Begin typing your search above and press return to search.

సీఐడీ వేయాల్సిన పిటిషన్ మంగళవారానికి ఎందుకు మారింది?

కౌంటర్ దాఖలుకు ఆదేశాలు ఇస్తానని బాబు లాయర్లను ఉద్దేశించి న్యాయమూర్తి చెప్పగా.. తాము వాదనలు వినిపిస్తామని వారు చెప్పారు

By:  Tupaki Desk   |   14 Sep 2023 4:31 AM GMT
సీఐడీ వేయాల్సిన పిటిషన్ మంగళవారానికి ఎందుకు మారింది?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కావటం తెలిసిందే. ఈ వ్యవహారంలో సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బాబు దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ వేయాల్సిన అధికారులకు మంగళవారం వరకు టైం ఎందుకు దక్కింది? అన్న ప్రశ్నకు చూస్తే.. బుధవారం కోర్టులో చోటు చేసుకున్న పరిణామాలే కారణమని చెప్పాలి.

సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సిద్ధమవుతుండగా.. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ తాను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నట్లుగా న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి పేర్కొంటూ.. 'నేను పీపీగా పని చేస్తున్న సమయంలో కొన్ని కేసుల్లో పిటిషనర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా హాజరయ్యాను. దీనిపై మీకు అభ్యంతరం ఉంటే విచారణ నుంచి తప్పుకుంటా' అని పేర్కొన్నారు.

దీనికి లూథ్రాతో పాటు దమ్మాలపాటి శ్రీనివాస్.. పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. వాదనలు మీరే వినాలని గట్టిగా కోరారు. దీంతో.. న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి విచారణ చేపట్టారు. లూథ్రా వాదనలు మొదలు పెట్టే వేళలో అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జోక్యం చేసుకుంటూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని.. అందుకు తగిన సమయం కావాలని కోర్టును కోరారు.

కౌంటర్ దాఖలుకు ఆదేశాలు ఇస్తానని బాబు లాయర్లను ఉద్దేశించి న్యాయమూర్తి చెప్పగా.. తాము వాదనలు వినిపిస్తామని వారు చెప్పారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు. లూథ్రా తన వాదనలు వినిపిస్తూ చంద్రబాబు అరెస్టు అక్రమంగా పేర్కొంటూ.. పబ్లిక్ సర్వెంట్ ను విచారించాలన్నా.. కేసు నమోదు చేయాలన్నా అందుకు గవర్నర్ నుంచి అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నట్లుగా చెప్పారు. ఈ కేసులో అలాంటి అనుమతి తీసుకోలేదని.. ఇది చట్టవిరుద్ధంగా పేర్కొన్నారు.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం పబ్లిక్ సర్వెంట్ ను విచారించాలన్నా.. కేసు నమోదు చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి అని పేర్కొంటూ.. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదన్నారు. 2018జులై తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. సుప్రీంతీర్పు ప్రకారం 2018 తర్వాత నమోదయ్యే కేసులకు గవర్నర్ అనుమతి తప్పనిసరిగా పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసు.. అరెస్టు.. రిమాండు ఇవన్నీ చెల్లవని వాదనలు వినిపంచారు.

దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి జోక్యం చేసుకుంటూ.. లూథ్రా పూర్తి స్థాయి వాదనలు వినిపిస్తున్నారని.. తాము కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు వినిపించుకోవచ్చన్నారు. ఈ సమయంలో లూథ్రా వాదనలు వినిపిస్తూ సెక్షన్ 17ఏ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉందని.. అందుకే ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలన్న వాదనకు స్పందించిన న్యాయమూర్తి అవతలిపక్షానికి అవకాశం ఇద్దామన్నారు. కౌంటర్ల దాఖలకు ఎంత టైం కావాలని ప్రశ్నిస్తూ.. శుక్రవారానికి కౌంటర్ దాఖలు చేయాలని అదనపు ఏజీకి చెప్పారు.

అందుకు స్పందించిన ఆయన అంత తక్కువ సమయం సరిపోదన్నారు. నిబంధనల ప్రకారం రిమాండ్ విధించిన మొదటి 14 రోజుల్లోపు పోలీస్ కస్టడీ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని.. అందుకు అనుగుణంగానే పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. దీంతో.. విచారణను సోమవారానికి వాయిదా వేశారు. అయితే.. సోమవారం వినాయకచవితి.. సెలవు అన్న విషయాన్ని ఏఐజీ ప్రస్తావించటంతో అలా అయితే.. విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో.. శుక్రవారం వాదనలు కాస్తా సోమవారానికి.. వినాయకచవితి కారణంగా మంగళవారానికి వాయిదా పడిన పరిస్థితి.