చవితి పండుగ జైలులోనే... బాబు ఫిక్స్ అయినట్లే ...!
ఈ నెల 18న చూస్తే వినాయకచవితి పండుగ వచ్చింది. దాంతో చంద్రబాబు అక్కడే ఆ రోజు ఉండాల్సి వస్తుందని అంటున్నారు
By: Tupaki Desk | 13 Sep 2023 3:30 PM GMTతెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుకు ముందు విజనరీ అన్న బిరుదుని వాడతారు తెలుగుదేశం అభిమానులు అనుచరులు కూడా పదే పదే ఆ మాటను ఉపయోగిస్తారు. ఇక నారా లోకేష్ అయితే పాదయాత్రలో పదే పదే బాబు విజనరీ, జగన్ ప్రిజనరీ అంటూ ఎకసెక్కాలు ఆడుతూ వచ్చారు.
ఇపుడు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ తో బాబు ప్రిజనరీ అయ్యారు. అంతే కాదు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఆయన జైలు గోడల మధ్య తొలి పండుగ అయిన వినాయకచవితిని జరుపుకోబోతున్నారు. నిజానికి ఎంత బిజీగా ఉన్నా చంద్రబాబు పండుగలూ వేడుకలు మిస్ కారు, వాటిని కుటుంబ సభ్యులతో కలసి చేసుకుంటారు.
కానీ ఇపుడు చూస్తే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉనారు. చంద్రబాబు మీద సీఐడీ వేసిన కేసునే మొత్తం కొట్టేస్తారు అనుకుంటూ హై కోర్టుకు బాబు తరఫున న్యాయవాదులు వెళ్లారు. అయితే ఈ క్వాష్ పిటిషన్ మీద ప్రభుత్వం తరఫున వాదనలు సైతం వినాలని కోర్టు భావించడంతో విచారణ కాస్తా ఈ నెల 19కి వాయిదా పడింది.
ఈ నెల 18న చూస్తే వినాయకచవితి పండుగ వచ్చింది. దాంతో చంద్రబాబు అక్కడే ఆ రోజు ఉండాల్సి వస్తుందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే చంద్రబాబు శనివారం అరెస్ట్ అయ్యారు. అంటే ఈ నెల 19 నాటికి ఆయన అరెస్ట్ అయి జైలులో ఉండే టైం పది రోజులు అవుతుంది అన్న మాట.
ఇది బాబు కానీ ఆయన అనుచరులు టీడీపీ పెద్దలు కానీ అసలు ఊహించని పరిణామం అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ కి ఎవరైనా ప్రయత్నించినా ముందస్తు బెయిల్ తో ఆయన తప్పించుకుంటారు అని అంతా అనుకునే వారు. కానీ ఇపుడు సీన్ చూస్తే బాబు వంటి వారు దిగ్గజ నేత ఏకంగా పది రోజుల పాటు జైలులో ఉండడం అంటే రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందని అంటున్నారు.
రిమాండ్ ఖైదీగా బాబుని టీడీపీ శ్రేణులు అసలు ఒప్పుకోలేని పరిస్థితి ఉందని అంటున్నారు. బాబుని రిమాండ్ కి తరలించాలి అని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఆయన తరఫున న్యాయవాదులు కోరింది కూడా హౌజ్ రిమాండ్. ఎందుకంటే బాబు జైలు ఈ రెండూ కలిపి వారు చూడలేకపోతున్నారు. కానీ ఏసీబీ కోర్టు హౌజ్ కస్టడీ అభ్యర్ధనను తిరస్కరించింది. దాంతో బాబు జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది
ఇంటి నుంచి భోజనం వస్తున్నా బాబుకు భద్రత విషయంలో ఎలాంటి ఢోకా లేకపోయినా కూడా ఆయన జైలులో ఉన్నారన్న భావనే టీడీపీని రగిలిస్తోంది. కదిలిస్తోంది. మరి బాబుకు ఈ నెల 19న జరిగే హై కోర్టు విచారణలో అయినా ఊరట దక్కుతుందా దానికి ఒక రోజు ముందే వచ్చే గణనాధుడు పండుగ బాబుకు అభయం ఇస్తుందా అంటే వేచి చూడాల్సిందే.