చంద్రబాబును కలిసేందుకు... కొత్త విధానం!
దీనిలో భాగంగా.. చంద్రబాబును కలుసుకుని.. సమస్యలు చెప్పుకొనేందుకు టీడీపీ కొత్త విధానం అందు బాటులోకి తీసుకువచ్చింది
By: Tupaki Desk | 1 July 2024 12:30 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నారా? ఆయనను కలిసి మీ సమస్యలను చెప్పుకొని పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే.. ఇకపై ఆయనను కలుసు కునేందుకు ఇప్పటి వరకు ఉన్నట్టు కార్యాలయాల ముందు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆయన కోసం కుప్పలు తెప్పలుగా తరలి వస్తున్న వారిలో మీరు కూడా ఒకరుగా మారాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకునేందుకు పార్టీ రెడ్ కార్పెట్ పరుస్తోంది.
దీనిలో భాగంగా.. చంద్రబాబును కలుసుకుని.. సమస్యలు చెప్పుకొనేందుకు టీడీపీ కొత్త విధానం అందు బాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా.. చంద్రబాబును ఎలాంటి రిస్క్ లేకుండానే కలుసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రధానంగా రెండు మార్గాలను టీడీపీ సూచించింది. వీటి ద్వారా చంద్రబాబు అప్పాయింట్‌మెంటును సాధారణ ప్రజలకు ఇప్పిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని పార్టీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించారు.
ప్రజలు తమ వ్యక్తగత సమస్యలు చెప్పుకొనేందుకు.. ఓ ఫోన్ నెంబర్‌ను పార్టీ అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు వారి సమస్యలను 7306299999కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు. తద్వారా.. ఆయా సమస్యలను విన్న పార్టీ నాయకులు.. చంద్రబాబు అప్పాయింట్‌మెంటును ఖరారు చేస్తారు. అదేవిధంగా సమయం, స్థలం కూడా వారే సూచిస్తారు. అప్పుడు వెళ్తే.. రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ.. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి సమస్యలను చెప్పుకొనే అవకాశం ఉంటుంది.
మరొకటి పార్టీ ట్విట్టర్ ఎకౌంట్‌లో కూడా సమస్యను నమోదు చేసుకోవడం ద్వారా.. చంద్రబాబు అప్పాయింట్ ను పొందొచ్చు. తద్వారా.. ప్రజల విలువైన సమయాన్ని.. వృధా కాకుండా.. పార్టీ కార్యాలయాల్లో రద్దీని తగ్గించేందుకు.. కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ కోరింది.