వాలంటీర్ పవర్ ఫుల్... బాబు ఏం చెప్పారంటే ?
గౌరవ వేతనం ఇస్తూ ఆసక్తి గల యువత సేవలను దీని కోసం వాడుకోవచ్చు అన్న ఆలోచన గొప్పదే.
By: Tupaki Desk | 9 April 2024 5:30 PM GMTవాలంటీర్ వ్యవస్థని వైఎస్ జగన్ తెచ్చారు. దేశంలో ఎక్కడా ఆ వ్యవస్థ అన్నది లేదు. పౌర సేవలను ప్రజల ఇంటికి వెళ్లి వారికి డోర్ డెలివరీ చేయవచ్చు. గౌరవ వేతనం ఇస్తూ ఆసక్తి గల యువత సేవలను దీని కోసం వాడుకోవచ్చు అన్న ఆలోచన గొప్పదే. దీని వల్ల ప్రజల అవసరాలు తీరుతాయి. అలాగే యువతలకు ఎంతో కొంత వేతనం దక్కుతుంది.
రెండిందాల లాభసాటిగా ఉన్న ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి జగన్ క్రియేటర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ ఆయన బ్రెయిన్ చైల్డ్ అయింది. పరిపాలనా సంస్కరణలలో ఇది ముందడుగు అని చెప్పాలి. కాంగ్రెస్ ఏలుబడిలో ఒకటి రెండు నియోజకవర్గాలను కలుపుతూ లుండే తాలూకాలు సమితులలో పాలన సాగేది. దాన్ని ఎన్టీయార్ మడల వ్యవస్థగా మార్చి పాలనలో అప్పటికి కొత్త సంస్కరణలు తీసుకు వచ్చారు.
ఆ తరువాత గ్రామ పరిపాలన అంటూ ప్రతీ ఇంటికి ప్రభుత్వ సేవలను జగన్ తీసుకుని వచ్చారు. ఈ వ్యవస్థ మీద విమర్శలు ఎన్ని ఉన్నా ఇది ప్రజలకు బాగా కనెక్ట్ అయిపోయింది. దీని మీద విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా జనాలకు మాత్రం పట్టడం లేదు. ఒకనాడు అయితే టీడీపీ వాలంటీర్ల వ్యవస్థ మీద ఘాటైన విమర్శలు చేసింది.
ఇంట్లో మగవారు లేని సమయంలో వాలంటీర్లు ఇంట్లోకి వస్తారని వారికి అక్కడ ఏమి పని అని ప్రశ్నించింది. అలాగే వాలంటీర్లను ఇళ్ళలోకి రానీయవద్దు అని కూడా పిలుపు ఇచ్చింది. మరో వైపు జనసేన అయితే వారిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు అని విమర్శలు చేసింది.
దీని మీద కూడా ఎంతో రచ్చ సాగింది. చివరికి వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతోంది. ఇపుడు ఈసీ ఆంక్షల నేపధ్యంలో వాలంటీర్లు విధులకు దూరంగా ఉన్నారు. దాంతో వృద్ధుల పెన్షన్ అన్నది ఇబ్బందిలో పడింది. వారు సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సి వచ్చింది.
దాంతో ఇది రాజకీయంగా దుమారం రేపింది. ఒక సెక్షన్ అంతా దీని మీద మండిపోతోంది. దీంతో ఎన్నికల్లో ఈ అంశం తీవ్రంగా ప్రభావం చూపుతుందని విపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఉగాది శుభవేళ పురస్కరించుకుని ఆయన వాలంటీర్ల గౌరవ వేతనం ఇపుడు ఇస్తున్న దానిని డబుల్ చేస్తామని ప్రకటించారు.
టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు పది వేల రూపాయలను ఇస్తామని ఆయన అంటున్నారు. ఇది నిజంగా వాలంటీర్ల విషయంలో టీడీపీలో వచ్చిన భారీ మార్పునకు కారణం. అంతే కాదు వాలంటీర్ల వ్యవస్థను తాము తీసేయడం లేదని చంద్రబాబు చెప్పారు.
అయితే చంద్రబాబు కంటే ముందు వైఎస్ జగన్ వాలంటీర్ల వ్యవస్థను తాము అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామని చెప్పారు. వారిని అన్ని రకాలుగా మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు దీంతో ఏపీ రాజకీయాల్లో వాలంటీర్లు అత్యంత కీలకంగా మారుతున్నారు. వాలంటీర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు.
అయితే వాలంటీర్ల వ్యవస్థ అన్న దాన్ని క్రియేట్ చేసినది తామే కాబట్టి తమ వైపే వాలంటీర్లు ఉంటారని వైసీపీ అంటోంది. వాలంటీర్లను తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ గౌరవం ఇచ్చి ఉపయోగిస్తామని చెప్పుకొచ్చింది. ఇక్కడ తమాషా ఏంటి అంటే జగన్ కి పాలన తెలియదు అన్న చంద్రబాబు ఆయన చేపట్టిన పాలనా సంస్కరణలనే తాము అమలు చేస్తామని చెప్పడం. దీని మీదనే వైసీపీ టీడీపీతో ఒక ఆట ఆడుకుంటోంది.
జగన్ దే అసలైన విజన్ అంటోంది. జగన్ పధకాలు ఆయన పాలనా తెస్తామని చెబితే టీడీపీ అవసరం కొత్తగా ఏమి ఉంటుందని ప్రశ్నిస్తోంది. అంతే కాదు చంద్రబాబు మాటలను జనాలు నమ్మారని ఆయన చెప్పినది చేయడని కూడా విమర్శిస్తోంది. మొత్తం మీద బాబు ఇపుడు వైసీపీ ట్రాక్ లో అడుగులు వేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. దీని ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.