Begin typing your search above and press return to search.

ఇదే చంద్రబాబు విజన్ : అప్పుడు హైటెక్ సిటీ.. ఇప్పుడు డేటా సిటీ

సీఎం వ్యూహాత్మకంగా పనిచేస్తుండటం వల్ల ఇప్పటికే కొన్ని ఐటీ దిగ్గజాలు విశాఖలో డేటా సెంటర్ల ప్రారంభానికి సమ్మతి తెలిపాయి.

By:  Tupaki Desk   |   27 Jan 2025 10:30 PM GMT
ఇదే చంద్రబాబు విజన్ : అప్పుడు హైటెక్ సిటీ.. ఇప్పుడు డేటా సిటీ
X

విజనరీ లీడరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశవ్యాప్తంగా పేరుంది. ఆయన విజన్ నుంచి పుట్టుకువచ్చిందే నేటి హైదరాబాద్ హైటెక్ సిటీ. 30 ఏళ్ల క్రితం విజన్ 2020 రూపొందించిన చంద్రబాబు హైదరాబాద్ నగరాన్ని ఐటీ ఇండస్ట్రీకి చిరునామాగా మార్చారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీని పునఃనిర్మించాలని భావిస్తున్న చంద్రబాబు ఇప్పుడు తన అభివృద్ధి అజెండాకు విశాఖ నగరాన్ని ఎంచుకున్నారు. హైదరాబాద్ మోడల్ లో వైజాగ్ ను డేటా సిటీగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రఖ్యాత పరిశ్రమలు విశాఖకు తరలివస్తున్నాయి.

విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నగరం అంటూ లేకుండా పోయింది. దీంతో రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకుని అక్కడ విశ్వనగరం నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా అడుగులు వేసినా 2019 తర్వాత ప్రభుత్వం మారడంతో రాజధాని వెనక్కిపోయింది. ఇక గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు రాజధాని అమరావతితోపాటు రాష్ట్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా విశాఖను ఐటీ ఇండస్ట్రీకి కేరాఫ్ గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో వాటికి సపోర్టుగా వైజాగులో డేటా సెంటర్లు నెలకొల్పేందుకు ప్రణాళిక రచిస్తున్నారు సీఎం చంద్రబాబు.

సీఎం వ్యూహాత్మకంగా పనిచేస్తుండటం వల్ల ఇప్పటికే కొన్ని ఐటీ దిగ్గజాలు విశాఖలో డేటా సెంటర్ల ప్రారంభానికి సమ్మతి తెలిపాయి. వైజాగును టెక్నాలజీ హబ్ గా మార్చాలనేది చంద్రబాబు ప్లాన్ అంటున్నారు. ఇందుకోసం విశాఖ పరిసరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్, డేటా సెంటర్స్ ఉండే ఓ టెక్నాలజీ సిటీకి రూపకల్పన చేస్తున్నారు ముఖ్యమంత్రి. మధురవాడ ఐటీ కారిడారులో డేటా సిటీ కోసం 500 ఎకరాలు కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న హైటెక్ సిటీ కూడా 500 ఎకరాల్లోనే తీర్చిదిద్దారు. ఇప్పుడు అదే మోడల్ లో విశాఖలో డేటా సిటీకి పథకం రచిస్తున్నారు. దీని భూ సేకరణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందంటున్నారు.

ప్రతిపాదిత విశాఖ డేటా సిటీలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు గూగుల్ 80 ఎకరాల స్థలాన్ని కోరింది. అదేవిధంగా 90 రోజుల్లో 10 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన టీసీఎస్ కూడా 30 ఎకరాలు కేటాయించాల్సింది దరఖాస్తు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు విశాఖలో పరిశ్రమ స్థాపించాలని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తో మంత్రి లోకేశ్ చర్చించారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో మౌలిక వసతులు కల్పిస్తే ఈ రెండు సంస్థలు తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలా చంద్రబాబు విజన్ - 2047 దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత జోరు చూస్తుంటే విశాఖ ప్రపంచంలోనే ఓ డేటా సిటీగా అభివృద్ధి చెందడంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేటతెల్లమవుతోంది.