దటీజ్ చంద్రబాబు టీ...స్పెషాలిటీ !
ఆయన పేదల ఇంటికి వెళ్ళి నేరుగా వంటిల్లుని వెతుకుతున్నారు. ఆ వెంటనే స్టవ్ మీద టీ కాచేస్తున్నారు.
By: Tupaki Desk | 13 Jan 2025 4:41 AM GMTఏపీ సీఎం చంద్రబాబు పేదలతో బాగా కలసిపోతున్నారు. ఆయన నాలుగవ సారి సీఎం అయ్యాక ఎక్కని తొక్కని పేదల గడప లేదు. అది అనంతపురమా లేక గుంటూరు జిల్లాలోని మరో పల్లెటూరా అదీ ఇదీ కాదు చిత్తూరు జిల్లాలోని ఇంకో ఊరా ఇవేమీ ముఖ్యం కాదు.
అసలు కాదేదీ ఊరూ కాదేదీ ఇల్లు టీ స్టవ్ మీద పెట్టి కాచేందుకు అన్నట్లుగా బాబు సిద్ధపడిపోతున్నారు. ఆయన పేదల ఇంటికి వెళ్ళి నేరుగా వంటిల్లుని వెతుకుతున్నారు. ఆ వెంటనే స్టవ్ మీద టీ కాచేస్తున్నారు. అందులో ఆ ఇంటి వారికి కొంత ఇచ్చి తాను టీ తాగుతూ వారితో చెబుతున్న ముచ్చట్లు హైలెట్ అవుతున్నాయి.
రాష్ట్రాన్ని ఏలే రాజే తమ ఇంటికి వచ్చేసి తమ యోగ క్షేమాలను తెలుసుకుంటూ ఆప్త బంధువు అయిపోయారని తెగ సంతోషిస్తున్నారు. చంద్రబాబు సంక్రాంతి ఒక రోజు ముందు తిరుచానూరులోని ఎజి అండ్ పి ప్రథమ్ వారు అమర్చిన డొమెస్టిక్ పైప్ లైన్ నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించిన తరువాత ముఖ్యమంత్రి లబ్ధిదారుల కుటుంబంతో మాట్లాడారు. అంతే కాదు వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని తక్షణమే ఇల్లు మంజూరు చేసేశారు.
ఇక బాబు ఆ ఇంట్లో చాలా సేపు గడిపి వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా టీ కూడా కాచడంతో పేదలంతా బాబు గురించే చర్చించుకుంటున్నారు. బాబు వంటి సీఎం ఇంటికి వచ్చి టీ పెట్టడమే కాదు సమస్యలు కూడా తీరుస్తున్నారని నిజంగా గ్రేట్ అని అంటున్నారు.
మామూలు టీలలో చాలా రకాలు ఉండొచ్చు కానీ బాబు పెట్టే టీలో స్పెషాలిటీ వేరు అని అంటున్నారు. రానున్న రోజులలో బాబు ఏ ఇంటికి వెళ్తారో ఎవరితో మాట్లాడుతారో అని పేదల లోగిళ్ళలో అంతా ఒక్కటే చర్చించుకుంటున్నారు.
ప్రతీ నెలా సామాజిక పెన్షలు ఇచ్చేటపుడు పేదల ముంగిటకు వస్తున్న బాబు వారి ఇంట్లోకి వెళ్తున్నారు. వారి మంచి చెడులు చూస్తున్నారు. మరి బాబు తమ ఇంటికే రావాలని తమ కష్టాలు తీర్చాలని కోరుకుంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.
మొత్తానికి చూస్తే రాజకీయాల్లో బాబు లాంటి టీ స్పెషలిస్టు వేరొకరు ఉండరేమో. అదేదో సినిమాలో బాబు బావమరిది బాలయ్య చెప్పినట్లుగా మీ ఇంటికి వస్తా నట్టింటికి వస్తా అన్నట్లుగా బాబు నేరుగా వంటిల్లు వెతుక్కునే వస్తున్నారని ఆ ఇంట్లో బాబు కాలు పెట్టి టీ కాచారు అంటే ఇక వారి ఇంట్లో పాల సముద్రమే పొంగుతుందని కూడా అంతా అంటున్నారు.
బాబు మూడు టెర్ముల సీఎం గా ఉన్నపుడు కూడా ఈ విధంగా చేయలేదు. ఇపుడు టీ పెట్టడం నేర్చేయడమే కాదు పేదల మనసులు కూడా దోచేయడం తనకు తెలుసు అంటున్నారు. దటీజ్ బాబు టీ స్పెషాలిటీ అన్న మాట.