ఇంకా బోలెడు ఉన్నాయి... తమ్ముళ్ళను ఊరిస్తున్న బాబు
ఎట్టకేలకు నామినేటెడ్ పదవుల పందేరం జరిగింది. తొలి విడతలో ఇరవై కార్పోరేషన్లకు చైర్మన్లు కార్యవర్గాలు నియమించారు.
By: Tupaki Desk | 26 Sep 2024 2:30 AM GMTఎట్టకేలకు నామినేటెడ్ పదవుల పందేరం జరిగింది. తొలి విడతలో ఇరవై కార్పోరేషన్లకు చైర్మన్లు కార్యవర్గాలు నియమించారు. ఆ విధంగా చూస్తే కూటమిలోని అన్ని పార్టీలకు న్యాయం చేశారు అని అధినాయకత్వం అనుకుంటోంది.
అయితే పదవులు దక్కిన వారిలో కొంత అసంతృప్తి ఉంది అని వార్తలు వచ్చాయి. తమ స్థాయిని తగిన పదవులు లేవని భావించిన వారు కూడా ఉన్నారు. అదే టైం లో తమకు పదవులు ఇంకా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు.
ఈ నేపధ్యంలో టీడీపీ తరఫున నామినేటెడ్ పదవులు అందుకున్న చైర్మన్లు కీలక నేతలు చంద్రబాబుని కలిశారు. బాబు వారిని దిశా నిర్దేశం చేశారు. పదవులు లభించాయని మీరు ప్రత్యేక వ్యక్తులు కాదని, ప్రభుత్వానికి పార్టీకి బాధ్యులుగా మారి మరింతగా శ్రమించాలని కష్టపడి పనిచేయాలని కోరారు.
తమకు అప్పగించిన బాధ్యతల మీద అవగాహన పెంచుకుని రాష్ట్రానికి మేలైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఇదే సమయంలో చంద్రబాబు పదవులు రాని వారికి కూడా ఆశలు కల్పించారు. తొలి విడతలో నామినేటెడ్ పదవులుగా ఇవి ఉన్నాయి. ఇంకా చాల పదవులు ఉన్నాయని అన్నింటినీ తొందరలోనే భర్తీ చేస్తామని బాబు ఒక తీయని కబురు చెప్పి తమ్ముళ్ళను ఊరించారు.
ఇంకా పదవులు ఉన్నాయని, దశల వారీగా పదవుల పందేరం జరుగుతుందని అన్నారు. అయితే కొందరు నాయకులు తొందర పడుతున్నారని కూడా బాబు ఒకింత ఆవేశం ప్రదర్శించారు. ఇది మంచి విధానం కాదని ఆయన అన్నారు. పార్టీ అంటే క్రమశిక్షణగా ఉండాలని అది ముఖ్యమని కూడా చెప్పారు.
ఎపుడైనా పార్టీ గురించేది క్రమశిక్షణను మాత్రమే అని బాబు స్పష్టం చేశారు. పార్టీ టికెట్లు ఇవ్వలేని వారికి తొలి విడతలో ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన అన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరికీ తగిన సమయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కొందరికి పదవులు వచ్చాయి అంటే మిగిలిన వారు అనర్హులు అని కానే కాదని బాబు అంటున్నారు. ఇక ఎవరెవరు పార్టీకి పనిచేశారో వారి గురించిన పూర్తి డేటా తమ దగ్గర ఉందని బాబు చెప్పడం విశేషం.
నామినేటెడ్ పదవులలో సామాజిక న్యాయం నూరు శాతం పాటించామని బీసీలకు ఎక్కువగా పార్టీ పదవులు ఇచ్చామని బాబు అంటున్నారు. ప్రస్తుతం పదవులు తీసుకున్న వారు కూడా మరింత కష్టపడి పనిచేస్తే మంచి అవకాశాలు వస్తాయని బాబు అంటున్నారు
మొత్తానికి చూస్తే ఇంకా ఎనభై దాకా కార్పోరేషన్లకు చైర్మన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఆలాగే వాటి పాలక మండళ్ళు తీసుకున్నా వందలలో పదవులు వస్తాయి. అన్నింటికీ కూడా నెమ్మదిగా భర్తీ చేస్తామని బాబు చెబుతున్నారు. అయితే తమకు పదవులు తగిన విధంగా రాలేదని తమ్ముళ్ళు అంటున్నారు. అలాగే జూనియర్లకు చైర్మన్ పదవులు ఇచ్చి సీనియర్లు అయిన తమను జస్ట్ మెంబర్లుగా నియమించారు అని కొందరు అంటున్నారు
అంతే కాదు ఎంతో మంది ఆశావహులు ఉన్నారని మధ్యలో కూటమి పార్టీలకు కూడా పదవులు పోతున్నాయని తమ దాకా వస్తాయా అన్న ఆవేదన అనుమానాలు కూడా చాలా మంది తమ్ముళ్లలో ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నది చంద్రబాబు ఆయన వద్ద చిట్టా ఉంది. సో ఎవరికి ఇవ్వాలో ఆయనకే తెలుసు అంటున్నారు. అందువల్ల ఇంకా గంపలో పదవులు ఉన్నాయి. వాటి మీద ఎవరి పేర్లు రాసి బాబు గిఫ్ట్ గా ఇస్తారో చూడాల్సిందే.