ఎంజాయ్ చేయొద్దు.. బాధ్యతగా ఉండండి: చంద్రబాబు దిశానిర్దేశం
వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని సూచించారు, వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే ప్రసక్తి కూడా లేదన్నారు. ఏదైనా ఉంటే.. ముందుగా తనకు తెలియ జేయాలని కూడా చంద్రబాబు సూచించారు.
By: Tupaki Desk | 12 Jun 2024 4:35 PM GMTతన టీంలో మంత్రులకు ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఏదు వరకు దాదాపు మూడు గంటల పాటు వారికి అనేక విషయాలను వెల్లడించారు. వీరిలో 17 మంది కొత్త వారు కావడంతో మరింత జాగ్రత్తగా ప్రతివిషయాన్నీ వివరించారు. మంత్రి పదవి అంటే ఎంజాయ్ చేయడానికి కాదన్నారు. ప్రతి విషయాన్ని సమగ్రంగాఅర్ధం చేసుకోవాలని.. ఉన్నతాధికారుల సాయాన్ని కూడా తీసుకోవాలని సూచించారు. ఇదేసమయంలో ఎంతో మంది మంత్రి పదవుల కోసం పోటీలో ఉన్నారని తెలిపారు.
అయినప్పటికీ.. కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ప్రజలకు సరికొత్త పాలనను అందిస్తున్నామన్న సంకేతాలు పంపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి క్షణం మంత్రులపై మీడియా పరిశీలన ఉంటుందని.. కాబట్టి ఎవరూ అతిగా వ్యవహరించ వద్దని దిశానిర్దేశం చేశారు. ఏదైనా సందేహం ఉంటే తనను నేరుగా సంప్రదించాలని సూచించారు.
సీనియర్ అధికారులకు కూడా అవగాహన ఉంటుందని, వారి సూచనలు సలహాలు తీసుకుంటే తప్పులేదని.. అయితే..త ప్పుదోవ పట్టించే వారు కూడా ఉంటారని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని కట్టడి చేసుకోవాలని కొందరు మంత్రులకు చంద్రబాబు ప్రత్యేకంగా సూచించడం గమనార్హం. కుటుంబ వ్యవహారాలు తీసుకువస్తే.. అది ప్రభుత్వంపై ప్రధానంగా ప్రభావం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలు వంటివి కొంత వరకే పరిమితం చేసుకోవాలన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని సూచించారు, వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే ప్రసక్తి కూడా లేదన్నారు. ఏదైనా ఉంటే.. ముందుగా తనకు తెలియ జేయాలని కూడా చంద్రబాబు సూచించారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని చంద్రబాబు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నియోజకవర్గాల్లో పరిస్థితి ఇబ్బందిగా ఉందని.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చి.. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తారని చంద్రబాబు తెలిపారు. అందరి సమస్యలను ఓపికగా ఆలకించాలని.. ప్రతి వినతి పత్రాన్ని భద్రంగా తీసుకోవాలని.. దేనినీ తక్కువ చేసి చూడరాదని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు కూడా వారి ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ డైరీ మెయింటెన్ చేయాలని.. సమస్యలను పరిష్కారాలను కూడా దానిలో రాసుకోవాలని. తెలిపారు. దుబారా ఖర్చలు లేకుండా మంత్రిత్వ శాఖలను నిర్వహించాలని చెప్పారు.