తమ్ముళ్లకు బాబు 'కీలక' బాధ్యతలు.. !
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. పార్టీ నాయకులకు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించారు.
By: Tupaki Desk | 21 Nov 2024 8:30 PM GMTటీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. పార్టీ నాయకులకు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఈ బాధ్యతలను తమ్ముళ్లు ఏమేరకు సక్సెస్ చేస్తారనేది చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు కీలక విషయాలపై కూటమి సర్కారు ఆశలు పెట్టుకుంది. 1) ఉచిత ఇసుక. 2) మద్యం పాలసీ. ఈ రెండు విషయాలను కూడా చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించిన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ పథకంలో పార్టీ నాయకుల జోక్యం పెరిగిపోయిందని, వైసీపీ హయాంలో కంటే ఎక్కువ ధరలకు ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ప్రజలు ఆవేదన , ఆందోళన కూడా చెందుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వార్తలు వచ్చాయి. దీంతో అలెర్ట్ అయిన చంద్రబాబు.. తముళ్ల జోక్యాన్నినిలువరించే ప్రయత్నం చేశారు. పదే పదే హెచ్చరించారు. అంతేకాదు.. అధికారులకు మరిన్ని అధికారాలు అప్పగిం చారు. దీంతో కొంత వరకు ఈ విషయంలో జోక్యం తగ్గించారనే చెప్పాలి.
అయితే.. ఇప్పుడు మరోసమస్య తెరమీదికి వచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి.. రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా చేయాలన్నది సర్కారు సంకల్పం. కానీ, ఇది సాధ్యం కావడం లేదు. ఉభయ గోదావరి సహా అనంతపురం, కర్నూలు, విజయనగరం వంటి కీలక జిల్లాల్లో మద్యం బెల్టు షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఉదయం 5 గంటల నుంచే ఈ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇక, రాత్రి 10 తర్వాత.. అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటున్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే.. వీధికి రెండు నుంచి మూడు బెల్ట్ షాపులు పెరిగాయి. ప్రస్తుతం సర్కారు వద్ద ఉన్న గణాంకాల ప్రకారం.. ఈ బెల్టు షాపులు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని! ఈ విషయా న్ని చంద్రబాబు తాజాగా ప్రస్తావించారు. అసెంబ్లీలోనే ఈ విషయం చెప్పడాన్ని బట్టి.. సీరియస్‌గానే వ్యవహారం నడుస్తోందన్నది స్పష్టమవుతోంది. అయితే.. ఆయన ఎవరినీ తప్పుపట్టకుండా.. బెల్ట్ షాపులు నిలువరించే ప్రయత్నం ఎమ్మెల్యేలకే అప్పగించారు. బెల్ట్ షాపులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందన్నారు. అంటే.. ఒకరకంగా.. వారిని హెచ్చరించినట్టే చెప్పాలి. మరి ఏమేరకు చంద్రబాబు అప్పగించిన కీలక బాధ్యతలను ఎంత మంది సక్సెస్ చేస్తారో చూడాలి.