'తల్లికి వందనం' తేల్చేస్తుందా.. కూటమి వ్యూహం ఏంటి.. ?
మరో ఐదు మిగిలి ఉన్నాయి. వీటిని అమలు చేసే క్రమంలో ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుందని భావించే వాటిపై కసరత్తు చేస్తున్నారు.
By: Tupaki Desk | 10 March 2025 1:00 AM ISTఏపీలో కూటమి ప్రభుత్వం 9 మాసాలు పూర్తి చేసుకోనుంది. అయితే.. 9 మాసాల్లో ఎక్కువగా పెట్టుబడులు, అభివృద్ది, సంపద సృష్టి అనే కీలక అంశాలపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇదేసమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హామీల్లో.. కేవలం ఉచిత గ్యాస్ సిలిండర్లను మాత్రమే అమలు చేస్తున్నారు. మరో ఐదు మిగిలి ఉన్నాయి. వీటిని అమలు చేసే క్రమంలో ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుందని భావించే వాటిపై కసరత్తు చేస్తున్నారు.
ఈ ఐదు సూపర్ హామీల్లో కీలకమైంది.. తల్లికి వందనం. ఇది ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉం టుందన్న అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిని అమలు చేసేందుకు సర్కారు సాహసోపేత మైన నిర్ణయం తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే అంతర్గత సర్వేలు కూడా పూర్తి చేసిన సీఎం చంద్రబా బు.. ఈ పథకాన్ని ఎన్నికష్టాలు ఎదురైనా అమలు చేయాలనినిర్ణయించుకున్నారు. వాస్తవానికి గతంలో జగన్ ఇచ్చినట్టే కేవలం అమ్మలను ప్రాతిపదికగా తీసుకుని ఒక్కరికే ఈ పథకాన్ని అమలు చేయాలని అనుకున్నారు.
కానీ, సర్వేల్లో మాత్రం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. అందరికీ ఇస్తామని చెప్పిన విషయాన్ని మెజా రిటీ మహిళలు ప్రస్తావించారు. పార్టీకి బలమైన జిల్లాలుగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఈ డిమాండ్ ఎక్కువగా వినిపించింది. దీంతో చంద్రబాబు ఎట్టకేలకు అందరికీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. దీనిని అమలు చేస్తున్నట్టు తాజాగా కూడా ప్రకటించారు. అయితే.. తల్లికి వందనం పథకాన్ని కనుక.. అందరికీ.. అంటే.. ఇంట్లో ఎంత మంది చదువుకునే విద్యార్థులు ఉంటే అందరికీ అమలు చేస్తే.. ఆ రేంజే వేరని అంటున్నారు పరిశీలకులు.
గతంలో వైసీపీ ఎంతమంది పిల్లలు ఉన్నా.. ఇస్తామని చెప్పి, చివరకుఒక్కరికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసింది. దీనివల్ల అంత పెద్ద పథకం అమలు చేసినా.. ఫలితం మాత్రం పార్టీకి దక్కలేదు. ఇప్పుడు అదే బాట పడితే.. తమకు కూడా ప్రయోజనం లేదని, వ్రతమూ.. ఫలితమూ రెండు చెడుతాయని భావిస్తున్న చంద్రబాబు.. పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇదే జరిగితే.. ఇక, వైసీపీ మాటే వినిపించకుండా పోతుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అవసరమైతే అప్పు చేసైనా ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం గమనార్హం.