ఎమ్మెల్యేలకు బాబు హెచ్చరికల వెనక ?
తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు.
By: Tupaki Desk | 1 March 2025 7:00 AM ISTతెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. అంతే కాదు ఆయన చాలా దూరదృష్టితో ఆలోచన చేస్తారు అని పేరు. ఆయన ఇప్పటి నుంచే పార్టీని 2029 ఎన్నికల దిశగా నడిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇంతకు ఇంత మంది ఎమ్మెల్యేలు గెలిచి రావాలని తాజాగా బాబు టీడీఎల్పీ భేటీలో దిశా నిర్దేశం చేశారు. ఒక విధంగా బాబు వారికి క్లాస్ గట్టిగానే తీసుకున్నారని ప్రచారం సాగుతోంది.
పార్టీకి క్యాడర్ కి లీడర్ కి సంబంధం లేకుండా కో ఆర్డినేషన్ లేకుండా చాలా మంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు అన్నది అయితే పార్టీ పెద్దలకు అందిన నివేదికగా ఉంది అంటున్నారు. దాంతోనే బాబు ఎమ్మెల్యేలకు చెప్పాల్సింది చెప్పారని అంటున్నారు. పార్టీని చూసుకోవాలని ద్వితీయ శ్రేణి నేతలను కలుపుకుని పోవాలని ఆయన సూచించారని తెలుస్తోంది. అంతే కాకుండా పార్టీ క్యాడర్ కి దగ్గరగా ఉండాలని వారికి ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సూచించారు.
అదే విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టాలని కోరారు. అలాగే రోడ్ల మరమ్మతుల విషయంలో శ్రధ చూపించాలని కూడా ఆదేశించారు. అలాగే గడచిన తొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్క్రమాలను జనలోకి విస్తృతంగా తీసుకుని పోవాలని కోరారు.
అలాగే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ గురించి ప్రజలకు చెప్పాలని బడ్జెట్ లో అనేక అంశాలను జనంలో ఉంచి అవగాహన కల్పించాలని కోరారని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బాబు వచ్చే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. అందరూ మళ్ళీ గెలిచి రావాలని ఆయన కోరారని చెబుతున్నారు. పార్టీ ముఖ్యమని బాబు పదే పదే హెచ్చరించారని అంటున్నారు. పార్టీని అలా వదిలేస్తే అందరమూ మునుగుతామని బాబు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
తొందరలోనే తాను ప్రతీ ఎమ్మెల్యేతో ముఖా ముఖీ సమావేశం పెడతాను అని బాబు చెప్పారని తెలుస్తోంది. ఒక విధంగా బాబు చాలా ముందు నుంచే పార్టీని ఎమ్మెల్యేలను కదిలిస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్నపుడు ఏదైతే తప్పు చేసి భారీ మూల్యం చెల్లించుకుందో ఆ తరహా తప్పులను చేయరాదని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు.
పార్టీకి నాయకులకు అలాగే ఎమ్మెల్యేలకు ప్రభుత్వ అధినేతకు మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా చూడాలన్నది బాబు ఆలోచనగా ఉంది. దాంతోనే ఆయన చాలా వేగంగా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా అలెర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు.