Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు - త‌మ్ముళ్లు... కొన్ని హెచ్చ‌రిక‌లు... !

సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా అనేక హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. సాధార‌ణంగా అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యంగా ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న నాయ‌కుడు హెచ్చ‌రిక‌లు జారీ చేశారంటే ఏమ‌ని భావించాలి? ప్ర‌తిప‌క్షాలు దారి త‌ప్పుతున్నాయి.

By:  Tupaki Desk   |   1 Dec 2024 3:30 PM GMT
చంద్ర‌బాబు - త‌మ్ముళ్లు... కొన్ని హెచ్చ‌రిక‌లు... !
X

సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా అనేక హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. సాధార‌ణంగా అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యంగా ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న నాయ‌కుడు హెచ్చ‌రిక‌లు జారీ చేశారంటే ఏమ‌ని భావించాలి? ప్ర‌తిప‌క్షాలు దారి త‌ప్పుతున్నాయి.. కాబ‌ట్టివాటిని స‌రైన మార్గంలో న‌డిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్న సంకేతాలు ఇచ్చే క్ర‌మంలోనే సీఎం స్థానంలో ఉన్న నాయ‌కుడు ఇలా హెచ్చ‌రిక‌లు చేస్తారు. ఇది కామ‌న్ కూడా. గ‌తంలో వైసీపీ అధినేత ఎలాంటి హెచ్చ‌రిక‌లు చేయ‌లేదు.

కార‌ణం.. అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ నాయ‌కులు అన్ని విష‌యాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. దాని తాలూకు ఆనవాళ్లు వైసీపీ నేత‌ల చుట్టూనే తిరిగాయి. దీంతో జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు చేయ‌లేదు. కానీ, అంత‌ర్గ‌తంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిని మాత్రం ఆయ‌న వ‌దిలి పెట్ట‌కుండా.. ఆఫీసుకు పిలిచి వార్నింగులు ఇచ్చారు. దీంతో కొంత వ‌ర‌కు క‌ట్ట‌డి జ‌రిగింది. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు బ‌హిరంగ వేదిక‌ల‌పైనే హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు.

కానీ, ఆయన చేస్తున్న ఈ హెచ్చ‌రిక‌లు ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల‌ను ఉద్దేశించి అయితేకాదు. ఎందుకంటే .. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీకి దూకుడు పెంచే అవ‌కాశం లేదు. పైగా నాయ‌కులు కూడా ఎక్క‌డిక‌క్క‌డ మౌనంగా ఉంటున్నారు. సో.. బాబు హెచ్చ‌రిక‌లు గుండుగుత్త‌గా కూట‌మి నాయ‌కుల‌ను ఉద్దేశించిందేన‌న్న‌ది నిష్టుర స‌త్యం. వీరిలోనూ.. బీజేపీ నేత‌లు దూకుడుగా లేదు. ఒక‌రిద్దరు జ‌న‌సేన నాయ‌కులు మాత్రం దూకుడుగానే ఉన్నారు.

మిగిలిన వారంతా టీడీపీనాయ‌కులే. ఎక్క‌డ ఎలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. అన్ని వేళ్లూతమ్ముళ్ల చుట్టూ నే చూపిస్తున్నాయి. అనుకూల మీడియాలోనూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ఇసుక విష‌యం త‌మ్ముళ్ల‌ను కుదిపేసింది. దీనిపై బాబు వార్నింగులు ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు మ‌ద్యం బెల్టు దుకాణాల వ్య‌వ‌హారం మ‌రింత కుదిపేస్తోంది.

బెల్టు దుకాణాల నిర్వ‌హ‌ణ‌కు అనంత‌పురం, క‌ర్నూలు, విశాఖ‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలం వేసిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌పై స్పందించిన సీఎం బెల్టు షాపులు నిర్వ‌హిస్తే.. బెల్టు తీస్తానంటూ హెచ్చ‌రిక‌లు చేశారు. కానీ, ఏమేర‌కు ఇది ఫ‌లిస్తుందో చూడాలి. చూడ‌గా చూడ‌గా.. పేప‌ర్ పులి గాండ్రింపుల్లా మారిపోతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.