ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్
కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ శాసనసభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ పీకుతున్నట్లు సమాచారం.
By: Tupaki Desk | 23 Dec 2024 6:30 PM GMTకూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ శాసనసభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ పీకుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలుగా గెలిచిన నుంచి కొందరి తీరు వివాదాస్పదంగా మారడం, తాను వద్దని చెబుతున్నా, ఇసుక, మద్యం వ్యాపారాల్లో తల దూర్చడంపై ఇప్పటికే మాస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఈ సారి గేరు మార్చిన చంద్రబాబు ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సొంత వ్యాపారం కొంత మానుకుని ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు.
ఆర్నెల్ల పాలనలో రెండు సార్లు ఎమ్మెల్యేల సమావేశంలో బహిరంగంగా తీరు మార్చుకోవాలని చెప్పిన చంద్రబాబు ఈ సారి రూటు మార్చారు. పది మందిలో చెబుతుంటే తనకు కాదని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు దులిపేసుకుంటుండటంతో ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడుతున్నారు. సంక్రాంతి పండగ దగ్గర కొస్తుందని, ఇతర ప్రాంతాల వారు సొంతూళ్లకు వస్తుంటారని అలా వచ్చిన వారు రోడ్లు బాగోలేవని, ఇతర సౌకర్యాలపై ఎమ్మెల్యేలు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు వస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగిస్తున్నట్లు సమాచారం.
సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నవంబరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి రోజూ పనుల పురోగతిపై ఆర్అండ్ బీ శాఖ నుంచి నివేదిక తెప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో గోతులమయంగా మారిన రోడ్లన్నీ బాగు చేయాలని ఒకేసారి రూ.809 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో చాలా చోట్ల పనులు జరుగుతున్నా, కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పనులను పట్టించుకోవడం లేదని సీఎం చంద్రబాబుకి ఫిర్యాదులందినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలకు సంక్రాంతి టార్గెట్ ఇచ్చి తమ నియోజకవర్గాల్లో పనులు జరిపించుకోవాల్సిన బాధ్యతలను అప్పగిస్తున్నారట. ఎవరైనా సరే ఇందులో నిర్లక్ష్యంగా ఉంటే సంక్రాంతి తర్వాత తగిన చర్యలు ఎదుర్కోవాల్సివుంటుందని హెచ్చరిస్తున్నారు సీఎం చంద్రబాబు.