‘సీఎంగా అసెంబ్లీకి’.. వారిద్దరిలో సభలో ఎవరో ఒకరేనా?
ఎంతో హోరాహోరీగా సాగిన ఎన్నికలు అయిపోయాయి. ఇక ఫలితం కోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే.
By: Tupaki Desk | 15 May 2024 3:30 PM GMTఆంధ్రప్రదేశ్ అంటేనే ఢీ అంటే ఢీ అనే తరహా రాజకీయాలు.. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల్లా కాక.. శత్రువుల్లా తలపడుతుంటాయి. ఒకరిపై ఒకరు విమర్శలు ఎప్పుడో దూషణల స్థాయికి వెళ్లాయి. విధానాలను తప్పుబట్టడం పోయి.. వ్యక్తిగత ఆరోపణలు మితిమీరాయి. ఇక ఎన్నికల సమయంలో ఎవరి మీడియా వారిదే. ప్రత్యర్థి పార్టీపై దుమ్మెత్తిపోయడమే. దీనికితోడు సోషల్ మీడియా సైన్యాలు.
అసెంబ్లీ సంగతేమిటో?
ఎంతో హోరాహోరీగా సాగిన ఎన్నికలు అయిపోయాయి. ఇక ఫలితం కోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే. ఆ తర్వాత సీఎం ప్రమాణ స్వీకారం. అనంతరం అసెంబ్లీలో సభ్యుల ప్రమాణం. అటుపై వర్షాకాల సమావేశాలు.. ఇదంతా ఎవరు గెలిచినా జరిగిదే. కానీ, ఏపీ రాజకీయాల ప్రకారం చూస్తే మాత్రం మున్ముందు పెద్ద కథే నడవనుంది.
బాబు శపథం..
తన భార్యను అవమానించారంటూ రెండున్నరేళ్ల కిందట టీడీపీ అధినేత చంద్రబాబు నిండు అసెంబ్లీలోనే ఆవేదన వ్యక్తం చేసి.. ఆవేశపూరితంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అదే ఆగ్రహంతో ఆయన సభలో చాలెంజ్ కూడా చేశారు. ‘‘సీఎంగానే ఇకపై సభలో అడుగుపెడతానంటూ’’ వెళ్లిపోయారు. ఆ తర్వాత మీడియా ముంగిట తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని తలచుకుంటూ కంటతడి పెట్టారు. ఇప్పుడు ఎన్నికల్లో గనుక గెలిస్తే.. చంద్రబాబు శపథం నెరవేరుతుంది. ఆయన సీఎంగా నేరుగా అసెంబ్లీలో అడుగుపెడతారు. ఓడిపోయారంటే.. ఆయన చాలెంజ్ ప్రకారమే మళ్లీ చంద్రబాబును అసెంబ్లీలో చూడలేం.
జగన్ నాడు బాయ్ కాట్.. నేడు మరి?
ఎన్నికల్లో గెలిస్తే వైఎస్ జగన్ వరుసగా రెండోసారి సీఎం అయి తండ్రి రికార్డును అందుకుంటారు. మరి ఓడితే.. అసెంబ్లీకి వెళ్తారా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే.. తమ గొంతును అణచివేస్తున్నారంటూ 2017లో టీడీపీ ప్రభుత్వం ఉండగా జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. అసలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ శాసన సభకు వెళ్లలేదు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర చేపట్టారు. అధికారం సాధించి సీఎంగానే సభలో అడుగిడారు. ఆయన పదవిలోకి వచ్చాక టీడీపీ పట్ల అసెంబ్లీలో అంతకంతకూ అన్నట్లు వ్యవహరించారు. కాగా, మరి ఈసారి ఓడితే సభలో అడుగుపెడతారా? అంటే.. చంద్రబాబులా శపథం ఏమీ చేయలేదు కాబట్టి జగన్ అసెంబ్లీకి వెళ్తారనే చెప్పొచ్చు. కాకపోతే, ఆ తర్వాత మాత్రమే ఏం జరుగుతుంది? అనేది చూడాలి.
కొసమెరుపు: జన సేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విజయం సాధిస్తే ఈసారి ఏపీ అసెంబ్లీ రసవత్తరంగా ఉండడం ఖాయం. పార్టీ ఓడిపోతే చంద్రబాబు సభకు రారు. అప్పుడు పవన్ కల్యాణ్ హైలైట్ అవుతారు. జగన్ పార్టీ ఓడితే అప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే పాయింట్ కూడా కీలకమే.