తగ్గేదేలే... మూడో సీటు ప్రకటించిన చంద్రబాబు!?
ఈ సమయంలో “తగ్గేదేలే” అన్నట్లుగా చంద్రబాబు మరో సీటుకు తమ అభ్యర్థిని ప్రకటించారు.
By: Tupaki Desk | 28 Jan 2024 7:25 PM GMT“ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను వినను”.. అన్నట్లుగా ముందుకు వెళ్తున్నట్లున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా "రా.. కదలిరా" కార్యక్రమాల్లో భాగంగా మండపేట, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. దీనిపై పవన్ కల్యాణ్... “తాను కూడా” అంటూ రాజోలు, రాజానగరం నియోజకవర్గాలను ప్రకటించారు. ఈ సమయంలో “తగ్గేదేలే” అన్నట్లుగా చంద్రబాబు మరో సీటుకు తమ అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పుడు “వాట్ నెక్స్ట్ పవన్” అనేది హాట్ టాపిక్!
అవును... తనతో సంప్రదించకుండానే, పొత్తు ధర్మం పాటించకుండానే టీడీపీ అధినేత చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించారంటూ.. ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... ఇది పొత్తు ధర్మం కాదని.. ఈ ప్రకటనతో కలత చెందిన, ఆందోళన చెందిన జనసైనికులకు క్షమాపణలు అని... రిపబ్లిక్ డే నాడు చేసిన ప్రసంగంలో పవన్ తెలిపారు.
అక్కడితో ఆగని పవన్... చంద్రబాబుకే కాదు తనపై కూడా ఒత్తిడి ఉందని.. కొన్ని ప్రత్యేక పరిస్థితులు తనకూ ఉన్నాయని చెబుతూ.. తాను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నానంటూ రాజోలు, రాజానగరం స్థానాలను ప్రకటించారు. దీనికి... న్యూటన్ గమన నియమాలు అంటూ నాగబాబు ట్వీట్లు కూడా తోడవ్వడంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పొత్తుకు బీటలు వారుతున్నాయా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.
ఇదే సమయంలో ఈ విషయంపై స్పందించిన వైసీపీ నేతలు... ఇదంతా చంద్రబాబు - పవన్ ఆడుతున్న డ్రామా అని.. ఆ రెండు సీట్లూ జనసేనకు చంద్రబాబు ఎప్పుడో ఇచ్చేశారని.. అందుకే ఆ రెండు నియోజకవర్గాల్లోనూ ఇన్ ఛార్జ్ లను ప్రకటించలేదని.. అవి బాబు విదిలించిన సీట్లే తప్ప, పవన్ సాధించుకున్న సీట్లు కాదని.. ఇలా బెట్టు చేస్తున్నట్లు, గట్టిగా నిలబడినట్లు డ్రామాలాడుతూ జనసైనికులను ఏమార్చే పనికి పూనుకున్నాడని అన్నారు!
కట్ చేస్తే... టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరో నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ఇందులో భాగంగా... నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని బాబు ఖారారు చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొలుసు పార్థసారథికి నూజివీడు టికెట్ ఖారారు చేస్తూ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో... ఇది పవన్ కు చంద్రబాబు ఇచ్చిన కొత్త షాక్ అనే కామెంట్లు వినిపించడం మొదలైంది.
కాగా... వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో కొలుసు పార్థసారథి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఇటీవల గుడివాడలో నిర్వహించిన సభలోనే ఆయన టీడీపీలో చేరతారని భావించినప్పటికీ... టికెట్ పై హామీ దక్కకపోవడంతో చేరిక వాయిదా పడింది. పెనమలూరులో బోడే ప్రసాద్ టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతుండటమే దీనికి కారణం!!
ఈ క్రమంలో పార్థసారధికి నూజివీడు టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. దీంతో... ఫిబ్రవరి 1వ తేదీన బాబు సమక్షంలో పార్థసారథి పసుపు కండువా కప్పుకోనున్నారని సమాచారం. అయితే... ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తులో ఏకపక్షంగా టిక్కెట్ల ప్రకటన రచ్చ సాగుతున్న తరుణంలో.. తగ్గేదేలే అన్నట్లుగా చంద్రబాబు నూజివీడు టికెట్ ను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.