బాబు మాట...సంపద సృష్టించే వరకు పధకాలు రావు !?
మొత్తానికి చూస్తే ఏపీలో పధకాలు ఎపుడు అని ఇక అడగకూడదేమో. సంపద సృష్టి జరిగిందా అని ప్రతీ రోజూ కొలమానం వేసుకుంటూ పోవాల్సిందే.
By: Tupaki Desk | 9 Feb 2025 11:38 AM GMTముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. ఆయన మాటలను బట్టి అర్ధాలను తెలుసుకోవాల్సిందే. ఏపీలో సంక్షేమ పధకాలు ఎపుడు ఇస్తారు అన్న మాటకు సరైన సమాధానంగా కూడా చూడాల్సి ఉంది. చంద్రబాబు ఎన్నికల వేళ పధకాల గురించి చెప్పారు కదా అమలు చేయాల్సిందే అని విపక్షాలు ఎన్ని అయినా అనవచ్చు కాక. కానీ బాబు ఎన్నికల సమయంలో నిజంగా ఏమి చెప్పారు. ఆయన సంక్షేమ పధకాలు ఇస్తామని చెప్పారు. దానికి ముందు ఆయన మరో మాట కూడా అన్నారు. అదే సంపద సృష్టించే పధకాలు ఇస్తామని.
మరి అది మరచిపోయి పధకాలు బాబు ఇవ్వలేదని అడిగితే అర్ధం ఉంటుందా. సరే సంపద సృష్టించి పధకాలు ఇవ్వండి అన్న మాటకు అంతా వచ్చినా ఆ సంపద సృష్టి ఎపుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అసలు సంపద సృష్టి అన్న దానికి నిర్వచనం ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలి. అంటే బయటకు అందరికీ ఇదిగో ప్రభుత్వం వద్ద డబ్బు ఉంది కదా అంటే అది కూడా తప్పు.
సర్కార్ పెద్దల దృష్టిలో ఇదిగో సంపద సృష్టించామని చెప్పేంతవరకూ సంపద సృష్టి జరగనట్లే. అలా సంపద సృష్టి మీద క్లారిటీ రానంతవరకూ పధకాల అమలు విషయంలోనూ క్లారిటీ రానట్లే. ఇదే విషయం ఇపుడు అంతా అర్ధం చేసుకోవాలి. ఇదిలా ఉంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలు అయి బీజేపీ అధికారంలోకి వచ్చింది.
మిత్రపక్షం నేతగా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన పార్టీ నాయకుడిగా చంద్రబాబు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఈ సందర్భంగా చెప్పిన వాటిని నోట్ దిస్ పాయింట్స్ అనుకోవాల్సిందే. బటన్ నొక్కే వాళ్ళకు జనాలు విరామం ఇచ్చారని అన్నారు. అంటే బటన్ నొక్కితే అధికారం దక్కదని ఇటు ఏపీ అటు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని చెప్పారు అన్న మాట.
ఏపీలో అయిదేళ్ళకే వైసీపీని జనాలు ఓడిస్తే ఢిల్లీ జనాలు పదేళ్ళ సమయం తీసుకున్నారు తప్ప బటన్ నొక్కుడు పాలన వద్దు అని రెండు చోట్లా జనాలు తిరస్కరించారన్నది బాబు మాటల వెనక తాత్పర్యంగా చూడాలని అంటున్నారు. అంతటితో ఆగకుండా సంపద సృష్టించాకే పధకాలు అని బాబు చెప్పేశారు.
మరి సంపద సృష్టించడానికి ఎంత సమయం పడుతుంది అన్న దానికి అయితే బదులు ఉండదేమో. ఎందుకంటే సంపద సృష్టి అంత ఈజీ కాదు, అందువల్ల సంపద సృష్టించి పధకాలు ఏపీలో అమలు జరిపేంతవరకూ జనాలు నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందేనా అంటే అలాగే అనుకోవాల్సిందే అంటున్నారు.
ఇక బాబు చెప్పిన మాటలను బట్టి చూస్తే జనాలు అభివృద్ధిని కోరుకునే అక్కడ బీజేపీని ఇక్కడ వైసీపీని గెలిపించారు అని భావించాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయడానికే పాలకులు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెబుతున్నట్లుగా ఉంది. అంతే కాదు ఎన్నికల వేళ తాను ప్రజలకు చెప్పిందేంటో ఆయన స్పష్టంగా చెప్పారు. సంపదను సృష్టించి పధకాలు ఇస్తామని అన్నామని అన్నారు. అందువల్ల ప్రజలంతా చైతన్యవంతులై కూటమిని గెలిపించారని బాబు అంటున్నారు.
మొత్తానికి చూస్తే ఏపీలో పధకాలు ఎపుడు అని ఇక అడగకూడదేమో. సంపద సృష్టి జరిగిందా అని ప్రతీ రోజూ కొలమానం వేసుకుంటూ పోవాల్సిందే. అయినా అది జనం చూసే కోణం వేరు పాలకులు చూసే కోణం వేరు కాబట్టి ఆ విషయంలో ఎంత ఆయాసపడినా కూడా అయ్యేదేమీ ఉండదని అంటున్నారు. ఏది ఏమైనా సంక్షేమ పధకాలు అమలు చేస్తామని బాబు చెబుతూనే ఒక రకమైన కండిషనల్ లాంటి సంపద సృష్టి అన్న మాటను వాడారు. మరి ఏపీ జనాలు ఇప్పట్లో పధకాల గురించి ఆశ పెట్టుకోవడం భావ్యం కాదేమో.
అయినా ఎన్నికల హామీలు అంటే ఎన్నెన్నో చెబుతూంటారు. అన్నీ అమలు కావాలంటే కుదరదు కదా. అవి కూడా ఇలా ప్రమాణం చేసిన వెంటనే చేయాలంటే కూడా అసలు కుదరదు కదా. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో ప్రయారిటీ ఉంటుంది. ఒక్కసారి అధికారంలోకి వచ్చాక అయిదేళ్ళలో ఎపుడైనా వారు తమకు అంతా వీలు ఉంది అనుకున్నపుడు తాము చెప్పిన హామీలను అమలు చేయవచ్చు. కొన్ని సందర్భాలలో అయిదేళ్ళలోనూ చేయలేకపోవచ్చు. అందువల్ల ఆరాటాలూ పోరాటాలూ మానేసి సర్కార్ మీద పూర్తి ఆశావహ దృకపధంతో వేచి చూస్తూ ఉండడమే ఓటర్ల పని. ఎందుకంటే అయిదేళ్ళ వరకూ వారికి తీర్పు ఇచ్చే పని లేదు కాబట్టి.