ఈ ఎమ్మెల్యేలపై చంద్రబాబుకు అసంతృప్తి?
ఈ లిస్టు చేతిలో పెట్టుకున్న సీఎం ఒక్కొక్కరిని పిలిచి క్లాసు పీకుతున్నట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 28 Dec 2024 5:48 AM GMTప్రజలిచ్చిన అధికారం సద్వినియోగం చేసుకోండి. అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండండి. క్రమశిక్షణతో నడుచుకోండి. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆదరాభిమానాలు పొందండి. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపేదే హితోక్తులు చెబుతున్నా, కొంత మంది ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. యథావిధిగా తమ పనులు కొనసాగిస్తున్నారనే విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి గెలిచాం. ఇప్పుడు ఖాళీగా ఉండమంటే ఎలా.. పెట్టిన డబ్బు తిరిగి తెచ్చుకోవాలి కదా? అని కొంతమంది ఎమ్మెల్యేలు దందాలకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మరికొందరు తమ వ్యాపారాల్లో తీరిక లేకుండా గడుపుతూ ప్రజలకు దూరమవుతున్నారు. ఇలా ప్రజా సేవను సెకండ్ ప్రయార్టీగా భావిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేల లిస్టు సీఎం చంద్రబాబుకు చేరిందట. ఈ లిస్టు చేతిలో పెట్టుకున్న సీఎం ఒక్కొక్కరిని పిలిచి క్లాసు పీకుతున్నట్లు చెబుతున్నారు.
అధికారంలోకి వచ్చిన నుంచి ప్రజాప్రతినిధులుగా ఎలా నడుచుకోవాలో చెబుతూ ఎమ్మెల్యేలను నిరంతరం అప్రమత్తం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు తన పంథా మార్చారు. ఇన్నాళ్లు జాగ్రత్తలు చెప్పిన సీఎం.. ఇకపై జాగ్రత్తలు చెప్పడాలు ఉండవని ఎమ్మెల్యేలకు తెగేసి చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పిలిపించడమో, పార్టీలో సీనియర్ నేతల ద్వారా వార్నింగులు ఇవ్వడమే చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేల్లో ఎవరెవరు? ఎలా పనిచేస్తున్నారో అన్న విషయమై టీడీపీ కార్యకర్తల ద్వారా సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు. పార్టీలో ఇంటిలిజెన్స్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసి, ఏ ఎమ్మెల్యే ఎలా నడుచుకుంటున్నది? ప్రజల్లో వారి పట్ట ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది అన్న విషయాలపై ఓ నివేదిక సిద్ధం చేశారట. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు ఆ నివేదిక ద్వారా సీఎంకు తెలియజేసినట్లు సమాచారం.
అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు ఎమ్మెల్యేల్లో ఎవరెవరు ఏం చేస్తున్నారనే విషయమై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక అందిందని సమాచారం. దీని ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇతర నేతలను కలుపుకుని వెళ్లడంలో విఫలమవుతున్నారని చెబుతున్నారు. ఈ జిల్లాలో ఐదుగురు నేతలు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో జనసేన, బీజేపీ తరపున ఇద్దరు గెలవగా, ఈ ఇద్దరిలో ఒకరిపై కూటమి పార్టీల నేతల నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉందని, ఆయన ఎవరినీ కలుపుకుని వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఓ ఎమ్మెల్యే, అదేనియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతకు అస్సలు పొసగడం లేదు. మెజార్టీ పార్టీ నేతలు కూడా ఆ ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారని సీఎం చంద్రబాబుకు రిపోర్టు వెళ్లింది. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలపై అప్పుడే అసంతృప్తి పెరిగిపోతోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో విజయవాడ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసలు నియోజకవర్గంలో ముఖమే చూపలేదని అంటున్నారు. తనది ఎమ్మెల్యే స్థాయి కాదని భావిస్తున్న ఆ నేత నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యేపై కార్యకర్తలు, నేతలు బాహాటంగానే మండిపడుతున్నారు. అదే విధంగా గుంటూరు నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే, బాపట్ల జిల్లాలోని కీలక నియోజకవర్గానికి చెందిన ఓ బీసీ ఎమ్మెల్యేపైనా చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. నెల్లూరులో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు కన్నా, మైనింగ్ వ్యవహారాల్లోనే ఎక్కువ తలదూర్చుతున్నారని సీఎం సీరియస్ అయినట్లు సమాచారం. ఇక అనంతపురం జిల్లాలోని ఓ కీలక కుటుంబంపైనా సీఎం ఆగ్రహంగా ఉన్నారట.. సొంత పార్టీ నేతలు, కూటమి పార్టీ ఎమ్మెల్యేలతోనూ వీరు కయ్యానికి కాలు దువ్వడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని చంద్రబాబుకు రిపోర్టు వచ్చిందని అంటున్నారు.