Begin typing your search above and press return to search.

పేద రాష్ట్రంలో పెద్ద ఆశలు....బాబుకు పెను సవాల్ !

ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఏపీ పేద రాష్ట్రం. భౌగోళికంగా ఏపీ తెలంగాణా కంటే పెద్దది కావచ్చు

By:  Tupaki Desk   |   17 Jun 2024 7:34 AM GMT
పేద రాష్ట్రంలో పెద్ద ఆశలు....బాబుకు పెను సవాల్ !
X

ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఏపీ పేద రాష్ట్రం. భౌగోళికంగా ఏపీ తెలంగాణా కంటే పెద్దది కావచ్చు. కానీ పూర్తిగా వ్యవసాయిక రాష్ట్రంగా ఉంది. సేవా రంగం లేదు, పరిశ్రమలు లేవు, వ్యాపారాల జోరు లేదు, ఏ ఇతర రంగాల నుంచి ఆదాయలు వచ్చే మార్గాలు లేవు. దానికి తోడు విభజన గాయాలు ఉన్నాయి. అలాగే అప్పుల కుప్పగా ఏపీ మారిపోయింది. పది లక్షల కోట్ల పై చిలుకు అప్పులు ఉన్నాయని ఒక అంచనా.

ఒక విధంగా చెప్పాలంటే ఏపీ ఎన్నడూ లేని విధంగా అనేక రకాలైన సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఈ రాష్ట్రాన్ని ఒడ్డున పడేయగలరు అన్న ఆశతో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబును ఎపీలోని కోట్లాది మంది ప్రజలు అంతా ముక్తకంఠంతో ఎన్నుకున్నారు. ఇంతటి విషమ పరిస్థితుల్లో ఏపీకి బాబు ఒక్కటే ఆశ. ఆయనను చూసుకునే అంతా ధైర్యంగా ఉన్నారు.

చంద్రబాబు తన అర్ధ శతాబ్దపు రాజకీయ అనుభవంతో ఏపీని దేశంలో అన్ని విధాలుగా ముందుకు పరుగులు తీయిస్తారు అని అంటున్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు చూస్తే ఒక వర్గం కాదు ఒక ప్రాంతం అని కాదు అంతా కలసి అతి భారీ మెజరిటీతో బాబుకు పట్టం కట్టారు. చంద్రబాబు మీద ఉన్నత వర్గాలు మధ్యతరగతి దిగువ తరగతి అంతా కలసి మూకుమ్మడి ఓట్లు కూటమికి వేశారు అంటే చంద్రబాబుని చూసుకునే అని అంటున్నారు.

దిగువ తరగతి వర్గం గురించి చెప్పుకోవాలంటే వారంతా బాబు ప్రభుత్వం నుంచి భారీ సంక్షేమ కోరుకుంటున్నారు.వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ తో పాటు ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నదానికి వారు ఆకర్షితులు అవుతున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, తల్లికి వందనం పేరిట ఏటా ఇచ్చే పదిహేను వేల రూపాయలు 18 ఏళ్లు పైబడిన వారి కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకాలలో కొన్నింటిని నెరవేర్చడం ప్రభుత్వానికి చాలా సవాలుగా ఉంటుందని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఉన్నత వర్గాల ఆశలు వేరే విధంగా ఉన్నాయి. వారు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా చంద్రబాబు తీసుకుని రాగలడని నమ్ముతున్నారు. హోదా వస్తే కనుక తమ వ్యాపారాలకు ఎంతో బాగుంటుందని ఆశిస్తున్నారు. అలాగే అమరావతి రాజధాని పూర్తి అయితే అన్ని రంగాలూ పరుగులు పెడతాయని వారు భావిస్తున్నారు. అలాగే వివిధ పన్నుల నుండి మినహాయింపు ప్రత్యేక ప్రోత్సాహకాలను కేంద్రం బాబు చొరవతో మంజూరు చేస్తుందని చాలా మంది ఉన్నత తరగతి ప్రజలు ఆశిస్తున్నారు.

ఇక మధ్యతరగతి వర్గాలు చూస్తే పన్నులు తగ్గించాలని తమ పైన భారాలు మోపకుండా చూడాలని వారు కోరుకుంటున్నారు. చెత్త పన్ను రద్దు చేయాలని పెరిగిన విద్యుత్ ఇంటి పన్నులు తగ్గించాలని వారి కోరికగా ఉంది. అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా తమ బిడ్డలకు ఉపాధి మార్గాలని చూపించాలని వారు కోరుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కూడా మధ్యతరగతి డిమాండ్ గా ఉంది.

ఇలా అన్ని వర్గాల ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే ఆ ఫలాలు తాము అందుకోవాలని వారు ఆలోచిస్తున్నారు. అయితే ఏపీ పుట్టెడు కష్టాలలో ఉంది. ఈ పేద రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అయ్యారు. అన్ని వర్గాల సంక్షేమం చూడడం రాష్ట్ర పెద్దగా బాబుకు తప్పనిసరి.

ఆయన విశేష అనుభవంతో చేయగలరనే అంతా అంటున్నారు. అదే సమయంలో పరిస్థితులు కూడా అనుకూలించాలని అంటున్నారు. ప్రజల ఆకాంక్షలు చూస్తే చాలా పై స్థాయిలో ఉన్నాయి. మరి వాటిని బాబు సాకారం చేయడం అంటే అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఏదీ చేతిలో లేదు. అందువల్ల బాబుకు టైం ఇవ్వాల్సి ఉంటుంది. బాబు ఒక్కోటి సాధించుకుని రాగలరు అని అంతా నమ్ముతున్నారు. దీంతో వివిధ వర్గాల ప్రజల్లో కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలను బాబు ఏ స్థాయిలో సంతృప్తి పరచగలరన్నది రానున్న రోజులు తేల్చనున్నాయి.