చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ మౌన వైఖరి?
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 13 Sep 2023 5:27 AM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలువురు నేతలు, పార్టీ అధినేతలు స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టును ఖండించారు. మరికొంతమందైతే... వంద గొడ్లను తిన్న రాబందు అంటూ కామెంట్స్ చేశారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాకపోవడం వైరల్ గా మారింది.
అవును... చంద్రబాబు అరెస్ట్ అనంతరం దర్శకుడు కే రాఘవేంద్ర రావు తప్ప మరో వ్యక్తి స్పందించినట్లు లేదు. తాజాగా ఈ విషయంపై నిర్మాత సీరియస్ గా రియాక్ట్ అవ్వడంతో.. ఈ అంశంపై సీరియస్ చర్చ మొదలైంది. ఇందులో భాగంగా ముఖ్యంగా అశ్వినీదత్, మురళీమోహన్, సురేష్ బాబు లతోపాటు రాజమౌళి, బోయపాటి శ్రీను ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
సాధారణంగా టాలీవుడ్ జనాలకు టీడీపీతో అవినాభావసంబంధం ఉందని అంటుంటారు. టాలీవుడ్ లో మెజారిటీ జనం చంద్రబాబు సానుభూతిపరులని చెబుతుంటారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నారనో ఏమో కానీ... చంద్రబాబు అరెస్ట్ పై అంతా ఒక్కసారిగా సైలంట్ అయిపోయారు. అసలు ఏమీ జరగలేదన్నట్లుగా ఉన్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి అశ్వనీదత్, సురేష్ బాబు లు చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు అని చెబుతుంటారు. అశ్వనీదత్ కీ బాబు కీ ఉన్న సంబంధం కాసేపు పక్కనపెడితే... సురేష్ బాబుకు విశాఖలో స్టూడియోకి స్థలం ఇచ్చింది చంద్రబాబే అనేది తెలిసిన విషయమే. ఇక మురళీమోహన్ తో బాబుకి బంధం గురించి ప్రత్యేకంగా చెప్పే పనిలేదని అంటుంటారు. ఇదే సమయంలో బోయపాటి శ్రీను, రాజమౌళి లాంటి వారికి చంద్రబాబుతో సాన్నిహిత్యం వుందని చెబుతుంటారు.
అయినప్పటికీ ఇలాంటి వాళ్లు కూడా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు. దీంతో ఇండస్ట్రీ జనాలు స్వార్ధపరులా.. లేక, జాగ్రత్తపరులా అనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయంలో ఎవరి వ్యాపారాలు వారికి ఉన్నాయి, ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి కాబ్బట్టి... న్యూట్రల్ గా ఉంటున్నారని అంటున్నారు పరిశీలకులు.
ఆ సంగతి అలా ఉంటే... ఈ విషయంపై దర్శకుడు రాం గోపాల్ వర్మ తాజాగా ఆన్ లైన్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా "హేయ్ చంద్రబాబు.. మిమ్మల్ని అరెస్టు చేయడాన్ని మీకు సన్నిహితంగా ఉండే సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేదు. వాళ్లని ముందు నుంచి పొడిచి చంపాలని మీకు అనిపించలేదా" అంటూ ట్వీట్ చేశారు.
దీంతో వ్యవహారం మరింత చర్చనీయాంశం అయ్యింది. ఇదే సమయంలో... అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలూ విలన్లూ లేరీ లోకంలో అంటూ ఇండస్ట్రీ జనాలపై బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇకపై అయినా ఇండస్ట్రీ జనాలు, టాలీవుడ్ పెద్దలు.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తారా.. లేక, సైలంటుగా ఎవరి పని వారు చూసుకుంటారా అనేది వేచి చూడాలి!