Begin typing your search above and press return to search.

వారికి చంద్రబాబు వార్నింగ్‌.. ఫలితమిచ్చేనా?

ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం రవాణా శాఖ, రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే రాంప్రసాద్‌ రెడ్డి సతీమణి ఎస్కార్ట్‌ పోలీసులు ఆలస్యంగా వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 7:35 AM GMT
వారికి చంద్రబాబు వార్నింగ్‌.. ఫలితమిచ్చేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. కొందరు వైసీపీ నేతల వ్యవహార శైలి, వారి మాటతీరు. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు వ్యవహరిస్తున్న తీరు కూడా ఇలాగే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ హైలెట్‌ అవుతున్నాయి. దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అలర్ట్‌ అయ్యారు. వారికి హెచ్చరికలు జారీ చేశారు. కుటుంబ సభ్యులను అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని సూచించారు. అధికారులతో మాట్లాడే పద్ధతి కూడా మారాలన్నారు. మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు సూచించారు.

ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం రవాణా శాఖ, రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే రాంప్రసాద్‌ రెడ్డి సతీమణి ఎస్కార్ట్‌ పోలీసులు ఆలస్యంగా వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య పుట్టిన రోజు వేడుకల్లో ఆరుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు. అదేవిధంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త ఒక వ్యక్తికి చెందిన ఆస్తిని తనకు తక్కువకు అమ్మాలని బెదిరించడంతోపాటు వేధించారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

అదేవిధంగా అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌ రెడ్డి పోలీస్‌ స్టేషన్‌ ను ముట్టడించి సీఐతో క్షమాపణ చెప్పించుకోవడం వివాదం రేపింది. ఈ ఘటనలన్నింటికీ ముందు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ప్రత్యర్థి పార్టీలకు చెందిన భవనాలను జేసీబీలతో నేలమట్టం చేయించడం, అందుకు సంబంధించి హడావుడి చేయడం కాకరేపింది.

ఈ ఘటనలకు సంబంధించిన వార్తలు టీడీపీ అనుకూల మీడియాలోనే వచ్చాయి. ఇలా దూకుడుగా వెళ్తూ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఎమ్మెల్యేలకు చంద్రబాబు ముకుతాడు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు వివాదాస్పద «ఘటనలకు కారణమైన ఎమ్మెల్యేలకు క్లాస్‌ పీకారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఇలాంటి వాటిని సహించబోనని హెచ్చరించారు. వైసీపీ నేతలు ఇలాంటి చర్యల వల్లే అధికారాన్ని కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.

కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతుండడం, అధికారదర్పం ప్రదర్శించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి, ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు బుల్డోజర్లు, పొక్లెయిన్‌ లతో కూల్చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.

కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని, వారి జిల్లాల్లోని ఎమ్మెల్యేలనూ సరైన దారిలో నడిపించాలన్నారు. ప్రవర్తన సరిగాలేని, వివాదాలకు కారకులవుతున్న ఎమ్మెల్యేల్ని పిలిపించి మాట్లాడతానన్నారు.