Begin typing your search above and press return to search.

పవన్‌ ఒత్తిడి .. కీలక పదవి జనసేనకే!

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్తోంది.

By:  Tupaki Desk   |   10 July 2024 10:01 AM GMT
పవన్‌ ఒత్తిడి .. కీలక పదవి జనసేనకే!
X

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం కీలక పదవులు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపైన దృష్టి సారించింది. అందులోనూ పొత్తు ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీని కూడా చంద్రబాబు దృష్టిలో పెట్టుకుంటున్నారు.

ఇప్పటికే శాసనమండలిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా చెరో ఒకటి టీడీపీ, జనసేన పంచుకున్నాయి. టీడీపీ తరఫున సి.రామచంద్రయ్య, జనసేన తరఫున హరిప్రసాద్‌ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

అలాగే కీలకమైన అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)గా టీడీపీ తరఫున ముఖ్య కేసులు వాదించే దమ్మాలపాటి శ్రీనివాస్‌ ను నియమించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఏజీగా వ్యవహరించారు,

ఇక అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ)గా జనసేన లీగల్‌ సెల్‌ చైర్మన్, ప్రముఖ న్యాయవాది ఇవన సాంబశివ ప్రతాప్‌ ను ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత ఉత్తర్వులు జారీచేశారు.

వాస్తవానికి అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పోస్టు కోసం టీడీపీ తరఫున కేసులు వాదించే సీనియర్‌ న్యాయవాదులు పోటీపడ్డారు. మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ను ప్రసన్నం చేసుకుని.. ఈ పోస్టును పొందడానికి ప్రయత్నించారు. ఆయన పేరు కూడా దాదాపు ఖరారైంది.

అయితే జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఏఏజీ పదవిని తమకు కేటాయించాల్సిందేనని గట్టిగా కోరారని తెలుస్తోంది. పొత్తు ధర్మాన్ని పాటించాలని సూచించడంతో చంద్రబాబు జనసేన లీగల్‌ సెల్‌ చైర్మన్‌ ను ఈ పదవికి ఎంపిక చేశారు.

కాగా అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ గా నియమితులైన సాంబశివ ప్రతాప్‌.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడికి చెందినవారు. ఆయనకు ఉమ్మడి హైకోర్టు, విభజిత ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా అపార అనుభవం ఉంది.

2014లో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి సాంబశివ ప్రతాప్‌ న్యాయ సేవలు అందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన పార్టీ లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయనకు వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరుంది.

1984లో సాంబశివ ప్రతాప్‌ న్యాయవాదిగా ఎన్‌ రోల్‌ అయ్యారు. 1996 నుంచి 2002 మధ్యలో మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌ గా ఆంధ్రా ప్రాంతపు మున్సిపాలిటీల తరఫున సాంబశివ ప్రతాప్‌ పనిచేశారు. 2016–19 మధ్య ఉమ్మడి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా తన వాదనలు వినిపించారు. అలాగే పలు బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రభుత్వరంగ సంస్థలకు స్టాండింగ్‌ కౌన్సెల్‌ గానూ చేశారు.

తన నియామకంపై సాంబశివ ప్రతాప్‌.. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కు, సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.