టీడీపీ ఇక సొంతంగా పోటీ చేయలేదా ?
అందుకే దీనిని రాజకీయం అన్నారు. నీవు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అన్నట్లుంటుంది ఇక్కడ మ్యాటర్.
By: Tupaki Desk | 11 Feb 2025 11:30 AM GMTఅందుకే దీనిని రాజకీయం అన్నారు. నీవు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అన్నట్లుంటుంది ఇక్కడ మ్యాటర్. ఒకరిని ఓడించాలని మరొకరిని తీసుకుని వస్తే వారు కూడా రేపటి రోజుల ప్రత్యర్ధులు అవుతారు కదా. అంటే రాజకీయాల్లో ప్రత్యర్ధులు ఎపుడూ రెడీగానే ఉంటారు. అందుకే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఇక్కడ ఎవరూ ఉండరు అని చెప్పేది.
ఇక ఏపీలో చూస్తే తెలుగుదేశం పార్టీది నాలుగున్నర దశాబ్దాల చరిత్ర. ఎన్టీఆర్ గ్లామర్, చంద్రబాబు గ్రామర్ ఆ పార్టీని ఇంత కాలం కాపాడుతూ వచ్చాయి. ఇపుడిపుడే ఏపీలో రాజకీయం మారుతోంది. అపొజిషన్ లో వైసీపీ ఉంది. దాని అధినాయకుడు జగన్ ఉన్నారు. అలాగే మిత్రపక్షంగా జనసేన ఉంది. అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు.
జనసామాన్యంలో చూసుకుంటే జగన్ పవన్ ఈ ఇద్దరూ మాస్ లీడర్లు. ఇద్దరికీ ప్రజాదరణ గణనీయంగా ఉంది. అదే సమయంలో టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు కొండంత అండగా ఉన్నారు. ఆయన రాజకీయ గ్రామర్ ఎపుడూ గ్రేటే. ఆయన వ్యూహాలకు ఎవరూ సరిసాటి కూడా కాదు. కానీ బాబు వయసు ఈ రోజున ఏడున్నర పదులు. మరో నాలుగేళ్ళలో వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఎనభై ఏళ్ళకు చేరువ అవుతారు.
దాంతో ఈ రోజుకు టీడీపీ కూటమి అధికారంలో ఉన్నా రాజకీయం బాగున్నా టీడీపీ సంగతేంటి అన్న చర్చ అయితే సాగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ ఒకటి రెండు సందర్భాలలో తప్ప ఎక్కువ సార్లు పొత్తులతోనే పోటీ చేసి గెలిచింది. ఇక ఫ్యూచర్ లోనూ ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి అయితే లేదని అంటున్నారు.
జనసేన గ్రౌండ్ లెవెల్ లో చూస్తే బలమైన సామాజిక వర్గం అండతో గట్టిగానే వేళ్ళూనుకుంది అని అంటున్నారు. వైసీపీ విషయం తీసుకుంటే ఆ పార్టీ ఎంత చెడ్డా 40 శాతం ఓటు బ్యాంక్ ని సాధించింది. ఆ పార్టీకి ఉన్న వివిధ సామాజిక వర్గాల మద్దతు నుంచి వచ్చిన ఓటు బ్యాంక్ అది. అదే సమయంలో టీడీపీకి మంచి ఓటు షేర్ వచ్చినా అది జనసేన పొత్తుతో కలసి వచ్చినదిగా లెక్క వేసుకోవాలని అంటున్నారు.
టీడీపీతో పోల్చితే జనసేన వైసీపీకి మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు లీడర్లు పవన్ జగన్ రూపంలో ఉన్నారు అన్నది ఒక విశ్లేషణ గా ఉంది. అదే సమయంలో టీడీపీకి ఫ్యూచర్ లీడర్ గా లోకేష్ ఉన్నా అంత మాస్ లీడర్ గా వారిద్దరితో పోలిస్తే ముద్ర వేసుకోలేదు అన్నది ఒక కఠినమైన విశ్లేషణగా చూస్తున్నారు.
చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి వయోభారంతో ఉంటారు. అపుడు టీడీపీని మొత్తంగా లోకేష్ లీడ్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఆ నేపథ్యంలో జగన్ పవన్ లతో పోలిస్తే లోకేష్ మాస్ ఫాలోయింగ్ విషయంలో వెనకబడి ఉన్నారని అంటున్నారు. మాకు చంద్రబాబు ఉన్నారు ఆయన ఏజ్ జస్ట్ నంబర్ అని మాటల వరకూ చెప్పుకోవచ్చు కానీ ఏజ్ ఎపుడూ ఏజే అని అది గ్రహించాలని సూచించే వారూ ఉన్నారు.
ఏపీలో ఉన్న మూడు పార్టీలలో వైసీపీ రెడ్ల పార్టీ అని, టీడీపీ కమ్మ పార్టీ అని జనసేన కాపుల పార్టీ అని ముద్ర అయితే ఉంది. జనసేనను అట్టిబెట్టుకుని కాపులు ఉంటారు కాబట్టి ఆ సామాజిక వర్గం దన్ను కోసం టీడీపీ జనసేనను వదిలిపెట్టుకోదు అని అంటున్నారు. అంటే టీడీపీ జనసేన పొత్తు ఎప్పటికీ కొనసాగుతుందని ఆ విధంగా టీడీపీ ఒంటరి పోరుకు దూరంగానే ఉంటుందని అంటున్నారు.
రాజకీయాలు సామాజిక అంశాల మీద పూర్తి అవగాహన ఉన్న చంద్రబాబు ఈ విషయంలో జనసేనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు అనే అంటున్నారు. అలా కనుక చూస్తే టీడీపీ రాజకీయ అవసరాలు అనివార్యతలు అన్నీ గమనించి జనసేన వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలో వాటా కోసం పట్టుబట్టడం ఖాయమని అంటున్నారు.
ఈ ఎన్నికల వరకూ అయితే కూటమి పెద్దగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. పవన్ డిప్యూటీ సీఎం తో సరిపెట్టుకున్నారు. కానీ 2029 నాటికి మాత్రం అధికారంలో సగం సగం వాటా వేసుకుంటే చెరి రెండున్నరేళ్ళ పాటు టీడీపీ జనసేన అధికారం పంచుకోవాల్సిందే అని అంటున్నారు. అలా అధికారంలో వాటా ఇస్తామని పవన్ ని సీఎం గా చేస్తామని చెప్పి మాత్రమే పొత్తులతో ఎన్నికలకు వెళ్ళాలని అంటున్నారు.
అలా చేస్తేనే కాపులు టీడీపీని నమ్ముతారని లేకపోతే ఈ ఉప ముఖ్యమంత్రులు కొన్ని మంత్రి పదవుల కోసం ఈసారి ఎన్నికల్లో కాపులు టీడీపీ వైపు వస్తారా అంటే అసలు కుదిరేది కాదని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో టీడీపీ ఇక ఎప్పటికీ ఒంటరి పోరు అనే సాహసం చేయదన్నది ఒక కచ్చితమైన విశ్లేషణ. అదే జనసేనను ఏపీలో బలోపేతం చేస్తోంది అన్నది నిఖార్సు అయిన మాట.