బాబుగారి బాధ.. అర్ధమయ్యిందా ..!
మంత్రి వర్గ సమావేశం అనంతరం.. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులకు క్లాస్ ఇచ్చారంటూ.. వార్తలు వచ్చాయి.
By: Tupaki Desk | 24 Oct 2024 9:30 AM GMTమంత్రి వర్గ సమావేశం అనంతరం.. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులకు క్లాస్ ఇచ్చారంటూ.. వార్తలు వచ్చాయి. మంత్రులు, ఇంచార్జ్ మంత్రులు.. తమ తమ జిల్లాలకు వెళ్లడం లేదని.. బలమైన వ్యూహంతో ప్రజలను కలుసుకోవడం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారని కూడా వార్తలు హల్చల్ చేశా యి. అయితే.. దీనివెనుక వాస్తవం ఏంటి? అసలు చంద్రబాబు సమస్య ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. చంద్రబాబు క్లాస్ ఇచ్చిన మాట వాస్తవే.
కానీ, పైకి చెబుతున్నట్టుగా జిల్లాలకు వెళ్లడం లేదని.. ఇంచార్జ్ మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడం లేదని అనేది కొంత వరకే వాస్తవం. మరో కీలక అంశంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఇసుక, మద్యం వ్యవహారాల్లో కొందరు మంత్రులకు నేరుగా సంబంధాలు ఉన్నాయ నే విషయంపైనే చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసి.. వారికి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే .. దీనిని మరో కోణంలో ప్రచారం చేయడం గమనార్హం.
ప్రస్తుతం ప్రతి జిల్లాలోనూ మంత్రుల ప్రమేయం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల జోక్యం ఉందని పైకి అంటున్నారు. వారికంటే ఎక్కువగా మంత్రులు కూడా ఇసుక, మద్యం విషయాల్లో పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటున్నారన్నది వాస్తవం. ఈ విషయంపైనే ప్రధానంగా చంద్రబాబు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, 100 రోజుల తర్వాత కూడా.. కొందరు మంత్రులు పుంజుకోలేక పోతున్నారని.. కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. తనతో పోటీ పడాలని వారికి పిలుపునిచ్చారు.
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుకలో ఉన్న లోపాలను సరిదిద్దే బాధ్యతను కూడా మంత్రులకే అప్పగించడం గమనార్హం. నిజానికి వారిపైనే సందేహాలు వ్యక్తం చేసిన చంద్రబాబు.. తిరిగి ఆ బాధ్యతల ను వారికే అప్పగించడం విశేషం. ప్రధానంగా అనంతపురంలో జరుగుతున్న వివాదాలను చంద్రబాబు ప్రస్తావించినట్టు సమాచారం. స్థానికంగా మంత్రికి.. నాయకులకు పడడం లేదు. దీనిపై చంద్రబాబు ఆరా తీశారు. మొత్తానికి చంద్రబాబు మంత్రుల విషయంలో గతంలో ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉండడం గమనార్హం.