వాటే చేంజ్ గురూ : బాబు ఇంటికి అమిత్ షా !
ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అని ఒక ముతక సామెత ఉంది
By: Tupaki Desk | 11 Jun 2024 10:38 AM GMTఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అని ఒక ముతక సామెత ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో ఇది నూరు శాతం నిజం అవుతోంది. కొద్ది నెలల క్రితం వరకూ చంద్రబాబు ఢిల్లీ వెళ్తే బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు లభించేవి కావు. బాబు ఒక సందర్భంలో మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి ఢిల్లీ పెద్దల దర్శనం దొరకక వెనక్కి తిరిగి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ఇపుడు అంతా టోటల్ గా చేంజ్ అయింది. దీన్ని టైం అని కూడా అనుకోవచ్చు. ఏపీలో అత్యంత భారీ మెజారిటీతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. అదే విధంగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ ఎంపీల మద్దతు చాలా అవసరం.
దాంతో చంద్రబాబు ప్రాధాన్యాత అమాంతం పెరిగిపోయింది. నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరూ బాబుకు ఎనలేని గౌరవం ఇస్తున్నారు. చంద్రబాబు 2014లో ఏపీ సీఎం గా ప్రమాణం చేస్తే నాడు ఎల్ కే అద్వానీ వంటి వారు వచ్చారు కానీ మోడీ రాలేదు.
ఈసారి అలా కాదు ఏకంగా మోడీ ముఖ్య అతిధిగా ఏపీకి వచ్చి మరీ బాబు సీఎం గా ప్రమాణం చేసే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆయన ఈ నెల 12న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వస్తూంటే ఒక రోజు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బాబు ప్రమాణ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం చూస్తే బాబుకు బీజేపీ బిగ్ షాట్స్ ఇస్తున్న ప్రయారిటీ చర్చకు వస్తోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం సాయంత్రం ఏపీకి వస్తున్నారు. ఆయన ఒక రోజు ముందుగా రావడమే కాదు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ కానున్నారు అని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం సాగుతున్న రాజకీయాలు పరిస్థితుల మీద ఇద్దరు నేతలూ చర్చిస్తారు అని అంటున్నారు.
దీనిని బట్టి చూస్తే బీజేపీ బిగ్ షాట్స్ బాబుకు ఎంతలా ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఒక దేశ హోం మంత్రి బాబు ఇంటికి రావడం ఆయనతో గడపడం దేశ రాజకీయాల మీద చర్చించడం వంటివి చూస్తూంటే బాబు చక్రం మరో మారు గిర్రున జాతీయ స్థాయిలో తిరుగుతోంది అని అంతా అంటున్నారు.
కేంద్రంలో అటు జేడీయూ, ఇటు టీడీపీ ఈ రెండు పార్టీల ఊత కర్రల మీదనే ఎన్డీయే సర్కార్ నిలబడింది. విశ్వసనీయతలో బాబు జేడీయే నేతల కంటే ఎక్కువ అని బీజేపీ పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. బాబు ఏమి ఆలోచించినా ఏపీ స్టేట్ గురించే తప్ప మరోటి ఉండదని అందువల్ల ఆయన తమకు కచ్చితంగా అయిదేళ్ళూ నమ్మకమైన మిత్రుడుగా ఉంటారని కూడా వారు భావిస్తున్నారు. మొత్తానికి బాబు చుట్టూ జాతీయ రాజకీయాలు తిరుగుతున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ అంటున్నారు.