అంత తేడా వచ్చాక తీసేయొచ్చుగా చంద్రబాబు.. ఇంకా నాన్చటమా?
అయితే.. తిరువూరు పార్టీ నేతలకు.. ఎమ్మెల్యేకు మధ్య లడాయి నడుస్తోంది. దీన్ని రాజీ చేయటమో.. లేదంటే చర్యలు తీసుకోవటమో చేయాలి.
By: Tupaki Desk | 6 April 2025 9:30 AMగతంతో పోలిస్తే చాలా విషయంలో మారారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే.. కీలకమైన కొన్ని విషయాల్లో ఆయనలో పాత వాసనలు అలానే కనిపిస్తున్నాయి. పార్టీ గీతను దాటిన తెలుగు తమ్ముళ్లపై చర్యల కత్తి ఝుళిపించే విషయంలో విపరీతమైన నానుడి ధోరణిని ప్రదర్శిస్తుంటారు. దీన్నో అడ్వాంటేజ్ గా తీసుకుంటారు కొందరు నేతలు. స్థానికంగా ఉండే అధిపత్య పోరును మొక్కలా ఉన్నప్పుడే కట్ చేయాల్సింది పోయి.. చూసిచూడనట్లుగా ఉండటం.. క్రమశిక్షణ లేని కారణంగా పార్టీలో అదో లొల్లిగా మారటం అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటుంది.
ఈ తటపటాయింపు మరికొందరు నేతలు అవకాశం తీసుకునేలా చేస్తుంది. గీత దాటిన ఎవరైనా సరే.. చర్యలు సీరియస్ గా ఉంటాయన్న సందేశాన్ని పంపే విషయంలో చంద్రబాబు గతంలో మాదిరే వ్యవహరిస్తున్నారు. అందుకు కొలికపూడి వ్యవహారమే ఒక ఉదాహరణగా చెప్పాలి. తిరువూరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ నేత కొలికపూడి శ్రీనివాసరావు.
అయితే.. తిరువూరు పార్టీ నేతలకు.. ఎమ్మెల్యేకు మధ్య లడాయి నడుస్తోంది. దీన్ని రాజీ చేయటమో.. లేదంటే చర్యలు తీసుకోవటమో చేయాలి. కానీ.. ఇవేమీ చేయని చంద్రబాబు తీరుతో ఈ ఇష్యూ అంతకంతకూ ముదురుతున్న పరిస్థితి. తాజాగా నందిగామ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు మంత్రులు.. ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తరచూ వార్తల్లోకి వస్తూ.. పార్టీ పంచాయితీల పెద్దగా మారిన కొలికపూడి ఇష్యూపై పార్టీ అధినాయకత్వం సీరియస్ గా ఉంది.
చంద్రబాబు పర్యటనకు సందర్భంగా ఈ వాదనకు బలం చేకూరేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెలిప్యాడ్ కు చేరుకున్న చంద్రబాబును తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి నమస్కరించారు. అయితే.. చంద్రబాబు ఒక్క క్షణం ఆయన్ను చూసి.. పక్కనున్న నేతను భుజం తట్టారు. కొలికపూడిని మాత్రం పలుకరించలేదు. చంద్రబాబును కలిసేందుకు మహిళా నేతలు.. ఇతర నేతలు ముందుకు రావటం.. వారికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వటంతో కొలికిపూడి ఒంటరి అయినట్లుగా సీన్ మారింది.
ఇలాంటి పరిస్థితి కంటే కొలికిపూడి ఇష్యూను సెటిల్ చేయటం.. లేదంటే ఆయనపై చర్యలు తీసుకోవాలే తప్పించి.. ఇలా వ్యవహరించటం ద్వారా స్థానిక పంచాయితీ పరిష్కారం కాకుండా ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు మిస్ అవుతున్నట్లు? అన్నది ప్రశ్న. గతంలోనూ ఇలానే ఇష్యూలను నాన్చేవారు. అవి కాస్తా ముదిరి పాకాన పడేవి. ఇప్పుడు కూడా అదే ధోరణిని ప్రదర్శించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.