని సార్లు ఉద్వేగాన్ని పెంచాయి. మొత్తం మీద పూర్తి ఆసక్తికరంగా ఈ ఎపిసోడ్ సాగింది. ఇక గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నపుడు ఈ షోకి హాజరయ్యారు. ఇపుడు సీఎం హోదాలో వచ్చారు.

అదే ఆయన చెప్పుకున్నారు కూడా. ఇదిలా ఉండగా బాబు జైలు జీవితం గురించి అందరికీ ఆసక్తి ఉంది. ఆయన 53 రోజుల పాటు అక్కడ ఏమి చేశారు ఆయన ఎమోషన్స్ ఆ టైంలో ఎలా ఉండేవి అన్నది అందరిలో ఉంది. అంతే కాదు బాబుని అరెస్ట్ చేసినపుడు ఆయన ఫీలింగ్స్ ఆ తరువాత ఆయనను రోజంతా తిప్పి కోర్టులో హాజరు పరచిన తీరు ఇవన్నీ కూడా అప్పట్లో చూసిన వారు చదివిన వారు ఈ ఎపిసోడ్ లో బాలయ్య ప్రశ్నకు బాబు ఏమి చెబుతారు అని పూర్తి ఆసక్తిని చూపించే లాగానే ఉన్నాయి.

తన జైలు జీవితం గురించి చంద్రబాబు చెబుతూ ఒక దశలో ఎమోషన్ కి గురి అయ్యారు. చేయని తప్పుకు తాను జైలుకు వెళ్ళాను అని ఆయన అన్నారు. నంద్యాలలో ఉండగా తనను అరెస్ట్ చేశారని రోజంతా తిప్పారని తన అరెస్ట్ గురించి నోటీసులు ఇవ్వలేదని అరెస్ట్ వారెంట్ తోనే అంతా చేసారని అన్నారు. అదంతా చేదు అనుభవంగా బాబు చెప్పుకున్నారు.

తాను నిప్పులా బతికాను అని అన్నారు. ఏ తప్పూ చేయలేదని కూడా అన్నారు. అటువంటి తనను కావాలని అరెస్ట్ చేశారని లెక్కలేని తనంతో అధికార బలంతోనే ఇదంతా చేశారు అని ఆయన ఫైర్ అయ్యారు. తాను అరెస్ట్ అయి జైలులో ఉన్నపుడు ప్రజల గురించే ఆలోచించాను అని ఆయన అన్నారు. తన జీవితం మొత్తంలో అత్యధిక భాగం ప్రజల కోసమే వెచ్చించాను అని ఆయన అన్నారు

తాను జైలులో ఉంటే ప్రజలు అంతా స్వచ్చందంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలియచేయడం గొప్ప అనుభూతి అని ఆయన చెప్పారు. తన పట్ల ఎంతో కక్ష పెట్టుకుని ఆ విధంగా సాధిస్తూ వేధించారు అని అన్నారు. ఆ ఘటనలు తలచుకుంటే తన గుండె తరుక్కుపోతుందని ఆయన అన్నారు.

తన జైలు జీవితం మీద ఒక పుస్తకమే రాయవచ్చు అని బాబు అన్నారు. అంటే బాబు మనసులో ఆ విషయం ఉంది అన్న మాట. సో తొందరలోనే బాబు జైలు జీవితం మీద పుస్తకం వస్తుందని ఆశించవచ్చు అని అంటున్నారు.

మరో వైపు జైలులో ములాఖత్ కి వచ్చిన పవన్ తో తాను రెండు నిముషాలు మాత్రమే మాట్లాడాను అని అన్నారు. పొత్తు ప్రతిపాదనను తానే చేశాను అని బాబు కొత్త విషయం చెప్పారు. అయితే పవన్ ని ఆలోచించుకోమని ఆ మీదటనే నిర్ణయం తీసుకోమని చెప్పాను అన్నారు. అయితే పవన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జైలు బయటనే పొత్తు గురించి ప్రకటన చేశారు అని ఆయన అన్నారు. ఆ తరువాత బీజేపీని కూడా ఒప్పిస్తామని చెప్పారని అన్నారు.

ఇక తాను జైలుకు వెళ్ళకపోయినా టీడీపీ కూటమి ఏర్పాటు అయ్యేదని కానీ ఆ ఘటన తరువాత తొందరగా రాజకీయాల పునరేకీకరణ సాగిందని బాబు గతాన్ని నెమరేసుకున్నారు. మొత్తానికి చూస్తే తాను రాజకీయంగా అన్ స్టాబబుల్ అని బాబు ప్రకటించారు. తన జీవితం నాడూ నేడూ ఏనాడూ ప్రజలకే అంకితం అని ఆయన స్పష్టం చేశారు. తన విషయంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని కూడా ఆయన గట్టిగానే శపథం చేశారు.