చంద్రబాబు అరెస్ట్ ... షాకింగ్ రియాక్షన్
దాంతో బాబు అరెస్ట్ అయితే ఏపీలో ఏదో జరిగిపోతుంది అని అంతా అనుకున్న వేళ షాకింగ్ రియాక్షన్ కనిపిస్తోంది.
By: Tupaki Desk | 9 Sep 2023 9:00 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ముమ్మారు సీఎం గా ఉన్న వ్యక్తి, నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాలలో కొనసాగిన నేత అయిన బాబుని అరెస్ట్ చేస్తే ఏపీలో రాజకీయ భూకంపం చెలరేగాలి. అలా జరుగుతుందనే అంతా ఇన్నాళ్ళూ అనుకున్నారు. బాబుని అరెస్ట్ చేసి చూడడని అని సవాళ్ళు కూడా అప్పట్లో చేసిన వారు ఉన్నారు.
దాంతో బాబు అరెస్ట్ అయితే ఏపీలో ఏదో జరిగిపోతుంది అని అంతా అనుకున్న వేళ షాకింగ్ రియాక్షన్ కనిపిస్తోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం కూడా బాబు అరెస్ట్ తరువాత పర్యవసానాలు ఏమైనా ఉంటాయేమోనని ఆలోచించి చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఏకంగా ఆర్టీసీ బస్సులను కూడా రోడ్ల మీదకు రానీయకుండా చేసింది.
అవి డిపోలకే పరిమితం అయ్యాయి. ఇక మరో వైపు చూస్తే టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసింది.ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది. అయినా సరే టీడీపీ చిన్నా చితకా పార్టీ కాదు కదా. నేతలను ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేయగలరు, చేసినా క్యాడర్ బేస్డ్ పార్టీ అయిన టీడీపీ ఎంతలా ఉద్యమించాలి.
కానీ అంతా టీవీ డిబేట్ కే పరిమితం అయ్యారు. అందరూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఖండిస్తున్నారు తప్ప రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు అయితే గట్టిగా చేయకపోవడమే చిత్రంగా ఉంది. దీంతో టీడీపీకి అధినాయకుడు అయిన చంద్రబాబుని అరెస్ట్ చేస్తే రియాక్షన్ ఈ విధంగా ఉందా అని అనుకునేలా సీన్ ఉంది.
ఇక చంద్రబాబు తరువాత టీడీపీకి అంతటి నేత అని చెప్పుకునే నారా లోకేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగి తన ఆవేశాన్ని ప్రదర్శించారు. నా తండ్రిని చూడవద్దా అంటూ ఆయన ఎట్టకేలకు అనుమతి సాధించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు. కానీ ఈ కీలక సమయంలో బాబు అరెస్ట్ వంటి సీరియస్ ఘటనను ఏ విధంగా డీఎల్ చేయాలో టీడీపీ నేతలకు తెలియడంలేదా అన్న చర్చ అయితే వస్తోంది.
ఇదే ఈపాటికి వేరే ఏ సీనియర్ నేత అరెస్ట్ అయినా చంద్రబాబు లీడర్ షిప్ లో వచ్చే సూచనలు కానీ ఇచ్చే డైరెక్షన్స్ కానీ వేరే లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. అంటే చంద్రబాబు నాయకత్వ దక్షత ఆయన వ్యూహాలు టీడీపీలో ఇపుడు ఎవరికి పట్టుబడ్డాయి అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తోంది. రాజే అరెస్ట్ అయి ఇబ్బందుల్లో ఉంటే సైన్యానికి దిశా నిర్దేశం కరవు అయిందా లేక బాబు లాంటి నేత టీడీపీలో ఎవరూ లేరా అన్నది కూడా చర్చకు వస్తోంది.
నారా లోకేష్ మొత్తం టీడీపీని లైన్ లో పెట్టి నడిపించాల్సిన రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయనే పోలీసులతో గొడవ పడుతున్న నేపధ్యం ఉంది. మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ అయితే ఏదో జరిగిపోతుంది అని ఇన్నాళ్ళూ టీడీపీ వారే కాదు తటస్థులు రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారూ కూడా అనుకుంటూ వచ్చారు. కానీ బాబు వంటి నేత అరెస్ట్ అయినా ఉదయం పదకొండు గంటలకే బస్సులన్నీ రోడ్డు ఎక్కేశాయి.
ప్రజలు ఎవరి దైనందిన పనులలో వారు బిజీ అయిపోయారు ఇది జస్ట్ అరెస్ట్. ఇది జస్ట్ పాలిటిక్స్ అని మాత్రమే అంతా అనుకునేలా సీన్ ఉంది. ఒక విధంగా వ్యూహాత్మకంగా వైసీపీ ఈ విషయంలో వ్యవహరించింది అని అంటున్నారు. రేపటి రోజున ఈ అరెస్ట్ ని సింపతీగా మార్చుకోవాలన్నా ఇపుడు జన భాగస్వామ్యంతో చేసే ఆందోళనకే దానికి బలం చేకూరుస్తాయి. కానీ ఇప్పటికైతే అలా ఏమీ జరగకపోవడంతోనే వైసీపీ లైట్ తీసుకుంది అంటున్నారు. అందునా అధినేత, ముఖ్యమంత్రి జగన్ విదేశాలలో ఉండగా ఈ అరెస్ట్ జరిగింది. లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కడా బ్రేక్ కాలేదు అంటే వైసీపీ పకడ్బందీ వ్యూహాంతోనే ముందుకు వచ్చిందనుకోవాలి అంటున్నారు.