ఏపీలో కలకలం: ఎక్కడికక్కడ తమ్ముళ్ల గృహ నిర్బంధం
ఈ రోజు(శనివారం) ఉదయం 6 గంటల నుంచి రంగంలోకి దిగిన పోలీసులు.. నాయకులను గడప దాటకుండా చేశారు.
By: Tupaki Desk | 9 Sep 2023 5:27 AM GMTఏపీలో కలకలం రేగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు దరిమిలా.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రకటిత నిర్బంధం విధించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కకుండా ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక నాయకులు, మాజీ మంత్రులను పోలీసులు ఇళ్లకే పరిమితం చేశారు. ఈ రోజు(శనివారం) ఉదయం 6 గంటల నుంచి రంగంలోకి దిగిన పోలీసులు.. నాయకులను గడప దాటకుండా చేశారు.
విజయవాడ గొల్లపూడి లో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గృహ నిర్బంధం చేశారు. అయితే.. ఈ సందర్భంగా దేవినేని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్టు ముమ్మాటికి అప్రజాస్వామికమని విమర్శించారు. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులను ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాక సామాన్య ప్రజలు చంద్రబాబు అరెస్టుపై ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు.
కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసమే పోలీస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని దేవినేని మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా వేలాది మంది పోలీసులతో తెలుగుదేశం పార్టీ నాయకులను నిర్బంధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గుడివాడలో నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రావి వెంకటేశ్వరావుని పోలీసు లు హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయం దగ్గర భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున రావి ఇంటి వద్దకు చేరుకుని నిరసనకు దిగారు.
పరిటాల శ్రీరామ్ అరెస్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. అయితే, మెడలో నల్ల కండువా ధరించి చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపారు.
మాజీ ఎంపి కొనకళ్ల నారాయణను పోలీసులు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలోని ఆయన స్వ గృహంలో నిర్భంధించారు. అయితే, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, జగన్ కళ్లలో అనందం కోసమే చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. సంబంధం లేని కేసుల్లో చంద్రబాబును ఇరికించారని అన్నారు. ఆర్ధిక నేరాలు ఉన్నాయి కాబట్టే గతంలో జగన్ ను అరెస్ట్ చేశారని, చంద్రబాబు అరెస్ట్ తో జగన్ పతనం ప్రారంభమైందని దుయ్యబట్టారు.