Begin typing your search above and press return to search.

విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. అర్థరాత్రి 12 గంటల వరకు హోటళ్లకు ఓపెన్

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విజయవాడను కాస్మాపాలిటిన్ సిటీగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది

By:  Tupaki Desk   |   24 March 2025 9:41 AM IST
విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. అర్థరాత్రి 12 గంటల వరకు హోటళ్లకు ఓపెన్
X

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విజయవాడను కాస్మాపాలిటిన్ సిటీగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అర్థరాత్రి పన్నెండు గంటల వరకు అన్ని రెస్టారెంట్లు.. హోటళ్లు తెరిచి ఉంచేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేవారు. ఇదొక్క విజయవాడ నగరం వరకు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ జిల్లా పరిధి మొత్తానికి వీలుగా అనుమతులు ఇచ్చారు.

ఈ ఉత్తర్వుల్ని ఆదివారం అర్థరాత్రి నుంచే అమలు చేయటం ఆసక్తికరంగా మారింది. నిజానికి 2018లోనే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హోటళ్లు అర్థరాత్రి వరకు తెరిచి ఉంచేందుకు వీలుగా అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచచారు. కానీ.. వాటి అమలు జరగలేదు. తాజాగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఈ ఆదేశాల్ని జారీ చేశారు.

మొదట మూడు నెలల పాటు ఈ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. ఆ తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇటీవల కాలంలో విజయవాడ నగరానికి రైలు మార్గంలోనూ.. బస్సు మార్గంలోనూ రాత్రి పది గంటల తర్వాత వచ్చే వారు వేలాదిగా ఉంటారు.అయితే.. ఇప్పటివరకు హోటళ్లు రాత్రి తొమ్మిదిన్నరకే మూతపడుతున్నాయి. దీంతో.. ఏమైనా తినాలంటే పుడ్ కోర్టులను వెతుక్కోవాల్సి వస్తోంది. దీనికి తోడు.. అర్థరాత్రి వేళ వరకు నగరంలో జన సంచారం బాగా పెరిగిన వేళలో.. అందుకు అనుగుణంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఏ పన్ను చెల్లించని వారికి అర్థరాత్రి వరకు అనుమతి ఇస్తున్నప్పుడు.. 13 రకాల పన్నులు చెల్లిస్తున్న హోటళ్లు.. రెస్టారెంట్లకు ఎందుకు అనుమతి ఇవ్వకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యాపార వర్గాలు కోరటం.. అందుకు తగ్గట్లు ఆయన సానుకూలంగా స్పందించటం గమనార్హం. అధికారిక లెక్కల ప్రకారం విజయవాడలో 144 రెస్టారెంట్లు ఉండగా.. 46 హోటళ్లు ఉన్నాయి. చిన్నా పెద్దా కలుపుకుంటే మరో 200 వరకు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం విజయవాడ వాసులకు మాత్రమే కాదు.. విజయవాడకు వివిధ పనుల మీద వెళ్లే ఇతర ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పక తప్పదు.