'రెండు' విషయాలు.. తమ్ముళ్లపైనే బాబు ఆశలు..!
రాష్ట్రంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు కూడా.. ప్రజలను ఆలోచనకు గురి చేసేవే కావడం గమనార్హం.
By: Tupaki Desk | 27 Oct 2024 4:30 PM GMTరాష్ట్రంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు కూడా.. ప్రజలను ఆలోచనకు గురి చేసేవే కావడం గమనార్హం. అంతేకాదు.. వారిపై భారం మోపేవిగా కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సమన్వయ కమిటీల పేరుతో తమ్ముళ్లను ఏకం చేస్తున్నారు. అందరూ కలసి కట్టుగా.. ఉండి.. తాజా నిర్ణయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యం లోనే ఆయన మూడు పార్టీల నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
విషయం ఏంటి?
రెండు విషయాల్లో కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. 1) విద్యుత్ చార్జీలకు సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేయాలని భావించింది. ఇది ప్రజలపై భారం మోపే అవకాశం మెండుగా ఉంది. వచ్చే నవంబరు నుంచి ఈ విధానం అమలు కానుంది. దీని ప్రకారం.. యూనిట్‌కు 1.1 రూపాయల చొప్పున ధరలు పెరగనున్నాయి. ఇలా మొత్తం 15 నెలలపాటు ఈ చార్జీలు వసూలు చేయనున్నారు. అయితే.. ఇది తమ నిర్ణయం కాదని.. వైసీపీ హయాంలో జరిగిన నిర్ణయమని ప్రజలకుఅ వగాహన కల్పించాలని చంద్రబాబు కోరుతున్నారు.
ఈ విషయాన్ని సర్కారు అనుకూల మీడియా ఇప్పటికే ప్రొజెక్టు చేసింది. గతంలో జగన్ ఏయే ఒప్పందా లు చేసుకున్నారో.. చెబుతూ.. వాటి ప్రకారమే ఇప్పుడు ధరలు పెరిగాయని చెబుతున్నారు. కానీ ఇలా పేపర్ల ద్వారా కొద్ది మందికే అర్ధమవుతుందన్న ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు.. నేరుగా నాయకులే దీనిపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని సూచిస్తున్నారు. ఇక, రెండో అంశం.. స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్ చార్జీల అంశం. దీనిని కూడా ఇప్పుడు పెంచేందుకు రెడీ అయ్యారు.
అయితే.. ఈ వ్యవహారం కూడా ప్రజలపై ప్రభావం చూపించనున్న నేపథ్యంలో ఇలా ఎందుకు పెంచాల్సి వస్తోందో.. ప్రజలకు వివరించేలా మూడు పార్టీల నాయకులకు ఆయన అవగాహన కల్పించనున్నారు. పట్టణాల్లో కొన్ని చోట్ల తక్కువగా ఉండి.. మరికొన్న చోట్ల ఎక్కువగా ధరలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని సమం చేయనున్నారు. ఇక, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ది చేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోనూ ధరలు పెంచితే.. భూముల విలువ పెరిగి.. ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ పెంపును ప్రతిపాదించినట్టు చంద్రబాబు చెబుతున్నారు. దీనిని అర్ధమయ్యేలా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మూడు పార్టీల నాయకులపైనే ఉందని ఆయన అంటున్నారు.