దగ్గుబాటి ‘ప్రపంచ చరిత్ర’.. ఎన్టీఆర్ అల్లుళ్ల అరుదైన కలయిక
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తోడళ్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం తెలుగు రాజకీయాలను ఆకర్షించింది.
By: Tupaki Desk | 6 March 2025 1:39 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తోడళ్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం తెలుగు రాజకీయాలను ఆకర్షించింది. దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఈ ఇద్దరూ టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆరుకు సొంత అల్లుళ్లు అన్న విషయం తెలిసిందే. అయితే గత 30 ఏళ్లుగా రాజకీయ విభేదాలతో దూరంగా ఉన్న ఇద్దరూ ఈ మధ్యే కలిశారు. దాదాపు మూడేళ్లుగా ఇద్దరూ కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా బహిరంగ వేదికను పంచుకోలేదు. అయితే 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కలయికకు విశాఖ వేదికైంది. ఈ ఇద్దరి తోడల్లుళ్ల కలయికకు మంత్రి లోకేశ్ తోడళ్లుడు, విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం వర్సిటీ ఆతిథ్యం ఇవ్వడం విశేషం.
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. దగ్గుబాటి ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా విశాఖ వచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి కూడా హాజరయ్యారు. అయితే వేదికపై ఎందరు ఉన్నా, చంద్రబాబు, దగ్గుబాటి పక్కపక్కనే కూర్చోవడం అందరినీ ఆకర్షించింది. అంతేకాకుండా డాక్టర్ దగ్గుబాటి ప్రారంభోపన్యాసం చేసిన తర్వాత ఆయనను అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
1995 ఆగస్టు సంక్షోభంలో ఈ ఇద్దరూ కలిసి పనిచేశారు. అప్పట్లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి చేతికి టీడీపీ పగ్గాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పటి పరిణామాల్లో చంద్రబాబు సీఎం అవ్వగా, ఆయన కేబినెట్లో డాక్టర్ దగ్గుబాటి ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆ తర్వాత క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఇక ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న దగ్గుబాటి తన తోడళ్లుడు చంద్రబాబుతో కుటుంబ సంబంధాలు పునరుద్ధరించుకున్నారు. విశ్రాంతి జీవితంలో కుటుంబంతో ఎక్కువ గడుపుతున్న దగ్గుబాటి ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకాన్ని రాశారు. దీనిపై ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన తోడళ్లుడి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎన్టీఆర్ అల్లుళ్లుగా తామిద్దరూ ఎలా నడుచుకుందీ చెప్పడమే కాకుండా, తను కూడా విశ్రాంతి జీవితం ఎలా గడపాలో దగ్గుబాటి నుంచే నేర్చుకుంటానని అన్నారు.
ఫుల్ టైం పొలిటీషియన్ గా పనిచేసిన తన తోడళ్లుడు రచయిత కాదని, కానీ ప్రపంచ చరిత్ర పుస్తకం రాసి రచయితగా మారారని అభినందించారు. ఇదే సమయంలో రాష్ట్రం కోసం బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తమతో కలిశారని, ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన తన కుమారుడు లోకేశ్ తోడళ్లుడు, ఎంపీ భరత్ పై చాలా బాధ్యత ఉందని సీఎం సూచించారు. గీతం వర్సిటీ ప్రతిష్టను ఆయన కాపాడాలని కోరారు.