Begin typing your search above and press return to search.

కాపులకు రిజర్వేషన్ వరం ఇవ్వనున్న బాబు ?

దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కారణం. అలాగని మిగిలిన సామజిక వర్గాలు కూడా తక్కువ చేయలేదు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 4:30 PM GMT
కాపులకు రిజర్వేషన్ వరం ఇవ్వనున్న బాబు ?
X

కాపులకు పెద్ద పీట వేయడానికి టీడీపీ కూటమి ప్రయత్నం చేస్తోంది. కోస్తా సీడెడ్ అన్న సంబంధం లేకుండా ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కాపులు టీడీపీ కూటమికి జై కొట్టారు. అందులో పెద్ద వాటాగా కాపులు ఉన్నారు. గోదావరి జిల్లాలో కాపులతో పాటు రాయలసీమలోని బలిజలు కూడా కూటమికే ఓటేసి గెలిపించారు.

దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కారణం. అలాగని మిగిలిన సామజిక వర్గాలు కూడా తక్కువ చేయలేదు. అంతా కలసి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అయితే ఏపీలో రాజకీయాలను తారుమారు చేయగల సత్తా ఉన్నా బలమైన సామాజిక వర్గంగా కాపులకు గుర్తింపు ఉంది. వారు తలచుకుంటే ఏదైనా ప్రభుత్వం గద్దెనెక్కగలదు, లేకపోతే గద్దె దిగగలదు.

గత కొన్ని ఎన్నికలుగా ఇదే విషయం స్పష్టం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాపులు కూటమి ప్రభుత్వం మీద కోటి ఆశలు పెట్టుకుని ఆశగా చూస్తున్నారు. ముఖ్యంగా గత మూడు దశాబ్దాలుగా కాపులకు తీరని కోరికగా ఒక్కటే ఉంది. కాపులకు రిజర్వేషన్లు కావాలి.

వారిని బీసీలలో చేర్చాలని డిమాండ్ ఉంది. దాని మీద కాపు నేత ముద్రగడ పద్మనాభం 1994 నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇక కాపుల విషయంలో గత ప్రభుత్వాలు ఏమి చేసినా చంద్రబాబు 2014లో వచ్చినపుడు చేయాలని ప్రయత్నించారు. కానీ అది జరగలేదు, దానికి చట్టపరమైన అవరోధాలు ఏర్పాడ్డాయి.

అయితే ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వం మరో మారు అధికారంలోకి వచ్చింది. కాపులకు వారి రిజర్వేషన్ల కోరిక తీర్చి వరం ప్రసాదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లు అంటే అది మళ్లీ ఇబ్బందుల్లో పడుతుంది. పైగా బీసీలు కూడా ఫైర్ అవుతారు. రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా ఉండాలని సుప్రీం కోర్టు తీర్పు ఒకటి ఉంది.

దాంతో చంద్రబాబు మరో మార్గంలో వెళ్తారని అంటున్నారు. ఈబీసీ కోటా అని కేంద్రం తెచ్చింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆ విధంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. అలా పది శాతం రిజర్వేషన్లను కేటాయించారు. అందులో నుంచి అయిదు శాతం రిజర్వేషన్లు కాపులకు ఇవ్వాలని చంద్రబాబు సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

గతంలో అధికారంలో ఉన్నపుడే చంద్రబాబు ఈబీసీ కోటాలో కాపులను పెట్టారు. దాని మీద జీవో ఇచ్చారు. అయితే ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ జీవో చెల్లదని పేర్కొంది. దానితో పాటు అది అమలు కాకుండా ఆగిపోయింది. ఈసారి మాత్రం ఎలాంటి చట్టబద్ధమైన ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఈబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని బాబు గట్టిగా నిర్ణయించుకున్నారు అని అంటున్నారు.

కేంద్రంలో ఎటూ ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తూ టీడీపీ కీలకంగా ఉంది. దాంతో ఏ విధంగా ఈ కోటా అమలు చేయడానికి ఇబ్బందులు లేకుండా కేంద్ర సాయం కూడా నూరు శాతం తీసుకోవాలని చూస్తున్నారు అని తెలుస్తోంది.

మొత్తం మీద చూస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తే కనుక మాట నిలబెట్టుకున్నట్లుగా అవుతుంది. అదే సమయంలో కాపుల మద్దతు మరింతగా పొందినట్లు అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరిరామజోగయ్య వంటి వారు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని లేఖలు రాస్తున్నారు. కాపులు కూడా ఇదే విధంగా ఆశతో ఉన్నారు. దాంతో అన్నీ కనుక ఒక లెక్కకు వస్తే సాధ్యమైనంత తొందరలో కాపులకు రిజర్వేషన్లు దక్కడం ఖాయమని తెలుస్తుంది.

మరో వైపు చూస్తే కాపు కార్పోరేషన్ కి దండీగా నిధులు ఇవ్వడం ద్వారా కాపుల మనసు చూరగొనేందుకు కూడా బాబు ఇంకో మాస్టర్ ప్లాన్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇవన్నీ రానున్న రోజులలోనే జరుగుతాయని అంటున్నారు. చూడాలి మరి కాపులకు ఈ శుభవార్తలు వినే రోజు ఎంత తొందరగా వస్తుందో.