Begin typing your search above and press return to search.

కాపులకు కనికట్టు..ఆత్మ గౌరవం తాకట్టు...!

ఏపీలో కాపులు నిర్ణయాత్మకమైన శక్తిగా ఉన్నారు. వారి ఓట్లు కావాలి

By:  Tupaki Desk   |   24 Feb 2024 9:19 AM GMT
కాపులకు కనికట్టు..ఆత్మ గౌరవం తాకట్టు...!
X

ఏపీలో కాపులు నిర్ణయాత్మకమైన శక్తిగా ఉన్నారు. వారి ఓట్లు కావాలి. సీట్లు మాత్రం ఇవ్వకూడదు ఈ రకమైన విధానంతో టీడీపీ పొత్తు రాజకీయం నడుపుతోంది. అంతా అనుకున్నట్లుగానే కాపులకు రెండు పదుల సీట్లను విదిలించి అదే గొప్ప అన్నట్లుగా సర్దుకోమంటోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ని ఓడించడం కోసం పొత్తు అంటున్నారు.

బాగానే ఉంది జగన్ ని ఓడిస్తే అధికారం రావాలి కదా అది ఎవరికి దక్కుతుందో కూడా చూడాలి కదా అని అంటున్నారు కాపు నేతలు శ్రేయోభిలాషులు. కాపులకు ఉభయ గోదావరి జిల్లాతో పాటు ఏపీ మొత్తం మీద చూస్తే 75 నుంచి ఎనభై సీట్లలో బలం ఉంది. వారు గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. అలాంటి చోట వారికి పొత్తులో దక్కే సీట్లు నాలుగవ వంతు కూడా లేవు అని అంటున్నారు.

మొత్తం ఎక్కువ సీట్లు పోటీ చేసేది టీడీపీయే అయినపుడు కాపులకు అధికారంలో వాటా ఎలా దక్కుతుంది అన్నది పెద్ద ప్రశ్న. అంటే చంద్రబాబు పల్లకి మోసేందుకేనా ఈ పొత్తులు అని నిలదీతలు కూడా మొదలవుతునాయి. చంద్రబాబు ఏమీ కొత్త నాయకుడు కాదు, సీఎం పదవి కి ఆయన అంతకంటే కొత్త కాదు, ఆయన మూడు సార్లు చేసేసిన పదవి అది.

మరి ఈ పర్యాయం కాపులకు తగిన వాటా ఇచ్చి వారికి సీట్లు ఇచ్చి ఎందుకు కాపుల సుదీర్ఘ డిమాండ్ ని నెరవేర్చకూడదు అన్నది కాపుల నుంచి వస్తున్న ప్రశ్న. కాపులకు ముఖ్యమంత్రిగా అవకాశం ఈసారి రాకపోతే మరెపుడు అన్నది కూడా వారిలో ఆవేదన. టీడీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం బలహీనంగా ఉంది. అలాంటి పార్టీ కూడా పొత్తు వేళ జనసేనకు ఇంత తక్కువ సీట్లు ఇచ్చి తాను బలపడాలని చూడడం ద్వారా పొత్తు వల్ల ఎవరికి రాజకీయ లాభం అని చెబుతోందని కూడా ప్రశ్నిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లే తీసుకుని పోటీ చేసి చిన్న పార్టీగా అసెంబ్లీలోకి వెళ్తే జనసేనకు కలిగే రాజకీయ లాభమేంటని కూడా అడుగుతున్నారు. పొత్తు ధర్మం లో గౌరవప్రదంగా సీట్లు ఉండాలని పవన్ అంటూ వచ్చారు. మరి 24 సీట్లు అంటే గౌరవప్రదమా అని కాపు పెద్దల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి రాజకీయ బేరం సరిగ్గా చేసుకుని ఉంటే ఇదే జనసేనకు ఒక సువర్ణ అవకాశంగా ఉండేదని అంటున్నారు.

ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలు అయితే జనసేన కంటే భారీ నష్టం టీడీపీకే అన్నది ఆ మాత్రం రాజకీయం తెలిసిన ఎవరైనా చెబుతారు. మరి అంతటి నష్టం ఉంటుందని తెలిసి టీడీపీ పొత్తుకు వస్తే దాని నుంచి లబ్ది పొందాల్సిన జనసేన పూర్తిగా పొందుతోందా అన్నదే చర్చగా ఉంది. జనసేన ఇది చాలు అని సర్దుకుపోయినా కాపులు సర్దుకుంటారా అన్నది మరో ప్రశ్న.

కాపు వృద్ధ నేత చేగొండి హరి రామజోగయ్య మొదటి నుంచి చెబుతున్నారు. కాపులకు తగిన నిష్పత్తిలో సీట్లు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అలా జరగకపోతే ఓట్ల బదిలీ జరగదు అని కూడా అంటున్నారు. మరి ఇంత తక్కువ సీట్లు ఇస్తే ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏది ఏమైనా కాపులకు కనికట్టు చేసి వారి ఆత్మ గౌరవం తాకట్టు పెడితే అందులో నుంచి రాజకీయ లాభం పొందడం సాధ్యమేనా అన్నదే పెద్ద ప్రశ్న. మరి చూడాలి ఏమి జరుగుతుందో.