చంద్రబాబుతో పిఠాపురం వర్మ.. జనసేనకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మను వ్యతిరేకిస్తున్న జనసేన నేతలు దిమ్మదిరిగిపోయే ఫొటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 13 April 2025 5:05 AMపిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మను వ్యతిరేకిస్తున్న జనసేన నేతలు దిమ్మ దిరిగిపోయే ఫొటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించిన వర్మ ప్రభావం ఏం లేదని, జనసేన బలం వల్లే పిఠాపురంలో జనసేనాని గెలిచారంటూ ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ నేతలు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే.
ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఎన్నికల వరకు ఒకలా మట్లాడి.. ఇప్పుడు మాట మార్చేసిన జనసేన నేతలపై మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రం జనసేనపై ఎలాంటి విమర్శలు చేయకుండా సంయమనం పాటిస్తూనే తన సొంత పార్టీ టీడీపీ క్రమశిక్షణ ఉల్లంఘించనని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ఆయనకు విజయవాడలో ఓ అరుదైన అనుభవం ఎదురైంది. అది గమనించిన వర్మ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు తమ నేత వర్మ క్రమశిక్షణకు తగిన గౌరవం దక్కిందని అంటున్నారు.
విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ నిశ్చితార్థం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు అంతా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం వచ్చారు. అయితే ముఖ్యమంత్రి తమ పార్టీ కార్యకర్తలు అందరినీ పలకరిస్తనే వర్మను చూడగానే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేయి చాచారు.
ఇలా తమ అధినేత తనను పలకరించడంతో ఉద్వేగానికి లోనైన వర్మ వెంటనే షేక్ హ్యాండిచ్చారు. వర్మ క్రమశిక్షణ పాటిస్తూ పార్టీకి ఇబ్బంది లేకుండా వ్యవహరించడం వల్ల చంద్రబాబు వద్ద మంచి మార్కులు సంపాదించారని ప్రచారం ఉంది. అందుకే అందరి నేతలు మాదిరిగా కాకుండా వర్మపై తన ఆప్యాయతను చంద్రబాబు దాచుకోలేకపోయారంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వర్మ అలా షేక్ హ్యాండిచ్చుకోవడమే కాకుండా, నవ్వుతూ ఏదో మాట్లాడుకోవడం కూడా ఆకర్షించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామక్రిష్ణం రాజు కూడా తన్మయత్వం పొందినట్లు సీఎం చంద్రబాబు, వర్మ కరచలానాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయాల్సిన వర్మ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కారణంగా చివరి నిమిషంలో అవకాశం కోల్పోయారు. వాస్తవానికి పవన్ భీమవరంలో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ, పవన్ ఆకస్మికంగా తన నిర్ణయం మార్చుకుని పిఠాపురం ఎంపిక చేసుకోవడంతో టీడీపీ తన నేత వర్మను వెనక్కి తగ్గమని సూచించింది. అంతేకాకుండా పవన్ గెలుపు బాధ్యతలను అప్పగించింది. ప్రతిఫలంగా ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చింది. పార్టీ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించిన వర్మ.. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ ను రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచేలా పనిచేశారు. అయితే ఎన్నికలు ముగిసిన పది నెలలకు జనసేన పార్టీ వర్మ విషయంలో వ్యతిరేక స్వరాలు వినిపించడం మొదలుపెట్టిందని ప్రచారం జరుగుతోంది.
పిఠాపురంలోనే నిర్వహించిన జనసేన ప్లీనరీలో పిఠాపురంలో పవన్ ను గెలిపించామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ వర్మ పేరు పెట్టకుండా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే సమయంలో వర్మను ఎమ్మెల్సీ చేస్తామన్న హామీ నెరవేరలేదు. రెండు విడతలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా, వర్మకు నిరాశే ఎదురైంది. ఈ పరిస్థితుల్లో తమ నేతకు అన్యాయం జరుగుతోందని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేక ప్రచారం చేసినా, వర్మ మాత్రం పార్టీ క్రమశిక్షణను అతిక్రమించకుండా జాగ్రత్త వహించారు. దీంతో ఆయనపై చంద్రబాబు ఫోకస్ చేశారంటున్నారు. వర్మ తీరును మెచ్చుకుంటున్న చంద్రబాబు.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతారని అంటున్నారు.