అటు జగన్...ఇటు చంద్రబాబు భారీ మోహరింపు...!
ఏపీలో ఎన్నికల వేడిని పీక్స్ కి పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు యధాశక్తిగా ప్రయత్నం చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 March 2024 3:51 AM GMTఏపీలో ఎన్నికల వేడిని పీక్స్ కి పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు యధాశక్తిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక లెవెల్ లో మాత్రమే పోలిటికల్ హీట్ ఉండేది. ఇపుడు దాన్ని రెండవ లెవెల్ కి తీసుకెళ్ళేందుకు రెండు పార్టీల నుంచి ఇద్దరు అధినేతలు జనంలోకి వస్తున్నారు. దానికి వారు ఎంచుకున్న ముహూర్తం మీద కూడా చర్చ సాగుతోంది.
ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. ఆయన మొదట ఇడుపులపాయ వెళ్లి అక్కడ నుంచి కడప కర్నూలు చిత్తూరు అలా రాయలసీమ జిల్లాలు అన్నీ కూడా చుట్టుముడతారు అని అంటున్నారు. అదే విధంగా చంద్రబాబు కూడా ఈ నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో జనంలోకి వస్తున్నారు. ఆయన కూడా రాయలసీమ జిల్లాల మీదనే దృష్టి పెట్టారు. చిత్తూరు నుంచి నెల్లూరు దాకా మొదలెట్టి ఆయన వరస పర్యటనలు ఈ నెల 31 వరకూ సాగనున్నాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఇద్దరు నేతలూ ఎంచుకున్న ఆ డేట్ లో విశేషం ఏంటి ఆ ముహూర్తం లోని గొప్పతనం ఏంటి అంటే అక్కడే స్పెషల్ ఉంది అని అంటున్నారు. ఈ నెల 26 నుంచి ఫాల్గుణ మాసం మొదలవుతుంది. ఫాల్గుణ మాసం మంచి కార్యాలకు కలసి వచ్చే నెల. ఇక ఆ నెలలో క్రిష్ణ పక్షంలో శుద్ధ విధియ రోజు ఈ నెల 27న వస్తుంది. ఆ రోజు కూడా బుధవారం వస్తోంది. బుధవారం అంటే వినాయకుడి రోజు.
ఇలా అనేక విశిష్టతలు ఆ రోజుకు ఉన్నాయి అందుకే దీనిని వైసీపీ బస్సు యాత్రకు ముహూర్తంగా పెట్టుకుంది. ఇక అదే రోజున చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు ఎంచుకున్నారు. రెండు పార్టీలలో ఉన్న పండితులు సూచించిన రోజు ఇదే కావడం విశేషం. మంచి రోజున ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అవుతుందని అంటారు.
అందుకే చంద్రబాబు జగన్ ఇద్దరూ కూడా బ్రహ్మాండమైన ముహూర్తాన్ని ఎంచుకున్నారు అని అంటున్నారు. రెండు పార్టీలకు ఈసారి ఎన్నికలు కీలకంగా మారుతున్నాయని అంటున్నారు. వరసగా రెండవసారి అధికారంలోకి వస్తే వైసీపీ పూర్తి స్థాయిలో బలపడుతుందని మరింత పునాది పడుతుందని టీడీపీకి ఏపీలో చోటు లేకుండా చేయవచ్చు అన్నది వైసీపీ పెద్దల వ్యూహం.
అదే విధంగా టీడీపీకి ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. ఈసారి కచ్చితంగా గెలవాలి. ఏ మాత్రం చాన్స్ తప్పినా అపుడు ఉనికికే ఇబ్బంది అవుతుంది. అందుకే పొత్తులు పెట్టుకోవడమే కాదు అన్ని వైపుల నుంచి మద్దతు కూడగడుతూ చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టపడుతున్నారు. అభ్యర్ధుల ఎంపికను కూడా ఆయన చాలా ఆలోచించి మరీ పూర్తి చేశారు. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ మంచి ముహూర్తం ఎవరిని దీవిస్తుందో ఎవరికి ముహూర్త బలం కలసి వస్తుందో అన్నది కూడా చూడాల్సి ఉంది.