బాబు అంటే అదే మరీ... ఆ సీనియారిటీకి సలాం !
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో రాజకీయంగా చేసే విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ఆయన ఈ రోజున ఈ స్థాయికి రావడానికి కారణం మాత్రం ఆయనే
By: Tupaki Desk | 18 March 2025 7:15 PM ISTటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో రాజకీయంగా చేసే విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ఆయన ఈ రోజున ఈ స్థాయికి రావడానికి కారణం మాత్రం ఆయనే. ఆయనకు ఈ పొజిషన్ ఊరకే రాలేదు. అందరూ అనుకుంటున్నట్లుగా ఎన్టీఆర్ అల్లుడిగానూ ఆయన అడ్వాంటేజ్ ఏదీ పొందలేదు. ఆయన స్వయంకృషి తపన ఆయన విజన్ ఆయన వ్యూహాలు ఎత్తులు అన్నీ కలిపే ఈ రోజున ఆయన ఆయనను ఎంతో ఎత్తున ఉంచాయి.
ఉమ్మడి ఏపీకి రెండు సార్లు విభజన ఏపీకి రెండు సార్లు సీఎం కావడం అంటే మామూలు విషయం అయితే కాదు. బాబు దానిని సాధించారు అంటే దాని వెనక ఆయన ఆలోచనలు ఆయన పట్టుదల ఉండడమే. బాబులో గొప్ప విషయం ఏంటి అంటే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం. మళ్ళీ దానిని రిపీట్ చేయకపోవడం.
ఆయనలో మరో గుణం ఏంటి అంటే జూనియర్లు అయినా తన కంటే చిన్న వారు అయినా గుర్తించి గౌరవించడం. వ్యూహం బాగుంటే అది ఎవరేమి అన్నా కూడా తాను ఉపయోగించడం. పార్టీలో టాప్ టూ బాటం తో ఎప్పుడూ బాగా ఉండడం.
ఇదిలా ఉంటే బాబు తాను 2019లో ఎందుకు ఓటమి పాలు అయ్యానో గుర్తించారు. క్యాడర్ తో లీడర్ తో కో ఆర్డినేషన్ లేకనే ఓటమి ఎదురైంది అని ఆయన చాలా చక్కగా విశ్లేషించుకున్నారు. అందుకే ఆయన ఈసారి ఆ విధంగా వ్యవహరించదలచుకోవడంలేదు. అధికారంలో ఉన్నపుడు ఎన్నో బాధ్యతలు ఉంటాయి.
బాబు 1995లో తొలిసారి సీఎం అయ్యారు. 1999లో రెండోసారి అయ్యారు. ఈ రెండు టెర్ములలో ఆయన అధికారులకు ఎక్కువ విలువ ఇచ్చారు. తాను సీఈఓ గా వ్యవహరించారు ఫలితంగా 2004లో పార్టీ ఓటమి పాలు అయింది. పదేళ్ళ తరువాత 2014లో అధికారం దక్కినా విభజన ఏపీ కోసం ఆయన అన్ని విధాలుగా ఆలోచించారు.
అమరావతి రాజధాని బాధ్యతలను భుజనానికి ఎత్తుకున్నారు. ఈ పనులలో పడి పార్టీకి కాస్తా పక్కన పెట్టారు. అదే ఇపుడు ఆయన ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన పార్టీకి ప్రాణప్రదం అయిన నాయకులు కార్యకర్తలతో ఎప్పటికపుడు టచ్ లో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. గత తొమ్మిది నెలలలో బాబు ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ పార్టీ క్యాడర్ తో మాట్లాడుతూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు.
పార్టీ ఫస్ట్ ఆ తరువాత ఏదైనా అని చెబుతున్నారు తాను కూడా అలాగే ఉంటాను అని అంటున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా అలాగే ఉండాలని నాయకులు వేరే పార్టీ వారికి అవకాశాలు ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేయాలని కోరారు.
ఇదిలా ఉంటే చంద్రబాబుకు టీడీపీని మరిన్ని టెర్ములు అధికారంలోకి తీసుకుని రావడం మీదనే ఫోకస్ ఉంది. తలచుకుంటే అది అసాధ్యం ఏమీ కాదు అని ఆయన భావిస్తున్నారు. బీజేపీ అనేకసార్లు వరసబెట్టి ఎలా గెలుస్తుందో ఆయన చూస్తున్నారు. ఆ విధమైన సంకల్పం కావాలంటే క్యాడర్ తోనే మమేకం కావాలని వారికే పెద్ద పీట వేసి రానున్న రోజులలో వారితోనే విజయాలు అన్నది బాబు పక్కాగా వ్యూహరచన చేస్తున్నారు.
ఇక రానున్న నాలుగేళ్ళ పాటు పార్టీ క్యాడర్ తోనే బాబు మీటింగులు నిర్వహిస్తూ వారితోనే తాను ఉంటాను అని అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కీలక నేతలకు అదే చెబుతున్నారు. బాబు ఈ విధంగా కీలక అడుగులు వేయడం నిజంగా టీడీపీకి శుభ సూచకమని మరింత కాలం పార్టీ అధికారంలో ఉండేలా బాబు బాటలు వేస్తున్నారు అని అంటున్నారు.